Israel : వీటిని ఓడిస్తే.. ఇజ్రాయెల్‌ని గెలిచినట్టే!!

by HARISH SP |   ( Updated:2024-10-03 12:13:18.0  )
Israel : వీటిని ఓడిస్తే.. ఇజ్రాయెల్‌ని గెలిచినట్టే!!
X

కర్ణుడికి కవచకుండల్లాగా ఇజ్రాయెల్‌కు ఐరన్ డోమ్ రక్షణ కల్పిస్తున్నది. చిన్నపాటి రాకెట్ దాడులను కూడా ముందే పసిగట్టి ఆకాశంలోనే పేల్చేసే సత్తా దీని ప్రత్యేకత. 2023 అక్టోబర్‌లో గాజా భూభాగం నుంచి దాదాపు 5 వేల రాకెట్లను పాలస్తీనా తీవ్రవాదులు ఇజ్రాయెల్‌పై ప్రయోగించినా అందులో 5శాతంలోపే ఐరన్ డోమ్ నుంచి తప్పించుకున్నాయి. నిజానికి ఈ తరహా రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్ మరో మూడు ఉన్నాయి. అవి 1. డేవిడ్స్ స్లింగ్ 2. యారో 2 3. యారో 3. ఈ వ్యవస్థలు ఇజ్రాయెల్ భూభాగానికి బుల్లెట్ ప్రూఫ్‌లా కాపాడుతున్నాయి. శత్రు విమానాలు కాదు కదా.. మిసైళ్లు ప్రయోగించాలన్నా ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాల్సి వస్తున్నది. ఈ రక్షణ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి.? వీటిలో వాడే మిసైళ్లు.. వాటి రేంజ్ సహా ఖరీదు వంటి విషయాలు తెలుసుకుందాం.

ఐరన్ డోమ్

1990లో లెబనాన్ ఉత్తర ఇజ్రాయెల్‌పై తొలిసారి స్వల్ప శ్రేణి రాకెట్లతో దాడి చేసింది. ఈ ఘటనతో ఇజ్రాయెల్ భద్రతా వ్యవస్థపై అనుమానాలు మొదలయ్యాయి. చుట్టూ శత్రుదేశాలు ఉండటంతో వారినుంచి చిన్నపాటి మిసైల్, రాకెట్ దాడుల నుంచి రక్షించుకోవడం ఇజ్రాయెల్‌కు తలకుమించిన భారంగా మారింది. ప్రతి రోజూ దేశ సరిహద్దుల్లో జెట్ ఫైటర్లతో భద్రత నిర్వహించడం ఆర్థికంగానూ భారంగా మారింది. ఈ నేపథ్యంలోనే యాంటీ మిస్సైల్ వ్యవస్థ ఏర్పరచుకోవడమే ఈ సమస్యకు పరిష్కారంగా ఇజ్రాయెల్ మిలిటరీ నిపుణులు భావించారు. అప్పటివరకు ఈ తరహా వ్యవస్థలు యుద్ధ నౌకలు, జలాంతర్గాములకు మాత్రమే ఉండేవి. వీటిని భూభాగ రక్షణకు వినియోగించాలన్న ఇజ్రాయెల్ ప్రతిపాదనను విని అమెరికా మిలిటరీ నిపుణులు నవ్వుకున్నారు. శత్రువు నిర్మూలన మినహా ఈ తరహా వ్యవస్థలు ఎందుకూ పనికిరావని వారు కొట్టివేసినా.. ఇజ్రాయెల్ తన ప్రయత్నాన్ని మానలేదు. మొత్తానికి 2004లో ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లో కీలక పదవిలో ఉన్న బ్రిగేడియర్ జనరల్ డానీ గోల్డ్ ఐరన్ డోమ్ వ్యవస్థకు రూపకల్పన చేశారు. తొలుత 10కిలోమీటర్ల దూరంలో శత్రువునుంచి వచ్చే రాకెట్, మిసైల్స్‌ని గుర్తించేలా తయారుచేసినా.. ప్రస్తుతం దాని రేంజ్ 70కిలోమీటర్లకు పెరిగింది. ఈ ఐరన్ డోమ్ వ్యవస్థలో మూడు ప్రధాన అంగాలు ఉంటాయి. 1. రాడార్ 2. కంట్రోల్ యూనిట్ 3. లాంచర్. ఏదైనా శత్రు దేశం నుంచి స్వల్పశ్రేణి రాకెట్ లాంచర్, మిసైల్ ప్రయోగించినా 70 కిలోమీటర్ల పరిధిలో అయితే ఐరన్ డోమ్ రాడార్ గుర్తిస్తుంది. దాని దిశ, వేగం, లక్షిత ప్రాంతం సహా రాకెట్, మిసైల్ బరువును కూడా గుర్తిస్తుంది. బరువు కారణంగా అందులో ఉన్న పేలుడు పదార్థాల తీవ్రత కూడా గుర్తిస్తుంది. వెంటనే కంట్రోల్ రూంలో ఉన్న ఎమర్జెన్సీ అలారం మోగుతుంది. ఆపై కంట్రోల్ యూనిట్ ఆటోమేటిక్‌గా ఆ రాకెట్, మిసైల్‌ను లాక్ చేసి, లాంచర్ నుంచి ఎన్ని రాకెట్లను ప్రయోగించాలన్న విషయాన్ని కూడా కంట్రోల్ రూం మానిటర్లపై అప్ డేట్ చేస్తుంది. కంట్రోల్ రూం ఇన్ చార్జీ మ్యానువల్ గా లాంచ్ బటన్ నొక్కగానే ఒక్కసారిగా అవసరాన్ని బట్టి ఒకటినుంచి వందల రాకెట్లు నింగిలోకి దూసుకెళ్లి శత్రువు ప్రయోగించిన రాకెట్ ను గాల్లోనే పేల్చేస్తుంది. దీనిని 2013 నుంచి అధికారికంగా వినియోగిస్తున్నారు. ఐరన్ డోమ్ లో వినియోగించే ఒక్కో తామిర్ మిసైల్ ఖరీదు దాదాపు 50వేల డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.50లక్షలు)

డేవిడ్స్ స్లింగ్

ఇది మధ్యశ్రేణి మిసైళ్లను అడ్డుకుంటుంది. దీని రేంజ్ 15 నుంచి 300 కిలోమీటర్లు ఉంటుంది. బాలిస్టిక్, క్రూజ్ మిసైళ్లను కూడా ఇది అడ్డుకోగలదు. దీనిని మంత్రదండం అని కూడా పిలుస్తారు. దాదాపు ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల నుంచి ప్రయోగించే రాకెట్లు దీని రేంజ్ లోకి వస్తాయి. ఈ వ్యవస్థను 2017లో ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా రూపొందించాయి. ఇది సర్ ప్రైజ్ అటాక్ చేయడంలో దిట్ట. చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించి.. శత్రువుల విమానం సహా ఏ రాకెట్ నైనా ఇది చిత్తు చేస్తుంది. ఈ వ్యవస్థలో స్లింగ్ మిసైళ్లను వాడతారు. ఒక్కో మిసైల్ ధర దాదాపు మిలియన్ డాలర్లు ఇండియన్ కరెన్సీలో (8.7కోట్లు). ఈ వ్యవస్థనే గత సెప్టెంబర్ లో లెబనాన్ నుంచి హెజ్ బొల్లా ప్రయోగించిన బాలిస్టిక్ మిసైళ్లను చిత్తు చేసింది. హెజ్ బొల్లా ప్రయోగించిన ఖదర్-1 మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లు 700నుంచి 1000కిలోల వరకు పేలుడు పదార్థాలను తీసుకెళ్లే సామర్థ్యం ఉండటం గమనార్హం. ఇది ఒక్కటి కూడా జనం ఎక్కువగా ఉండే నగరప్రాంతాల్లో పడితే నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమే. గత ఏడాది మేలో గాజా నుంచి ప్రయోగించిన 1100 రాకెట్లను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ డేవిడ్ స్లింగ్ వ్యవస్థను వినియోగించింది. ఇది 96శాతం రాకెట్లను నేలకూల్చడం గమనార్హం.

యారో 2,3

యారో యాంటీ వ్యవస్థ.. ఐరన్ డోమ్, డేవిడ్స్ స్లింగ్ కు భిన్నంగా పనిచేస్తుంది. ఇది భూమి నుంచి 50కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి అక్కడినుంచి నేరుగా శత్రువు ప్రయోగించిన రాకెట్ ను లక్ష్యంగా చేసుకుంటుంది. 1991లో మొదటి గల్ఫ్ యుద్ధంలో ఇరాక్ డజన్ల కొద్దీ రష్యా తయారీ స్కడ్ మిసైళ్లను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్ తన రక్షణకు 2000వ సంవత్సరంలో యారో 2 యాంటీ మిసైల్ వ్యవస్థను తయారీకి రూపకల్పన జరిగింది. 2017లో సిరియా విమానాలు ప్రయోగించిన రాకెట్లను ఈ వ్యవస్థ తొలిసారి విజయవంతంగా ఎదుర్కొన్నది. ఈ వ్యవస్థ శత్రువు ప్రయోగించే మిసైళ్లను 500 కిలోమీటర్ల దూరం నుంచి కూడా పసిగడుతుంది. మిసైల్ ప్రయోగించిన ప్రదేశం నుంచి 100కిలోమీటర్ల లోపే దానిని అడ్డుకోవడం యారో 2 ప్రత్యేకత. ధ్వనివేగం కంటే ఈ మిసైళ్లు 9రెట్లు అధిక వేగంతో ప్రయాణిస్తాయి. పైగా ఈ వ్యవస్థనుంచి ఒకేసారి 14 టార్గెట్లపై మిసైళ్లను ప్రయోగించవచ్చు. యారో 3 వ్యవస్థ దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ మిసైళ్లను అడ్డుకోవడానికి రూపొందించినది. ఇది గత ఏడాది యెమెన్ లోని హౌతీ రెబెల్స్ దక్షిణ ఇజ్రాయెల్ పై ప్రయోగించిన బాలిస్టిక్ మిసైళ్లను విజయవంతంగా అడ్డుకున్నది. ఈ వ్యవస్థను ఇజ్రాయెల్, అమెరికాకు చెందని బోయింగ్ కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. యారో మిసైల్ ఒకటి 3.5 మిలియన్ డార్లు. (ఇండియన్ కరెన్సీలో రూ. 29 కోట్లు) యారో 2,3 వ్యవస్థను ఒకసారి వినియోగిస్తే మన కరెన్సీలో రూ.29కోట్లు ఖర్చు అవుతాయి.

Advertisement

Next Story

Most Viewed