- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సస్పెన్స్.. ఆ నెలలో జరిగే ఛాన్స్?
రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్‌పై సస్పెన్స్ నెలకొన్నది. నవంబర్‌లోనే ఎన్నికలు జరిగే చాన్స్ ఉందంటూ రాష్ట్ర అధికారులు అంచనా వేస్తుండగా.. డిసెంబర్‌లోనే అంటూ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగుతాయని ఢిల్లీ నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జమిలి కోసం రాజ్యాంగపరంగా చిక్కులు లేకుండా పార్లమెంటు ద్వారా ఆర్డినెన్సు తీసుకురావడం లేదా చట్టం చేసి అసెంబ్లీ కాలపరిమితిని మే వరకూ పొడిగించడంపై కేంద్రం ఆలోచిస్తున్నట్టు టాక్. అలా చేస్తే ఎన్నికలపై తగినంత ఫోకస్ పెట్టలేమని భావిస్తున్న బీఆర్ఎస్.. జమిలి వ్యూహాన్ని అడ్డుకునేందుకు కోర్టును ఆశ్రయించే అవకాశాలపై చర్చలు మొదలు పెట్టినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయంపై ఉత్కంఠ నెలకొన్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం డిసెంబరులోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయన్నది మంత్రులు, బీఆర్ఎస్ నేతల మాట. ఒక నెల ముందుగానే అంటే నవంబర్‌లోనే వస్తాయన్నది అధికారుల వాదన. పార్లమెంటు ఎన్నికలతో కలిపి వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లోనే జరుగుతాయన్నది కేంద్రం నుంచి అందుతున్న సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు ఎప్పుడొస్తాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణతో పాటు చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు డిసెంబరు-జనవరి నెలల్లోనే పూర్తికావాల్సి ఉన్నది. వీటన్నింటికీ కలిపి ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహిస్తారనేది కామన్ అభిప్రాయం. అన్నింటికంటే ముందు మిజోరాం అసెంబ్లీ ఎన్నికలను గడువు (డిసెంబరు 17, 2023)లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున మిగిలిన రాష్ట్రాలకు కూడా దానితో పాటే ఎన్నికలు జరుగుతాయన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతున్నది.
డిసెంబరు 17వ తేదీకల్లా మిజోరాంలో కొత్త శాసనసభ కొలువుతీరాల్సి ఉన్నందున వారం రోజుల ముందే ఫలితాలు వస్తాయని తెలంగాణ అధికారులు భావిస్తున్నారు. ఆ ప్రకారం నవంబరు చివరి వారం, డిసెంబరు మొదటివారంలోనే ఎన్నికలను నిర్వహించి రెండోవారంకల్లా అన్ని రాష్ట్రాల ఫలితాలను ఒకేసారి వెల్లడించే అవకాశమున్నట్టు అంచనా వేస్తున్నారు. పలు దశల్లో ఎన్నికలు జరిపే కేంద్ర ఎన్నికల కమిషన్.. షెడ్యూలును దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో సైతం నవంబరు చివర్లో లేదా డిసెంబరు ఫస్ట్ వీక్‌లో నిర్వహించే చాన్స్ ఉన్నదని, అక్టోబరులోనే షెడ్యూలు రిలీజ్ కావచ్చన్నది అధికారుల భావన. దీనికి తగినట్టుగానే సెప్టెంబరు చివరికల్లా నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన క్యాలెండర్‌ను సిద్ధం చేసే పనిలో ఆఫీసర్లు లీనమయ్యారు.
పార్లమెంటుతో కలిపి జరిపితే...
పార్లమెంటు ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో జరగనున్నందున ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా వాయిదా వేసి జమిలిగా నిర్వహించే చాన్స్ ఉన్నట్టు ఢిల్లీ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం రాజ్యాంగపరంగా చిక్కులు లేకుండా పార్లమెంటు ద్వారా ఆర్డినెన్సు రూపంలో లేదా చట్టం చేసి వీటి అసెంబ్లీ కాలపరిమితిని మే నెల వరకూ పొడిగించడంపై ఇప్పటికే ఆలోచనలు జరుగుతున్నట్టు టాక్. ఒకవేళ అదే జరిగితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై తగినంత ఫోకస్ పెట్టలేమన్నది బీఆర్ఎస్ భావన. దీంతో జమిలి ఎన్నికలకు వెళ్లకుండా నివారించడానికి ఉన్న మార్గాలపై అధికారుల స్థాయిలో అన్వేషణ మొదలైంది. లీగల్‌గా ఎదుర్కోడానికి ఉన్న అవకాశాలపైనా చర్చలు జరుగుతున్నాయి. జమిలి రూపంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను కలిపి నిర్వహిస్తే రాజ్యాంగపరంగా ఉన్న ప్రతిబంధకాలను అధ్యయనం చేసి వాటిని కోర్టులో సవాలు చేయడంపై అధికారులు ఆలోచిస్తున్నారు. రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలను తీసుకోవాలని భావిస్తున్నారు. కేంద్రం జమిలి వ్యూహం వేస్తే దానికి కౌంటర్‌గా అడ్డుకునే వ్యూహంపైనా చర్చలు సాగుతున్నాయి. పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం బీజేపీ వేస్తున్న ఎత్తులను తిప్పికొట్టడానికి అధికారుల సాయంతో బీఆర్ఎస్ పైఎత్తులు వేస్తున్నది. అసెంబ్లీ కాలపరిమితిని పెంచడంలో రాజ్యాంగపరంగా ఉన్న చిక్కుల గురించి శోధించే పని మొదలైంది. అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరపడం ద్వారా బీఆర్ఎస్ తగినంత ఫోకస్ పెట్టకుండా ఇబ్బందులు సృష్టించాలన్న బీజేపీ వ్యూహానికి తగిన ప్రతివ్యూహం గురించి బీఆర్ఎస్ ఆలోచిస్తున్నది.
గతంలో ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లీ కాలపరిమితి పెంచి ఎన్నికలను ఆలస్యంగా నిర్వహించిన సందర్భాలను కూడా వెతికే పని మొదలైంది. కేంద్రం అనుసరించే విధానానికి అనుగుణంగా బీఆర్ఎస్ సరైన టైమ్‌లో అడుగులు వేయాలనుకుంటున్నది. అప్పటివరకు లాజికల్‌గా, లీగల్‌గా గ్రౌండ్‌ను సిద్ధం చేసుకోవాలనుకుంటున్నది. తగిన సలహాలు, సూచనలతో అధికారులు వివరాలతో సిద్ధమవుతున్నారు.
Also Read: నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ.. వ్యూహ, ప్రతివ్యూహాల్లో భారీ మార్పులు!