తల్లడిల్లుతున్న తల్లి.. సరిగ్గా రెండేళ్ల తర్వాత మళ్లీ అదే కష్టం!

by GSrikanth |
తల్లడిల్లుతున్న తల్లి.. సరిగ్గా రెండేళ్ల తర్వాత మళ్లీ అదే కష్టం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఉక్రెయిన్‌లో వైద్యవిద్య చదువుతూ చిక్కుకుపోయిన తన కుమారుడి కోసం తెలంగాణ మహిళ తల్లడిల్లుతోంది. లాక్‌డౌన్ సమయంలో తన కుమారుడిని కాపాడటానికి రోడ్డు మార్గంలో 1400 కిలోమీటర్లు స్కూటర్లో ప్రయాణించిన తెలంగాణ మహిళ రజియాబేగం ఇప్పుడు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తన కుమారుడు మహమ్మద్ నిజాముద్దీన్ అమన్ (21) రాకకోసం వేచిచేస్తున్నారు. అమన్ ఉక్రెయిన్‌లోని సుమి రాష్ట్ర యూనివర్శిటీలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్నాడు. రష్యా సైనిక దాడికి ఎదురొడ్డుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయ విద్యార్థుల్లో అమన్ ఒకరు. వివరాల్లోకి వెళితే, 2020లో మొట్టమొదటి లాక్‌డౌన్ విధించిన కాలంలో రజియా బేగం ఆంధ్రప్రదేశ్‍లో స్నేహితుడి ఇంట్లో చిక్కుకుపోయిన తన కుమారుడు అమన్ కోసం 1400 కిలోమీటర్ల దూరం స్కూటర్లో ప్రయాణించి జాతీయ వార్తల్లోకి ఎక్కారు.

సరిగ్గా రెండేళ్ల తర్వాత ఉక్రెయిన్ యుద్ధవాతావరణంలో చిక్కుకున్న అదే కుమారుడి రాకకోసం ఆమె కళ్లలో వత్తులు వేసుకుని చూస్తున్నారు. 21 ఏళ్ల అమన్ ఉక్రెయిన్‌లోని సుమీలో ఉన్న తన హోటల్‌ బేస్‌మెంట్‌లో 800 మంది తోటి విద్యార్థులతో కలిసి బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నాడు. ఆహారం, నీరు కొరత, విద్యుత్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. తెలంగాణలోని బోధన్‌కి చెందిన సలంపాడ్ గ్రామంలో ఉన్న రజియా అక్కడే స్థానిక మండల పరిషద్ స్కూల్‌లో హెడ్ మిస్ట్రెస్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి కూడా అమన్ తన తల్లితో మాట్లాడాడు. ''అక్కడ పరిస్థితి ఘోరంగా ఉంది. వాడు ఉన్న చోట బయట నిరంతరం బాంబులు కురిపిస్తున్నారు. హాస్టల్ బయట తుపాకీ కాల్పులు వినబడుతున్నాయి. ఆహారం ఏది దొరికితే అది తీసుకుని గడుపుతున్నారు.'' అని రజియా తన కుమారుడు చెప్పిన విషయాలు పంచుకున్నారు.

Advertisement

Next Story