కొండగట్టు ఆలయంలో చోరీ : 15 కిలోల వెండి విగ్రహాలు మాయం

by Sathputhe Rajesh |
కొండగట్టు ఆలయంలో చోరీ : 15 కిలోల వెండి విగ్రహాలు మాయం
X

దిశ, జగిత్యాల ప్రతినిధి, మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో సుమారు 15 కిలోల వెండి మరియు బంగారు నగలు మాయమైనట్టు పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి ఒంటిగంట 30 నిమిషాల సమయంలో ముగ్గురు వ్యక్తులు ప్రధాన ఆలయానికి వెనుక వైపున బేతాళ గుడి ప్రాంతం నుండి లోపలకు చొరబడినట్టు గుర్తించారు. ముగ్గురు యువకుల చేతుల్లో కటింగ్ ప్లేయర్స్‌తో పాటు ఇతరత్రా సామాగ్రి ఉన్నట్టు సీసీ ఫుటేజీలో కనిపిస్తోంది.

వీరు ఆలయం వెనక ద్వారాన్నితెరిచి లోపలకు చొరబడినట్టు గుర్తించారు. డాగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా కొండగట్టుకు చేరుకొని దొంగల ఉనికిని పసిగట్టే పనిలో పడ్డాయి. మరోవైపున వేలు ముద్రల సేకరణ‌తో పాటుగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ఆగంతకుల ఆచూకీ కోసం గాలింపు చేస్తున్నాయి. మల్యాల సిఐ కొండగట్టుకు చేరుకొని దొంగతనంపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో చోరీకి గురైన వెండి వస్తువుల వివరాలు ఇలా ఉన్నాయి.

స్వామివారి 2 కిలోల వెండి మకర తోరణం, అర్ధమండపంలోని 5కిలోల ఆంజనేయస్వామి వెండి ఫ్రేమ్, 3 కిలోల నాలుగు వెండి శఠగోపాలు, స్వామివారి 5 కిలోల వెండి తొడుగు‌ చోరీకి గురయ్యాయి. సుమారు 15 కిలోల వరకు వెండి దొంగతనం అయినట్టు ప్రాథమికంగా నిర్థారించారు. దీని విలువ రూ. తొమ్మిది లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.

Advertisement

Next Story

Most Viewed