మధిరలో దారుణం.. వాతలు వచ్చేలా విద్యార్థినులను చితకబాదిన ప్రిన్సిపాల్!

by Satheesh |
మధిరలో దారుణం.. వాతలు వచ్చేలా విద్యార్థినులను చితకబాదిన ప్రిన్సిపాల్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మధిరలో దారుణ ఘటన వెలుగుచూసింది. విద్యార్థినులపై ప్రిన్సిపల్ కన్నెర్ర చేసింది. ఫుడ్ బాలేదన్నారన్న కోపంతో ఊగిసలాడుతూ విచక్షణారహితంగా విద్యార్థినులను దండించింది. దీంతో విద్యార్థినుల కాళ్లు వాతలతో కమిలిపోయాయి. ఈ దారుణ ఘటన గురువారం ఖమ్మం జిల్లా మధిరలోని మహాత్మా జ్యోతి బా ఫూలే బీసీ గురుకుల బాలికల వసతి గృహంలో చోటుచేసుకుంది. బాలికల కాళ్లకు వాతలు తేలి కమిలిపోయిన దృశ్యాల వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. మధిరలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థల ప్రాంగణంలో గురుకుల పాఠశాలను నిర్వహిస్తున్నారు. అయితే, ఇటీవల ఈ హాస్టల్‌ను సందర్శించిన ఓ విద్యార్థి సంఘం నాయకుడికి విద్యార్థినులు హాస్టల్‌లో తమ కష్టాలను చెప్పుకున్నారు.

వంటలు సరిగా ఉండడం లేదని, కూరల్లో కారానికి బదులు ఎండుమిర్చి మిక్సి పట్టి వేస్తుండటంతో కడుపులో మంట వస్తోందని, దీంతో గ్యాస్ ట్రబుల్ అవుతుందని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘం నాయకుడు ప్రిన్సిపల్‌ను ప్రశ్నించారు. విద్యార్థినులను ఇబ్బందులు పెట్టవద్దని సూచించి వెళ్లారు. దీంతో ఆగ్రహానికి లోనైన సదరు ప్రిన్సిపల్‌ 20 మందికి పైగా బాలికలను ఓ గదిలోకి పిలిచి కర్రతో తీవ్రంగా కొట్టడంతో వాతలు తేలాయి. కొందరికి కొట్టినచోట కమిలిపోయి గాయాలయ్యాయి. ఇక్కడ విషయాలు బయటకు చెబితే తమ సంగతి చూస్తానంటూ మరి కొట్టారని విద్యార్థినులు వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి వసతిగృహాన్ని సందర్శించారు. విచారణ చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్‌ను కోరారు.

కొట్టిన మాట వాస్తవమే..

ఈ ఘటనపై ప్రిన్సిపల్‌ నజీమాను విద్యార్థి సంఘాలు నిలదీశారు. దానికి ఆమె సమాధానమిస్తూ.. కొట్టిన మాట వాస్తవమే అని.. కానీ వారు సరిగా చదవట్లేదని కొట్టానని అన్నారు. పదోతరగతి అంతర్గత పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని, భయం కోసం రెండు దెబ్బలు వేశానని చెప్పారు. వంటలు బాగాలేవని కొట్టానని అనడం అవాస్తవమన్నారు. విద్యార్థినులకు ప్రతిరోజూ నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed