- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ధరణి’ పరిష్కారంలో అధికారుల అలసత్వం.. ఇంకా పెండింగ్‌లోనే 1.30 లక్షల అప్లికేషన్లు!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారంలో వేగం పెరగలేదు. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పని జరగడం లేదు. చిన్న చిన్న సమస్యలున్న అప్లికేషన్లను అధికారులు ఏండ్ల తరబడిగా పెండింగ్‌లో పెడుతున్నారు. తహశీల్దార్ల నుంచి కలెక్టర్ల స్థాయి వరకు అవినీతి పెరిగిందని, ప్రతి పనికీ ఏదో ఒకటి ఆశించడం వల్లే అప్లికేషన్లు పెండింగ్‌లో ఉంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ పెట్టినా 1.30 లక్షల ధరణి అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టుతో సంబంధం లేని, రికార్డులు పరిశీలించి న్యాయం చేయాల్సిన వాటిని అధికారులు తిరస్కరిస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. లక్షకు పైగా దరఖాస్తులు పరిష్కరించామని ఆఫీసర్లు రిపోర్టు ఇవ్వగా.. ఇందులో కేవలం డ్యాష్ బోర్డు క్లియరెన్స్ మాత్రమే ఉన్నాయి. మరో వైపు అప్లికేషన్ రిజెక్ట్ చేసినా దాన్ని పరిష్కరించినట్లుగా లెక్క చూపిస్తున్నారు. దీంతో ఆ రైతు మళ్లీ అప్లై చేయాల్సి వస్తున్నది.
పీవోబీలో గందరగోళం
ప్రభుత్వం రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ పెట్టిన తర్వాత కూడా 1.30 లక్షల అప్లికేషన్లు పెండింగులోనే ఉంటున్నాయి. లక్షల్లో పరిష్కరించామని అధికారులు చెబుతున్నా వాటిలో రిజెక్ట్ చేసినవే అత్యధికంగా ఉన్నాయి. అసలు మొత్తం ఎన్నింటికి పరిష్కారం చూపారన్న దానికి లెక్కలు లేకుండా పోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితాలో ఇరికించారు. పీవోబీ నుంచి తొలగించాలంటూ వచ్చే దరఖాస్తులు లక్షల్లోనే ఉన్నాయి. ఐతే ఈ విషయంలోనే తహశీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్ల మీద దుమారం రేగుతున్నది. ఆధారాలు చూపినా సమయానికి అన్ లాక్ చేయకుండా దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. 50 ఏండ్లకు పైగా పట్టాగా రికార్డులో నమోదైన అంశాన్ని రాయకుండా, ఖాస్రా పహాణీలో సర్కారీ అని ఉందంటూ తేల్చేస్తున్నారు. దాన్ని ఆసరాగా చేసుకొని తహశీల్దారే సర్కారీ అంటూ రాసినప్పుడు తాను ఎలా రిలీజ్ చేయగలనంటూ కలెక్టర్లు పేచీ పెడుతున్నారు. ఖారీజ్ ఖాతా అంటే ఏమిటి? అనేది తెలియని తహశీల్దార్లు సైతం కొందరు ఉన్నారు. అప్పట్లో పన్ను కట్టకపోతే ఆ పదం రాశారు. కానీ ఆ తర్వాత అదే భూమిని పట్టాగా రాశారు. దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా.. ఖారీజ్ ఖాతా అని ఉంది.. అంటే ప్రభుత్వ భూమి అంటూ ఏకపక్షంగా తేల్చేస్తున్నారు. దాంతో రైతుల భూములు నిషేధిత జాబితాలోనే ఉండిపోతున్నాయి. ఈ విషయంపై సీసీఎల్ఏ నుంచి తహశీల్దార్లకు క్లారిటీ ఇప్పించినా ససేమిరా అంటూ అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తున్నారు.
అధికారాలు ఇచ్చినా..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి చిన్న భూ సమస్య పరిష్కారం సీసీఎల్ఏ దగ్గరే అన్నట్లుగా ఉంది. దాంతో లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడ్డారు. ఆదిలాబాద్ మారుమూల నుంచి హైదరాబాద్ దాకా రావాల్సిన పరిస్థితులను కల్పించారు. ఐతే కొత్త ప్రభుత్వం రాగానే అధికారాలను తహశీల్దార్లు, ఆర్డీవో, కలెక్టర్లకు బదిలీ చేశారు. ఐనా కొందరు తమకేం అధికారం లేదంటూ దరఖాస్తుదారులతో డైరెక్ట్‌గానే చెబుతున్నారు. రెండు గుంటల మిస్సింగ్ దరఖాస్తును సైతం సీసీఎల్ఏకు పంపించడం ఏంటన్న చర్చ నడుస్తున్నది. పేరులో అక్షరం తేడా రాస్తే దానికీ హైదరాబాద్ దాకా రావడం ఏంటన్న వాదనా తెర మీదికి వచ్చింది. అధికార వికేంద్రీకరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినా కొందరు అధికారులు భూ సమస్యల పరిష్కారంలో తాత్సారం చేస్తుండడం వంటి అంశాలపై చర్చ ఉంటుందని అధికారుల ద్వారా తెలిసింది.
ఎందుకు పెండింగ్?
- రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో నిధురం చంద్రమ్మకు బదులుగా చెన్నమ్మ అని పడింది. సేల్ డీడ్‌లో కరెక్టుగానే ఉన్నా రికార్డుల్లో తప్పుగా నమోదు చేశారు. దీన్ని మార్చాలని రెండేండ్ల నుంచి తిరుగుతున్నారు. తహశీల్దార్ రికమండ్ చేసి ఏడాదిన్నరైంది. కానీ ఇప్పటికీ ఆ పేరు సవరించలేదు. ఇందులో అభ్యంతరాలు ఏం ఉన్నాయి? 2022 జూలైలో అప్లై చేస్తే నేటికీ అండర్ వెరిఫికేషన్ గానే చూపిస్తున్నది.
- రంగారెడ్డి జిల్లా వేములనర్వలో ఓ పట్టాదారుడికి 18 ఏండ్లు నిండాయి. గార్డియన్ పేరు తొలగించాలని అప్లై చేసుకున్నారు. దానికి సంబంధించిన ఆధార్ కార్డు, పదో తరగతి డాక్యుమెంట్లు సబ్ మిట్ చేశారు. ఇది సైతం రెండేండ్ల రెండు నెలల నుంచి అండర్ వెరిఫికేషన్‌లోనే ఉంది.
- పొమలపల్లికి చెందిన కర్నెకోట అరుణాబాయి పాస్‌బుక్‌లో ఓ సర్వే మిస్సయ్యింది. అది కూడా కేవలం నాలుగు గుంటలే. ఆ భూమి ఎలా వచ్చిందో, ఏ డాక్యుమెంట్ల ద్వారా సమకూరిందో అంతా సమర్పించారు. తహశీల్దార్, ఆర్డీవోలు 2022 డిసెంబర్ 21న రికమండ్ చేశారు. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.
- కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో 60 ఏండ్లుగా పట్టాగా ఉన్న భూమిని ఖారీజ్ ఖాతాగా రాసి పీవోబీలో నమోదు చేశారు. తనది పట్టా భూమి అంటూ అన్ని డాక్యుమెంట్లు సమర్పించినా సదరు తహశీల్దార్ ససేమిరా అన్నారు. ఖాస్రాలో ఏది ఉందో అదే రాస్తామంటూ రెండు సార్లు రిజెక్ట్ చేశారు. అసలు ఖారీజ్ ఖాతాకు నిర్వచనం ఏంటో తెలుసుకోవాలని రిక్వెస్ట్ చేసినా, ఉన్నతాధికారుల నుంచి క్లారిఫికేషన్ ఇచ్చినా తహశీల్దార్లు మారుతున్నారే తప్ప రైతు సమస్యకు పరిష్కారం లభించడం లేదు.
29న నల్సార్ యూనివర్శిటీ ప్రాంగణంలో సదస్సు
ధరణి అప్లికేషన్లు పెండింగులో ఉంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గుర్తించారు. ఈ నెల 29న నల్సార్ యూనివర్సిటీ ప్రాంగణంలో సదస్సు ఏర్పాటు చేశారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరినీ ఆహ్వానించారు. ఇందులో తనకు వచ్చే ఫిర్యాదులనే ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చే పనులు చేయాలని మార్గనిర్దేశం చేయనున్నారని తెలిసింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖపై వచ్చే ఫిర్యాదులు, అవినీతి అక్రమాలపై సబ్ రిజిస్ట్రార్లతో మాట్లాడారు. సమావేశంలో తనదైన శైలిలో వారందరినీ సున్నితంగా మందలించారు. ఆఖరికి పోస్టింగుల కోసం పైరవీలు చేసే వారిపైనా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అదే విధంగా ప్రభుత్వ లక్ష్యాలను రెవెన్యూ అధికారులతో పంచుకోనున్నారు. మరో వైపు
ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి అటవీ భూములపైనా అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ భూములకు ట్రైబల్స్ మాత్రమే అర్హులు. కానీ కొందరు అధికారులు మాత్రం ట్రైబల్ టూ ట్రైబల్, ట్రైబల్ టూ నాన్ ట్రైబల్, నాన్ ట్రైబల్ టూ ట్రైబల్ ట్రాన్సక్షన్స్‌కు పాల్పడినట్లు మంత్రి పేషీకి సమాచారం అందింది. కొన్ని మండలాల్లో ఎకరానికి ఇంత అని లెక్కలు కట్టి వసూలు చేసిన ఉదంతాలూ మంత్రి దృష్టికి వచ్చాయి. తన సొంత జిల్లాలోనూ ఇలాంటి పరిణామాలపై సీరియస్‌గా ఉన్నారు. ఇలాంటి అంశాలనే సదస్సులో మంత్రి ప్రస్తావించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.