ఫోన్ ట్యాపింగ్ మాస్టర్ మైండ్ KCRదే.. ఆ బై ఎలక్షన్ నుంచే ఆపరేషన్ స్టార్ట్

by Sathputhe Rajesh |   ( Updated:2024-05-28 04:07:37.0  )
ఫోన్ ట్యాపింగ్ మాస్టర్ మైండ్ KCRదే.. ఆ బై ఎలక్షన్ నుంచే ఆపరేషన్ స్టార్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తవ్వినా కొద్దీ కొత్తకొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే అరెస్టయిన నాటి ఎస్ఐబీ అధికారులు.. టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్లలో ట్యాపింగ్ ఆపరేషన్ బహిర్గతమైంది. అందరి వేళ్లూ పెద్దాయన (కేసీఆర్)వైపే ఉన్నాయి. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో మొదలైన ట్యాపింగ్ ఆపరేషన్ గతేడాది అసెంబ్లీ ఎన్నికల వరకూ కంటిన్యూ అయింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పేరు తెరపైకి రావడంతో బీజేపీని టార్గెట్ చేసిన కేసీఆర్.. చివరకు బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేసే వ్యూహాన్ని పోలీసులకు అప్పగించారు. మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఎపిసోడ్‌పై సర్వియలెన్స్, అప్పటి ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఇంట్లో ఆడియో, వీడియో రికార్డింగ్ సైతం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని ఆ స్టేట్‌మెంట్లలో స్పష్టమైంది. ఏప్రిల్ 9వ తేదీన ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు ప్రస్తావించారు.

బ్యూరోక్రాట్లు, జర్నలిస్టుల ఫోన్లు సైతం..

ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతలు మాత్రమే కాకుండా పత్రికాధిపతులు, జర్నలిస్టులు, బ్యూరోక్రాట్ల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేయడానికి కేసీఆర్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు ఆయా స్టేట్‌మెంట్లలో రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు స్పష్టం చేశారు. అప్పటి పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి, జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి, బీజేపీ నేతలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, అచ్చంపేట ఎమ్మెల్యే (ప్రస్తుత) డాక్టర్ వంశీకృష్ణ, గద్వాల కాంగ్రెస్ లీడర్ సరితా తిరుపతయ్య, కోరుట్ల కాంగ్రెస్ నేత జువ్వాడి నర్సింగరావు, మానకొండూరు నేత కవ్వంపల్లి సత్యనారాయణ.. ఇలాంటి అనేక మంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు పేర్కొన్నారు.

అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ద్వారా జరిగిన ఈ వ్యవహారంలో ప్రణీత్ రావు తన టీమ్‌తో మొత్తం ఆపరేషన్ నడిచినట్టు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ నిఘా పలువురు బ్యూరోక్రాట్లపైనా కొనసాగుతుండడంతో దాన్ని గ్రహించిన చాలామంది ఆఫీసర్లు రెగ్యులర్ ఫోన్ కాల్స్ మాట్లాడడానికే భయపడేవారని భుజంగరావు తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఆఫీసర్లు ప్రత్యామ్నాయంగా వాట్సాప్, సిగ్నల్, షేర్‌చాట్ లాంటి ప్లాట్‌ఫామ్‌లను ఎంచుకున్నారని తెలిపారు.

ఇవన్నీ ఎన్‌క్రిప్టెడ్ (పాయింట్ టు పాయింట్) టెక్నాలజీ ఆధారంగా పని చేస్తున్నందున ఇంటర్‌నెట్ ప్రోటోకాల్ డాటా రికార్డ్స్ (ఐపీడీఆర్) ఆధారంగా విశ్లేషించేవారమని, ఇంటర్నెట్ కాల్స్ ద్వారా జరిగే కమ్యూనికేషన్‌ను ట్రాక్ చేసేవారమని తెలిపారు. నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు సంయుక్త ఆపరేషన్‌లో భాగంగా ఇదంతా జరిగేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి థ్రెట్‌గా ఉండేవారంతా ట్యాపింగ్ లిస్టులో ఉన్నారని, వారి ప్రొఫైల్స్, కదలికలన్నీ ఎప్పటికప్పుడు రికార్డయ్యేవన్నారు.

సన్నిహితులను సైతం వదల్లేదు..

సొంత పార్టీ నేతల ఫోన్లు సైతం ట్యాపింగ్‌కు మినహాయింపు కాదని వారి వాంగ్మూలాలతో తేటతెల్లమైంది. కేసీఆర్‌, కేటీఆర్‌లకు అత్యంత సన్నిహితంగా ఉండే శంభీపూర్‌రాజు, పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార్య సునీత, తీగల కృష్ణారెడ్డి, తాటికొండ రాజయ్య వంటి తదితర నేతల ఫోన్లు సైతం ట్యాపింగ్ లిస్టులో ఉన్నాయి. ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు, స్థానిక లీడర్లతో ఉన్న విభేదాలు, గ్రూపు తగాదాల కారణంగా వీరి పేర్లు ఆ లిస్టులో చేరాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ సైతం ట్యాపింగ్ జాబితాలో ఉన్నది. రెండు తెలుగు టీవీ చానెళ్ల హెడ్‌లు, పదుల సంఖ్యలో జర్నలిస్టులు, తీన్మార్ మల్లన్న తదితరుల ఫోన్లనూ ట్యాపింగ్ చేసినట్టు తేలింది. ప్రతిపక్షాలతో సంబంధాల్లో ఉండే వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక సహకారం అందించేవారు సైతం బాధితులుగా మారారు.

ట్యాపింగ్‌లో హరీశ్‌రావు ప్రమేయం

గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో (అక్టోబరు-నవంబరు మధ్య) నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావుతో ఒక ప్రయివేటు టీవీ చానెల్ అధిపతి నేరుగా కాంటాక్టులోకి వెళ్లారు. వీరిద్దరి మధ్య బంధాన్ని కలిపింది మాజీ మంత్రి హరీశ్‌రావు అని భుజంగరావు తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. హరీశ్‌రావు ఆదేశాల మేరకు ప్రభాకర్‌రావు జోక్యం చేసుకుని ప్రణీత్‌రావుకు, ఆ టీవీ ఛానెల్ హెడ్ శ్రావణ్ కుమార్‌కు మధ్య లింకు ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష లీడర్లు, వారి అనుచరులు, వారితో సంబంధాలున్న ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ పర్సన్స్, ఆర్థిక సహకారమందించేవారు... ఇలా అందరి ఫోన్ల ట్యాప్ చేశారు. అందుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా ప్రణీత్‌రావు, ప్రభాకర్‌రావు మధ్య పాస్ అవుతుందేడని, బీఆర్ఎస్ పొలిటికల్ ప్రయోజనాల కోసమే ఇదంతా జరిగిందని భుజంగరావు పేర్కొన్నారు.

మొయినాబాద్ కేసు కీలకమైనది : రాధాకిషన్‌రావ్

ఫోన్ ట్యాపింగ్‌లో మొయినాబాద్ ఫామ్ హౌజ్ (ఎమ్మెల్యేల కొనుగోలు) వ్యవహారం కీలకమైనదని తన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో రాధాకిషన్ రావు పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పేరు ప్రస్తావనకు రావడంతో స్వయంగ కేసీఆర్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని వివరించారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలో (2022 అక్టోబర్) ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ద్వారా కొద్దిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ తనవైపు లాక్కుంటుందనే సమాచారం కేసీఆర్‌కు తెలిసిందన్నారు. వెంటనే ప్రభాకర్‌రావుతో ఈ విషయాన్ని డిస్కస్ చేసినట్టు రాధాకిషన్‌రావు పేర్కొన్నారు. అప్పటికే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గెలుపునకు బ్రేక్ వేసేలా ప్లాన్ జరిగిందన్నారు.

కవితను సేవ్ చేసుకునేందుకు...

మొయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారాన్ని డైరెక్టుగా కేసీఆర్ గైడ్ చేశారని, అప్పటి ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి చెందిన ఫామ్ హౌజ్‌లో సర్వియలెన్స్ వ్యవస్థను నెలకొల్పారని, ఆడియో, వీడియో రికార్డింగ్ మొత్తం కేసీఆర్ కనుసన్నల్లో జరిగిందన్నారు. బీజేపీ తరఫున బేరమాడడానికి వచ్చిన నందకుమార్, మరో ఇద్దరు స్వామీజీల ఫోన్లను ట్యాపింగ్ చేసిన ప్రణీత్‌.. ఆడియో క్లిప్‌లను కేసీఆర్‌కు అందజేశారని రాధాకిషన్ రావు తెలిపారు. ఫాంహౌజ్‌లో వారందరి మధ్య జరిగే సంభాషణలను రికార్డు చేయడానికి అవసరమైన స్పై కెమెరాలను తానే కొనుగోలు చేసినట్టు రాధాకిషన్‌రావు పేర్కొన్నారు. బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేస్తే బీజేపీ రాజీకి వస్తుందని, ఈడీ కేసు నుంచి కవితను సేవ్ చేసుకోడానికి వీలవుతుందనే ప్లాన్‌తో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు.

సైబరాబాద్ పోలీసుల అసమర్ధత కారణంగా సిట్ బృందం కేరళకు వెళ్లినా మాతా అమృతానందమయి ఆశ్రమానికి చెందిన ఒక కీలక వ్యక్తి అరెస్టు నుంచి తప్పించుకున్నారని తెలిపారు. ఆ తర్వాతనే ఐపీఎస్ ఆఫీసర్ రెమా రాజేశ్వరి, ఇన్‌స్పెక్టర్ గట్టు మల్లు, మరికొందరు ఎస్ఐబీ ఆఫీసర్లు ప్రత్యేకంగా చార్టర్డ్ విమానంలో కేరళ వెళ్లారని, అయినా ఆపరేషన్‌ను సక్సెస్ చేయలేకపోయారన్నారు. ఇంత కష్టపడినా ఆశించిన తీరులో పురోగతి లేకపోవడంతో పెద్దాయన (కేసీఆర్) అప్‌సెట్ అయ్యారని, చివరకు హైకోర్టుకు ఈ కేసు వెళ్లడంతో అరెస్టు నుంచి రిలీఫ్ రావడంతో పాటు సీబీఐకి బదిలీ అయ్యేలా ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డికి చెందిన రూ.మూడున్నర కోట్లను హైదరాబాద్‌లోని మారియట్ హోటల్ దగ్గర సీజ్ చేశామని, ఆయన ఆర్థిక మూలాలకు బ్రేక్ వేయగలిగామన్నారు.

రాధాకిషన్‌రావుకు విస్తృతాధికారాలు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఓటీ (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) డీసీపీ రాధాకిషన్‌రావుకు కేసీఆర్ విస్తృత అధికారాలను అప్పగించారు. ట్యాపింగ్ చేయదల్చుకున్న ఫోన్లకు సంబంధించి కాల్ డాటా రికార్డులను, ఐపీడీఆర్‌ను, లొకేషన్లను నేరుగా టెలికామ్ డిపార్టుమెంటు నుంచి, ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సేకరించే పవర్ ఉన్నట్టు స్వయంగా రాధాకిషన్ రావు తన స్టేట్‌మెంట్‌లో చెప్పారు. ‘మీరు నాతో వస్తే... నా టాస్క్ ఫోర్స్ ఆఫీసులో ఏర్పాటు చేసుకున్న వ్యవస్థను చూపిస్తాను.. ట్యాపింగ్ కోసం వాడిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను సైతం చూపిస్తాను. వాటిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించిన ఎక్విప్‌మెంట్ వివరాలనూ ఇవ్వగలను. కానీ పెద్దాయన (కేసీఆర్) నాకు ఉద్యోగంలో కల్పించిన వెసులుబాటు, నా పదోన్నతికి చేసిన సాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు సంబంధించిన మరింత లోతైన వివరాలను నేను వెల్లడించలేను...’ అని తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.

ఈ వారంలో నగరానికి ప్రభాకర్‌రావు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఆపరేషన్‌ను నడిపించిన ఇంటెలిజెన్స్ ప్రభాకర్‌రావు ఈ నెలాఖరుకు హైదరాబాద్‌కు రానున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయనకు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. నాంపల్లి కోర్టు నుంచి రెడ్ కార్నర్ నోటీసు జారీచేసేందుకు, అరెస్టు వారెంట్ ఇచ్చేందుకు అనుమతి లభించింది. హరీశ్‌రావు కనుసన్నల్లో ఫోన్ ట్యాపింగ్‌లో కీలక భూమిక పోషించిన ప్రయివేటు టీవీ చానెల్ హెడ్ శ్రావణ్ కుమార్‌ సైతం విదేశాలకు వెళ్లిపోవడంతో ఆయనపైనా లుకౌట్ నోటీసు జారీ అయింది. ప్రభాకర్‌రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ-వన్‌గా పేర్కొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ఆయన ఇండియాకు చేరుకోగానే అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఏ ఎయిర్‌పోర్టులో దిగినా ఇమ్మిగ్రేషన్ డిపార్టుమెంటు ఆయన పాస్‌పోర్టును సీజ్ చేసి పోలీసులకు సమాచారం అందిస్తుంది.

Advertisement

Next Story