ఆ అసెంబ్లీ బరిలో ఒకే పార్టీ నుంచి 9 మంది ఆశావాహులు.. మరి లక్ ఎవరికి?

by Sathputhe Rajesh |
ఆ అసెంబ్లీ బరిలో ఒకే పార్టీ నుంచి 9 మంది ఆశావాహులు.. మరి లక్ ఎవరికి?
X

దిశ ఆర్మూర్: ఇందూరు జిల్లాలో చైతన్యం కలిగిన రాజకీయానికి పెట్టింది పేరైన ఆర్మూర్ బిజెపిలో అంతర్గత కుమ్ములాటలతో నాయకుల మధ్య నువ్వా నేనా అన్న తీవ్ర పోటీ నెలకొంది. ఇదివరకు ఆర్మూర్ నియోజకవర్గంలో కమలం పార్టీ అంతంత మాత్రమే ఉండేది. కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఆర్మూర్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి చొరవతో ఆర్మూర్లో కమలం పార్టీ చెప్పుకోదగ్గరీతిలో కాస్త బలపడింది. కానీ ఆర్మూర్ బిజెపికి అన్ని తానై గత ఆరేడు ఏండ్లుగా వ్యవహరిస్తున్న వినయ్ కుమార్ రెడ్డిని కాదని మరికొందరు ఆశావాహులు ఆర్మూర్ బిజెపి అసెంబ్లీ బరిలో నిలిచేందుకు సై అంటున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అంతంత మాత్రంగా ఉన్న బిజెపిని ఒక నావలోకి తీసుకొచ్చిన వినయ్ కుమార్ రెడ్డిని పక్కకు నెడుతూ మేము కూడా ఆర్మూర్ బిజెపి అసెంబ్లీ బరిలో ఉన్నామంటూ పలువురు నాయకులు చెబుతుండడంతో ఆర్మూర్ లోని బిజెపిలోని అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా బయట పడుతున్నాయి. ఉత్తర తెలంగాణలో బిజెపి హవా కొనసాగుతుందన్న ఆశతో పలువురు బిజెపి నాయకులు ఆర్మూర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు సీటు దక్కించుకునేందుకు అసెంబ్లీ బరిలో ఉన్న ఆశావాహ నాయకులు శాయశక్తులతో తీవ్రంగా కృషి చేస్తున్నారు.

ఆర్మూర్ బిజెపి అసెంబ్లీ బరిలో.. 9 మంది ఆశావాహులు..

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ ద్వారా బరిలో నిలిచేందుకు తొమ్మిది మంది ఆశావాహులు తీవ్రంగా వారి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్మూర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని ఇదివరకే జిల్లా పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసింది. ఈయనతో పాటు నిజామాబాద్ కార్పొరేషన్ కార్పొరేటర్ స్రవంతి రెడ్డి సైతం ఆర్మూర్ అసెంబ్లీ బరిలో నిలిచేందుకు పావులు కదుపుతున్నట్లు ఆర్మూర్లో ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఆర్మూర్ బిజెపి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మరోమారు పోటీ చేసి ఈసారి ఎలాగైనా అసెంబ్లీ మెట్లు ఎక్కాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు. వీరే కాకుండా ఆర్మూర్ బిజెపికి సీనియర్ నాయకులైన అల్జాపూర్ శ్రీనివాస్ ,పల్లె గంగారెడ్డి, బద్దం లింగారెడ్డి, లోక భూపతిరెడ్డిలు సీనియారిటీ పరంగా తమకే ఆర్మూర్ అసెంబ్లీ బిజెపి సీటు వస్తుందన్న భీమాలో ఉన్నారు. వీరికి తోడు ఇటీవల బిఆర్ఎస్ పార్టీ నుంచి బిజెపిలో చేరిన యువకిశోరం ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్ తను కూడా ఆర్మూర్ అసెంబ్లీ బిజెపి బరిలో ఉంటానని చెప్పకనే చెబుతూ నియోజకవర్గ వ్యాప్తంగా మంచి చెడులకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాగా నిన్న మొన్న ఆర్మూర్ బిజెపి లో చేరిన దివంగత నేత ఆలూరు గంగారెడ్డి కూతురు విజయభారతి రెడ్డి సైతం ఆర్మూర్ అసెంబ్లీ బిజెపి బరిలో ఉంటుందని ఆర్మూర్ జనం గుసగుసలాడుకుంటున్నారు. కానీ ఆర్మూర్లో విజయ భారతి రెడ్డి బిజెపిలో చేరిన సమయంలో నేను ఆర్మూర్ నుంచి పోటీ చేయబోనని ఆర్మూర్ నుంచి పోటీ చేసే నాయకులే చాలా ఎక్కువగా ఉన్నారని వారిని ఆశీర్వదించాలని ఎంపీ అరవింద్ ఇటీవల పేర్కొన్నారు. ఏది ఏమైనా ఆర్మూర్ అసెంబ్లీ బరిలో ఇంత మంది నాయకుల్లోంచి ఎవరు నిలుస్తారో అనే ఉత్కంఠ ఆర్మూర్ జనంతో పాటు ఏ నాయకుని ప్రక్కన క్రమశిక్షణ కఠోర వ్యయ ప్రయాసాలతో పనిచేయాలన్నది బిజెపి కార్యకర్తలకు నాయకులకు అంతుచిక్కని ప్రధాన సమస్యగా నెలకొంది. ఆర్మూర్ బిజెపి అసెంబ్లీ బరిలో నిలువనున్న నాయకుల్లో అందరూ ఏకతాటిపైకి వచ్చి ఎవరో ఒకరు ముందుగా ఉండి పార్టీని నడిపించాలని ఆర్మూర్ బిజెపి నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed