MLA : అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష ఎమ్మెల్యేను అడ్డుకోవడం విడ్డూరం

by Kalyani |
MLA : అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష ఎమ్మెల్యేను అడ్డుకోవడం విడ్డూరం
X

దిశ, దుబ్బాక: ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ను అడ్డుకునే పరిస్థితి అధికార పార్టీకి వచ్చిందని దుబ్బాక స్థానిక ఎమ్మెల్యేగా మండల అధికారులతో కలిసి సమీక్ష సమావేశానికి వస్తున్న క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్ష ఎమ్మెల్యేని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో స్థానిక కౌన్సిలర్ల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ పట్టణంలోని 20 వార్డులలో అభివృద్ధిపై సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దమ్ము లేక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. కేవలం 9 మాసాలలోనే రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని, అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు.

దొంగనే దొంగ అనే పరిస్థితి నెలకొందని మంత్రులు, అధికారులు ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా ఇంఛార్జి మంత్రి సోషల్ మీడియా పోస్ట్ ల మూలంగా కంట తడి పెడితే బాధ అనిపించింది. సాటి మహిళ నటి సమంత మీద ఆమె మాట్లాడిన మాటలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రి మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చట్టం ద్వారా చర్యలు తీసుకోవాల్సింది పోయి ఏడుస్తుంటే సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.? అధికారంలో ఉండి బాధపడటం ఎందుకని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియా లో కించపరిచే పోస్టులు పెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కు ఉద్దేశ్యం ఉంటే వెంటనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రులకు అభివృద్ధి మీద సోయి లేదని అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ లో ఆడపడుచులు ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ను పట్టించుకునే వారు లేరన్నారు. మంత్రులు, అధికారులు పనిచేయడం లేదని అన్ని వ్యవస్థలు విఫలమయ్యాయన్నారు.

రోడ్ల గుంతలు పూడ్చడానికి పైసలు లేవు. విద్య, వైద్య వ్యవస్థలు, గ్రామ పంచాయతీ, పట్టణ మున్సిపాలిటీ లు నిర్వీర్యం అయ్యాయి. విద్యుత్ వ్యవస్థ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖల్లో పైసా పని జరగడం లేదన్నారు. రుణమాఫీ మాట్లాడితే హైడ్రా, హైడ్రా దగ్గరికి వెళితే మూసీ ప్రక్షాళన అంటారు. మూసీ దగ్గరికి వెళితే సినిమా వాల్ల మీద పడుతున్నారని డైవర్షన్ పాలిటిక్స్, డ్రామాలు బంద్ చేయాలన్నారు. ఎక్కడన్నా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రతిపక్షం అధికార పక్షంను అడ్డుకుంటారని, ప్రజలతో కలిసి పోరాటం చేస్తారు. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాటాకు చప్పుళ్లకు, పిట్ట బెదిరింపులకు భయపడేది లేదని ప్రజల పక్షాన పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గా నియోజకవర్గం లో సమావేశం నిర్వహించుకునే హక్కు లేదా అని ఆయన ప్రశ్నించారు.? ఆయనతోపాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ గన్నే వనిత, మాజీ జెడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షుడు బాణాల శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed