- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసంతృప్తులే టార్గెట్! కాంగ్రెస్, బీజేపీ యాక్టీవ్ మోడ్
బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. పలువురు సిట్టింగులతో పాటు ఆశావహులకు అధికార పార్టీ మొండిచేయి చూపడంతో పలువురు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి వారిని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు టార్గెట్ చేశాయి. ప్రజల్లో ప్రభావం చూపగలిగే లీడర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా బీఆర్ఎస్ అసంతృప్త నేతలతో పోటాపోటీగా సంప్రదింపులు జరుపుతున్నాయి. -దిశ, తెలంగాణ బ్యూరో
బీఆర్ఎస్ అసంతృప్త నేతలకు గాలం వేస్తున్న కాంగ్రెస్.. డిసెంబర్ తర్వాత హస్తానిదే అధికారమని వారికి ఆశ చూపుతున్నది. అయితే చాలా మంది నేతలు పార్టీ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నా.. టికెట్లపై గ్యారంటీ ఇవ్వకపోవడంతో డైలమాలో ఉన్నట్లు తెలిసింది. టికెట్లపై స్పష్టమైన హామీ లభిస్తే, చాలా మంది నేతలు కండువా కప్పుకునేందుకు క్యూ కడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
యాక్టివ్ మోడ్ లో చేరికల కమిటీ!
టీ కాంగ్రెస్ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న మాజీ మంత్రి జానారెడ్డి వయసు రిత్యా అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. కానీ కేసీఆర్ ను ఓడించాలని కసితో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి, మాజీ ఎంపీలు పొన్నం, మధుయాష్కీగౌడ్, ఎంపీ కోమటిరెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ తదితర నేతలు ఇతర పార్టీ నుంచి చేరికలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే చర్చలు మొదలు పెట్టారు. ప్రధానంగా బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ నుంచి వస్తున్నవాళ్లతోనూ చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ ను పవర్ లోకి తీసుకురావాలంటే బలమైన నేతలకు కండువా కప్పాల్సిందేనని, దీనిలో భాగంగానే అన్ని జిల్లాల్లో చేరికలపై ఫోకస్ పెట్టినట్లు టీపీసీసీ కి చెందిన ఓ నేత తెలిపారు.
కర్ణాటక గ్రాఫ్ కంటిన్యూ!
కర్ణాటక రిజల్ట్స్ తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్రంలో ఓటు బ్యాంకు కూడా పెరుగుతున్నట్లు బీఆర్ఎస్ అధ్యయనం లో తేలినట్లు తెలిసింది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా కాంగ్రెస్ వైపు మళ్లే చాన్స్ ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతో ఈ సారి తామే అధికారంలోకి వస్తామనే ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈక్రమంలో బీఆర్ఎస్ లో బలమైన నేతలుగా ఉన్నోళ్లకు బీ ఫామ్ ఇవ్వడం వలన పార్టీతోపాటు ఆయా లీడర్ల భవిష్యత్తు కూడా మెరుగ్గా ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీ విశ్వాసం. అయితే వచ్చినోళ్లు గెలిచి మళ్లీ ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా కాంగ్రెస్ స్ట్రిక్ట్ రూల్ ను ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తున్నది.
ఈ నేతలపై ప్రత్యేక దృష్టి
బీఆర్ఎస్ నుంచి టికెట్లు దక్కని నేతలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిసింది. మాజీ మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతోపాటు కీలక నేతలైన వేముల వీరేశం, ముద్దగోని రామ్మోహన్ గౌడ్, నీలం మధు ముదిరాజ్, మలిపెద్ది సుధీర్ రెడ్డి, జలగం వెంకట్రావ్, ఎడ్ల సుధాకర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, రాములు నాయక్ తోపాటు ఇటీవల మంత్రి హరీశ్ రావు పై తీవ్ర విమర్శలు చేసిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును పార్టీలో తీసుకువచ్చేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు నేతలతో చర్చలు కూడా జరిపినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఖమ్మంలో ఈ నెల 27న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సభ నిర్వహించేందుకు రాష్ట్ర బీజేపీ ఏర్పాట్లు చేస్తున్నది. అయితే ఈ సభలో పలువురు కీలక నేతలు పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్నది. దీంతో సాధ్యమైనం త ఎక్కువ మంది పార్టీలో చేరేలా బీఆర్ఎస్ అసంతృప్తులతో బీజేపీ కీలక నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే అమిత్ షా సభలో ఎందరు కమల తీర్థం పుచ్చుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
చెన్నమనేనితో సంప్రదింపులు
బీఆర్ఎస్ అసంతృప్తులను చేర్చుకోవడానికి కమలదళం భారీగానే కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. గులాబీ అభ్యర్థుల జాబితాలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు చోటు దక్కలేదు. అక్కడి నుంచి చల్మెడ లక్ష్మీనరసింహరావుకు టికెట్ కేటాయించారు. దీంతో చెన్నమనేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే అతన్ని లాగేందుకు బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. సంప్రదింపులు సైతం మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే చెన్నమనేని రమేశ్ పై జర్మనీ పౌరసత్వానికి సంబంధించి కేసు ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో టికెట్టు తనకు ఇవ్వకపోయినా, తన కుమారుడికి టికెట్ కేటాయించాలని చెన్నమనేని బీజేపీ నేతల ముందు ప్రపోజల్ పెట్టినట్లు తెలిసింది.
అయితే దీనికి బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి. టికెట్ పై స్పష్టత ఇవ్వకుంటే ఆయన చేరే అవకాశాలు కష్టమే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మరోవైపు చెన్నమనేని ప్రపోజల్ కు ఓకే చెప్పినా ఇప్పటి వరకు అక్కడి నుంచి పోటీచేయాలని చూస్తున్న బీజేపీ ఆశావహుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్న వారిలో ఈటల వర్గానికి చెందిన తుల ఉమ కీలకంగా ఉన్నారు. అయితే జాయినింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటలనే చెన్నమనేనితో చర్చలు జరిపినట్లు సమాచారం. అదే నిజమైతే తుల ఉమకు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తారు? అసలు అవకాశం ఇస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
మల్కాజిగిరి ఎమ్మెల్యేతోనూ..
తన కొడుకు రోహిత్ కు మెదక్ టికెట్టు కోసం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావుపై ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. అయినా అధిష్టానం మళ్లీ మైనంపల్లికే మల్కాజిగిరి టికెట్టును కేటాయించింది. అయితే మెదక్ నుంచి మాత్రం పద్మా దేవేందర్ రెడ్డికి పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. అప్పటి నుంచి పార్టీపై మైనంపల్లి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. దీంతో బీజేపీ నేతలు మైనంపల్లితో కూడా టచ్ లో వెళ్లినట్లు సమాచారం. మరోవైపు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను మైనంపల్లి కలుసుకున్న ఫొటోలు వైరల్ గా మారాయి. అయితే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి.