గురుకుల నోటిఫికేషన్లను పున:సమీక్షించాలి.. విద్యార్థి జన సమితి డిమాండ్

by Javid Pasha |
గురుకుల నోటిఫికేషన్లను పున:సమీక్షించాలి.. విద్యార్థి జన సమితి డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : గురుకుల నోటిఫికేషన్లను పున:సమీక్షించాలని తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం విద్యార్థి జన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు వీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల నోటిఫికేషన్లలో ఉన్న అసమానతలపై విద్యార్థి, నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పురుష నిరుద్యోగ అభ్యర్థులు అందరూ ఈ నోటిఫికేషన్లలలో మేము నష్టపోతున్నామనే భావనలో ఉన్నారని, పురుష అభ్యర్థులకు నష్టం జరుగుతుండడం వలన ఈ నోటిఫికేషన్లను పున: సమీక్షించి, అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకు పురుషులకు సమాన అవకాశాలు కావాలని కోరుతున్నామంటే నిరుద్యోగిత రేట్ లో పురుష అభ్యర్థులే అధికం, కావున పురుషులకు కూడా సమాన అవకాశాలు కల్పిస్తే న్యాయం జరుగుతుందన్నారు.

ఈ అసమానతలు లింగ వివక్షతకు గురి చేసే విధంగా ఉన్నాయని తెలిపారు. ఈ నోటిఫికేషన్లు హారిజెంటల్ విధానంలో అమలు పరచాలని సూచించారు. కావున ప్రభుత్వం ఈ నోటిఫికేషన్లను సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని, మహిళా గురుకుల పాఠశాలల్లో, కళాశాలల్లో డీఎల్, జేఎల్ , పీజీటీ పోస్టులను వంద శాతం మహిళా అభ్యర్థులతో భర్తి చేస్తున్నారని, జనరల్ గురుకుల పాఠశాలల్లో పురుష అభ్యర్థులకు మెరుగైన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గురుకులాలలో పోస్టుల భర్తీ విధానంలో డెమో విధానాన్ని రద్దు చేయాలని, అలాగే గురుకుల పరీక్షల అప్లికేషన్ ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed