కాంగ్రెస్‌తో తెగని సీట్ల పంచాయితీ.. సీపీఐ కోరిన స్థానాలివే..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-07 16:16:07.0  )
కాంగ్రెస్‌తో తెగని సీట్ల పంచాయితీ.. సీపీఐ కోరిన స్థానాలివే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగేందుకు సీపీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి విదితమే. అయితే తాజాగా సీట్ల పంపకంపై చర్చించేందుకు సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ బుధవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు, రాజకీయ పరిస్థితులపై నారాయణ.. కేసీ వేణుగోపాల్‌తో చర్చించారు. ఈ భేటీ తర్వాత నారాయణ మాట్లాడుతూ.. రాజకీయాల్లో అన్నీ అర్థరాత్రి సమయంలోనే జరుగుతాయని.. ఇది కూడా అటువంటిదేనని చెప్పారు.

కాంగ్రెస్‌‌తో చర్చలపై స్పందించిన ఆయన.. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో సీపీఐ భాగమైనందున రాష్ట్రంలో కూడా ఆ వైఖరిని తీసుకోవాలని అనుకుంటామని చెప్పారు. ‘‘కేసీఆర్ బాహాటంగా బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నందున, జాతీయ స్థాయిలో వామపక్షాలు, కాంగ్రెస్‌లు చేతులు కలిపినందున, ఇది రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతిబింబించాలన్నారు. దాని గురించి ఇరు పార్టీలు సానుకూలంగా ఉన్నాయన్నారు. అయితే అది కార్యరూపం దాల్చాలి’’ అని నారాయణ పేర్కొన్నారు. తమ మధ్య చర్చలు సఫలమయ్యాయని, కాంగ్రెస్‌తో కలిసి వెళ్తామని నారాయణ చెప్పారు.

ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర సీపీఎం నేతలతో జాతీయ కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపి సీట్ల సర్దుపాటుపై ఫైనల్ చేసే అవకాశాలు వున్నాయన్నారు. గెలవగలగే స్థానాల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు చెరో సీటు ఇద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్‌కి నియోజక వర్గాల జాబితాను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇచ్చారు. ఖమ్మంలో.. కొత్తగూడం, వైరా.. నల్గొండలో.. మునుగోడు, ఆదిలాబాద్‌లో-బెల్లంపల్లి, కరీంనగర్‌లో- హుస్నాబాద్ స్థానాలను కోరారు. అయితే, ఖమ్మం జిల్లాలోనే రెండు సీట్లు ఇవ్వలేమని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది.

కావాలంటే ఒక సీటు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అయితే, భద్రాద్రి కొత్తగూడెం కావాలని సీపీఐ కోరింది. దాంతో హుస్నాబాద్ కోసం సీపీఐ పట్టుపట్టింది. కాంగ్రెస్-సీపీఐ పార్టీల మద్య పొత్త కుదిరితే.. సీపీఎం పార్టీ ఎటు వైపు మొగ్గు చూపుతుంది అనేది వేచి చూడాలి. కాగా సీపీఎం పార్టీ మాత్రం రెండు రోజుల తర్వాత ప్రతిపాదనలు ఇచ్చే ధోరణిలో ఉందని తెలిసింది. కేసీ వేణుగోపాల్‌తో నారాయణ చర్చలు నేపథ్యంలో గురువారం సీపీఐ నాయకులు అత్యవసర సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌తో చర్చలు, సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్బంగా సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ తాము మొత్తం ఐదు స్థానాలను ప్రతిపాదించాం. కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఈ స్థానాలకు అంగీకరిస్తే మంచిది మేము కలిసి పోటీచేస్తాం లేని పక్షములో తమ దారి తాము చూసుకుంటామని అయన తేల్చి చెప్పారు.

Advertisement

Next Story