Telangana Secretariat :సచివాలయం ప్రారంభం వాయిదా.. పరేడ్ గ్రౌండ్ మీటింగ్‌పై సస్పెన్స్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-11 06:32:24.0  )
Telangana Secretariat :సచివాలయం ప్రారంభం వాయిదా.. పరేడ్ గ్రౌండ్ మీటింగ్‌పై సస్పెన్స్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన కొత్త సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17వ తేదీన సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావించిన సర్కార్.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, అంబేద్కర్ మనువడు ప్రకాష్ అంబేద్కర్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలకు ఆహ్వానించింది.

ఇందుకు ఏర్పాట్లు కూడా చకచక చేస్తోంది. అయితే అదే రోజు మధ్యాహ్నం పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు అధికార పార్టీ ప్లాన్ చేసింది. ఇంతలోనే అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా సచివాలయం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటన చేయడంతో మరి పరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది.

పరేడ్ గ్రౌండ్ మీటింగ్ ఉన్నట్టా లేనట్టా?

సచివాలయం విషయంలో ప్రభుత్వం నిర్ణయంతో పరేడ్ గ్రౌండ్‌పై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ స్పీడ్ పెంచాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 17న సెక్రటేరియడ్ ప్రారంభం తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో పెద్ద ఎత్తున సభ నిర్వహించి ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ భావించారు. సచివాలం ఓపెనింగ్‌కు వచ్చే జాతీయ నేతలను ఈ మీంటింగ్‌కు ఆహ్వానించి నేషనల్ లెవెల్‌లో తమ బలమేంటో నిరూపించే ప్రయత్నం చేయాలనుకున్నారు. ఈ మీటింగ్ కోసం బీఆర్ఎస్ ఇప్పటికే కసరత్తు చేసింది.

సభకు జనాలను భారీగా తరలించాలని శుక్రవారం మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ‌తో పాటు సమీప నియోజకవర్గాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను ఆదేశించారు. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు టాస్క్ కూడా ఇచ్చారు. ఒక్కొ నియోజకవర్గం నుంచి 10 వేల మందిని తరలించాలని ప్రణాళిక వేసుకున్నారు. ఇంతలో సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడటంతో మరి పరేడ్ గ్రౌండ్ మీటింగ్ ఉంటుందా లేక దీన్ని కూడా వాయిదా వేస్తారా అనేది హాట్‌టాపిక్‌గా మారింది.

సచివాలయం పోస్ట్ పోన్ వెనుక అసలు రీజన్ ఇది కాదా?

కేసీఆర్ మానస పుత్రికగా చెప్పబడుతున్న కొత్త సచివాలయం వాయిదా విషయంలో ప్రభుత్వం చెపుతున్న కారణంపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగానే వాయిదా పడినట్లు ప్రభుత్వం చెబుతునప్పటికీ సచివాలయంలో అసంపూర్ణ పనులే ఈ వాయిదాకు అసలు రీజన్ అనే చర్చ కూడా జరుగుతోంది. ఇటీవల సచివాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు అఖిల పక్షనేతలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం ససేమిరా అనడంతో ఫైర్ యాక్సిడెంట్ తీవ్రత పైకి చెబుతున్న దానికంటే ఎక్కువే ఉందనే టాక్ వినిపిస్తోంది. అలాగే పెండింగ్ పనులు ఇంకా మిగిలిపోవడంతోనే ప్రభుత్వం ప్రారంభోత్సవ నిర్ణయం పోస్ట్ పోన్ చేసుకుందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. అగ్నిప్రమాదం విషయంలో నిజం ఒప్పుకోవడం ఇష్టం లేకే ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి ప్రభుత్వం వెనక్కి తగ్గిందని కేఏ పాల్ లాంటి వారి ఇప్పటికే సర్కార్ డిసిషన్‌పై కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రతిపక్షాల వాదనలతో సచివాలయం ప్రారంభోత్సవంపై పాలిటిక్స్ పీక్స్‌కు చేరుకున్నాయి.

Advertisement

Next Story