బయటపడ్డ కేసీఆర్, కేటీఆర్ వైఫల్యం.. మంత్రుల విషయంలో సైలెంట్

by Manoj |   ( Updated:2022-06-07 00:30:29.0  )
బయటపడ్డ కేసీఆర్, కేటీఆర్ వైఫల్యం.. మంత్రుల విషయంలో సైలెంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : అన్నిశాఖలకు మంత్రులు ఉన్నారు.. శాఖలపై రివ్యూలు చేపడతారు.. సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. కానీ ఏడాది కాలంలో సంబంధిత శాఖలో ఏం ప్రగతి సాధించామని మాత్రం మరిచిపోతున్నారు. వార్షిక నివేదికలు విడుదల చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అసలు శాఖలపై వారికి పట్టు లేకనా? అలసత్వమా? అనేది అర్థం కాని పరిస్థితి. దీనికి తోడు అసెంబ్లీ సమావేశాల్లో సైతం నివేదికలను సైతం గత ఏడాదిలో జరిగిన పాత సమాచారాన్ని ఇస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని శాఖలపై కులంకషంగా చర్చ జరగడం లేదనే ఆరోపణలున్నాయి.

రాష్ట్ర కేబినెట్‌లో సీఎం కేసీఆర్‌తో పాటు 16 మంది మంత్రులు ఉన్నారు. మొత్తం కేబినెట్ కూర్పు 17 మంది. అందరికీ శాఖలు ఉన్నాయి. ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు శాఖలు ఉన్నాయి. ఈ శాఖలకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొంటున్నారు. సమీక్షలు, రివ్యూలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు. కానీ ఆ శాఖ ఏడాది కాలంలో ఏం చేసిందో మాత్రం వెల్లడించడం లేదు. కేవలం మంత్రులు నామమాత్రంగా నిర్వహిస్తున్నారా? లేక శాఖలపై పట్టు లేదా? అనేది అంతుచిక్కని ప్రశ్న. ఒకవేళ శాఖలపై పట్టుంటే చేసిన అభివృద్ధి, చేపట్టిన కార్యక్రమాలను వెల్లడించడంలో ఎందుకు వెనుకంజవేస్తున్నారో అర్థంకాని పరిస్థితి. ఒక వేళ పట్టున్నా.. నివేదిక తయారు చేసినా ఆవిష్కరించడంలో అలసత్వం జరుగుతుందా? అనేది సందిగ్ధంగా మారింది.

కేటీఆర్ ఒక్కరే...

కేబినెట్ లో మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ పనిచేస్తున్నారు. ప్రతి ఏడాది జూన్‌లో ఆయాశాఖల్లో సాధించిన ప్రగతిని నివేదిక రూపంలో వెల్లడిస్తున్నారు. అంతే కాదు ఏడాదిలో సాధించిన ప్రగతి, గతేడాదిలో సాధించిన అభివృద్ధిని పోల్చుతూ సాధించిన విషయాలను వివరిస్తున్నారు. తూచ తప్పకుండా ఆయా శాఖల అధికారుల సమక్షంలోనే వార్షిక నివేదికలు ఆవిష్కరిస్తున్నారు. మిగతా మంత్రులు ఆయా శాఖలకు సంబంధించిన నివేదికలు ఎందుకు ఆవిష్కరించడం లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మంత్రుల తీరుపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.

తూ.చ తప్పకుండా ఖద్దర్ చొక్కా...

చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రతి సోమవారం ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు చేనేత వస్త్రాలను ధరించాలని మంత్రి కేటీఆర్ పిలుపు నిచ్చారు. దీంతో ప్రతి ఒక్కరూ, మంత్రులు సైతం ఖద్దర్ వస్త్రాలను ధరిస్తున్నారు. కేటీఆర్‌ను అనుసరిస్తున్నారు. కానీ శాఖలకు సంబంధించిన నివేదికలను విడుదల చేయడంలో మాత్రం మంత్రులు అలసత్వంను ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గైడ్ చేయడంలో కేసీఆర్, కేటీఆర్ వైఫల్యం?

సంక్షేమ పథకాల రూపకల్పన సమయంలో సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. మంత్రుల అభిప్రాయం సేకరిస్తారు. ఎవరైనా సూచనలు చేస్తే సంబంధిత పథకంలో మార్పులు చేస్తారు. అయితే శాఖలపై రివ్యూలు చేయడంలో విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులను గైడ్ చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అందువల్లనే శాఖలకు సంబంధించిన వార్షిక నివేదికలను విడుదల చేయడం లేదని స్పష్టమవుతోంది. అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకొని రెండు, మూడేళ్లకు సంబంధించిన వార్షిక నివేదికను అందజేయడం గమనార్హం. తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 2019-20, సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ 2019-20, నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్-2019-20, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2019-20, తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2018-19, టూరిజం 2014-15 వార్షిక నివేదికలు అందజేయడంపై విమర్శలు వచ్చాయి. బడ్జెట్ సమావేశాల్లో అయితే ఇచ్చిన నివేదికలు అన్ని పూర్తి సమాచారం లేకుండా తూతూమంత్రంగానే ఉన్నాయనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్‌ను మంత్రులు అనుసరించి వారు సైతం ప్రతి ఏటా వార్షిక నివేదికలు ఆవిష్కరించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed