- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల సిత్రాలు ఇవే.. ఉత్సాహం చూపని హైదరాబాదీలు
దిశ, తెలంగాణ న్యూస్ నెట్‌వర్క్ : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.38 శాతం నమోదు అయింది. గ్రామీణ ప్రాంతాల్లో హుషారుగా ప్రక్రియ సాగుతోంది. 17 లోక్‌సభ స్థానాలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు పెద్దసంఖ్యలో పోలింగ్ బూత్‌ల వద్ద బారులుతీరారు. అన్ని ఉమ్మడి జిల్లాలలోని పలు పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. సాంకేతిక సమస్యలు తలెత్తిన చోట అధికారులు ప్రత్యామ్నాయ ఈవీఎంలు తీసుకువచ్చి పోలింగ్‌ను కొనసాగిస్తున్నారు. కాగా తమ సమస్యలను తీర్చడం లేదంటూ కొన్నిచోట్ల గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ నాలుగో విడతలో భాగంగా 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.
ఈవీఎంల మొరాయింపు..
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 26 పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. గండివేట్ నుంచి మరో ఈవీఎంను తీసుకువచ్చి పోలింగ్‌ను కొనసాగించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం మల్యాల బ్లాక్ చౌరస్తాలోని బూత్ నెంబర్ 308, రామన్నపేటలోని 311 నెంబర్ పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూరు గ్రామంలో, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని 256 పోలింగ్ బూత్‌లో ఈవీఎంలు మొరాయించాయి. రాయికల్ మండలం మూటపల్లిలో ఈవీఎంపై ఒక పార్టీకి చెందిన సింబర్ ఉబ్బెత్తుగా ఉందని పోలింగ్ ఏజెంట్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టెక్నీషియన్స్ సరిచేయడంతో పోలింగ్ సజావుగా సాగుతోంది. మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లోని దుగ్గొండి మండలం పీజీ తండాలో 25 శాతం ఓట్లు పోలైన తర్వాత ఈవీఎం మొరాయించింది.
దొంగ ఓటు కలకలం..
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం 12వ బూత్‌లో దొంగ ఓటు కలకలం రేపింది. ఓటు వేయడానికి సమీనా బేగం అనే మహిళ పోలింగ్ బూత్‌కు రాగా ఆమె ఓటు అదివరకే వేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు. దీంతో తాను కాకుండా తన ఓటు ఎవరు వేశారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాంలోని పోలింగ్ కేంద్రంలో భారీగా వర్షంతో నీరు వచ్చి చేరడంతో ఓటర్లు క్యూలైన్‌లో నిల్చునేందుకు ఇబ్బందులు పడ్డారు. రంగారెడ్డి జిల్లా కోటపల్లి మండలం రాంపూర్‌లోని పోలింగ్ బూత్ నెంబర్ 272లో ఉదయం నుంచి పలుమార్లు ఈవీఎం మొరాయించడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు.
పోలింగ్ సిబ్బందికి పాము కాటు..
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అందర్ బంద్ పోలింగ్ కేంద్రంలో ఓపీవోగా ఎన్నికల విధులకు హాజరైన విపుల్‌రెడ్డి పాము కాటుకు గురయ్యారు. బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. కొమురంభీం జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన 219 పోలింగ్ కేంద్రంలో భవనం పై కప్పు పెచ్చులూడి ఎన్నికల విధులు నిర్వహిస్తున్న మార సాయికృష్ణకు స్వల్ప గాయాలు అయ్యాయి. హైదరాబాద్‌లోని కార్వాన్‌లో ఎన్నికల డ్యూటీకి హాజరైన ప్రిన్సిపాల్ హార్ట్ ఎటాక్‌తో మృతి చెందారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ముషీరాబాద్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా ఉన్న నరసింహ రెడ్ హిల్స్‌లోని బూత్ నంబర్ 151లో ఎన్నికల విధుల నిమిత్తం రాగా ప్రాణాలు కోల్పోయారు.
ఎన్నికలు బహిష్కరించి.. నిరసన...
తమ తండాలలో ప్రత్యేకంగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కొడిచెర్ల తండావాసులు ఎన్నికలను బహిష్కరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకువచ్చినా హామీ ఇచ్చి నెరవేర్చకపోవడంతో తండాకు వెళ్లే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రిభువనగిరి జిల్లా పోచంపల్లి మండలం కన్ముక్కుల గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం మండలం అల్లంపల్లి, బాబా నాయక్ తండా ఓటర్లు, కాగజ్‌నగర్ మండలం జగన్నాథ పూర్ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. తమ తండాలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేనందుకు నిరసనగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చింతలగడ్డ తండావాసులు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ఉన్నతాధికారులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఓటు వేసేందుకు గుర్రంపై..
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం రెబల్లె మాజీ సర్పంచ్ గుర్రంపై వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం అందరినీ ఆకర్షించింది.
ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ సెంటర్..
నల్లగొండ జిల్లాకేంద్రంలోని చెన్నకేశవ మెమోరియల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పర్యావరణ హిత పోలింగ్ కేంద్రం-69 ఆకట్టుకుంది. కొబ్బరి చెట్టు ఆకులు, చిలకలు, మామిడి తోరణాలతో ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేశారు.
కొడంగల్‌లో రేవంత్ .. చింతమడకలో కేసీఆర్..
పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి కొడంగల్ ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకోగా సిద్దిపేట జిల్లా చింతమడకలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు ఓటు వేశారు. మధిరలో కుటుంబ సభ్యులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. సికింద్రాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మేడ్చల్ మండలం పూడూర్ గ్రామంలో మాజీమంత్రి ఈటల రాజేందర్, హైదరాబాద్ నందినగర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటు వేశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వట్టపల్లి జైన్ హిల్స్‌లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తో పాటు పలువురు మంత్రులు, అభ్యర్థులు, సినీ నటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నియోజకవర్గాల వారీగా నమోదైన పోలింగ్ శాతం:
మధ్యాహ్నం 1 గంట వరకు
ఆదిలాబాద్ 50.18%
భువనగిరి 46.49%
చేవెళ్ల 34.56%
హైదరాబాద్ 19.37%
కరీంనగర్ 45.11%
ఖమ్మం 50.63%
మహబూబాబాద్ 48.18%
మహబూబ్‌నగర్ 45.81%
మల్కాజిగిరి 27.69%
మెదక్ 46.72%
నాగర్‌కర్నూల్ 45.88%
నల్గొండ 48.48%
నిజామాబాద్ 45.67%
పెద్దపల్లి 44.87%
సికింద్రాబాద్ 24.91%
వరంగల్ 41.23%
జహీరాబాద్ 50.71%
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ 29.03%
Read More..
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు: సాయంత్రం 5 గంటలకు 61.16 శాతం పోలింగ్ నమోదు