ఒత్తిడి పెంచుతున్న తాజా అంశం .. పొంగులేటి అనుచరుల్లో కొత్త టెన్షన్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-12 05:32:29.0  )
ఒత్తిడి పెంచుతున్న తాజా అంశం .. పొంగులేటి అనుచరుల్లో కొత్త టెన్షన్!
X

దిశ, అశ్వారావుపేట : అశ్వారావుపేట నియోజకవర్గంలో పొంగులేటి అనుచరులు ఇరకాటంలో పడ్డారు. నూతన సంవత్సర వేడుకగా మొదలైన సందిగ్ధ పరిస్థితులే ఇందుకు కారణమయ్యాయి. నాలుగు నెలలైనా ఆ పరిస్థితులలో ఇటువంటి మార్పు లేకపోవడం ఒకటైతే.. అనూహ్యంగా అధికారం చేజారడం ఇబ్బందిగా మారాయి. కొద్ది రోజుల క్రితం వరకు బీఆర్ఎస్‌లో పెత్తనం చెలాయించినా వీరి ప్రమేయం లేకుండానే ప్రభుత్వ కార్యక్రమాలు జరిగిపోతుండటం మింగుడు పడని విషయమైతే.. ఇన్నేళ్లుగా వెంట తిరిగిన వారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఇప్పించాల్సిన బాధ్యత వీళ్లకు సవాల్ విసురుతున్నది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు వీరికి ఊపిరాడకుండా చేస్తున్నదంటే అతిశయోక్తి కాదు.

అనుకూలంగా ఉండేందుకు..

ఖమ్మం పొంగులేటి నివాసంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన పొంగులేటి వర్గం నాయకులు.. ఆ మరుసటి రోజు నుంచే ఎమ్మెల్యే మెచ్చాకు టచ్‌లో ఉండేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఓ నాయకుడేమో తాటి సుబ్బన్నగూడెంలోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి శాలువా కప్పి మిఠాయిలు తినిపించి వచ్చారు. కొందరు రిపబ్లిక్ డే వేడుకల్లో ఎమ్మెల్యేతో సన్నిహితంగా మెలిగారు. ఇంకొకరేమో దమ్మపేట మండలం మందలపల్లిలో వంట గ్యాస్ ధర పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఆందోళనకు హాజరై ఆశ్చర్యపరిచారు.

ఇలా పలు సందర్భాల్లో పొంగులేటి వర్గంలోని కొందరు ఎమ్మెల్యే మెచ్చాకు దగ్గరయ్యేలా వ్యవహరించారు. కొందరైతే ఓ అడుగు ముందుకేసి రహస్యంగా కలిసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే దళితబంధు రెండోవిడత, గృహలక్ష్మి వంటి పలు పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యే నిర్ణయమే కీలకం. కాబట్టి వారు నాయకుడిగా వ్యవహరించే ప్రాంతంలో వారికి ఈ పథకాలను ఇప్పించాలనే ఒత్తిడి, అభద్రతాభావం కారణాలైతే.. ఇంకొందరికి బీఆర్ఎస్ పార్టీతో ఉన్న లావాదేవీలు కారణం అయ్యుండొచ్చు..!

కొనసాగుతున్న సస్పెన్స్

పొంగులేటి పార్టీ మార్పుపై గడిచిన మూడేళ్లుగా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే పొంగులేటి బీఆర్ఎస్ ను విభేదిస్తున్నట్లు డిసైడ్ అయ్యారో.. అంటే గడిచిన నాలుగు నెలలుగా ఈ ప్రచారం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఓ రోజు బీజేపీలో చేరికకు సంప్రదింపులు పూర్తయ్యాకే బీఆర్ఎస్ కు ఎదురెళ్తున్నారని.. మరో రోజు కాంగ్రెస్ పార్టీతో చర్చలు సఫలమై ఉమ్మడి ఖమ్మం జిల్లా సీట్ల సర్దుబాటు కూడా అయిపోయిందని. లేదు లేదు వైఎస్ షర్మిల నాయకత్వంలో వైఎస్సార్టీపీ నుంచి పొంగులేటి అభ్యర్థులు బరిలో నిలవనున్నారని మరో ప్రచారం.. అంతటితో ఆగకుండా పొంగులేటి టిఆర్ఎస్ అనే కొత్త పార్టీని పెట్టబోతున్నారంటూ ఇలా రోజుకో సరికొత్త ప్రచారాలు పుట్టుకొస్తున్నాయి. ఇలా ఎటు తేలని రాజకీయ నిర్ణయంతో పొంగులేటి అనుచరులలో పైకి కనిపించని టెన్షన్ ఇబ్బంది పెడుతున్నది. ఇటీవల నియోజకవర్గానికి వచ్చిన పొంగులేటిని ఏ పార్టీ ఏంటి అని నిర్ణయం త్వరగా ప్రకటించాలని నాయకులు కోరారు. పార్టీ నిర్ణయం ప్రకటించే రోజు కోసం తొందరపాటు లేకుండా వేచి ఉండాలని ఆయన చెప్పకనే చెప్పారు.

అనుచరుల స్థానాలపై కన్ను..

అశ్వారావుపేట నియోజకవర్గంలో ఐదు మండలాల్లో రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని.. గత కొన్నాళ్లుగా ఏపార్టీ అధికారంలోకి వచ్చిన సరే.. అన్ని విషయాల్లో ఆధిపత్యం చెలాయించే కొందరు ఇప్పుడు పొంగులేటి వెంట వచ్చారు. ఇదే అదునుగా చేసుకుని ఇన్నాళ్లు ద్వితీయ శ్రేణిలో ఉన్న నాయకులు అలాంటి వారి స్థానంపై కన్నేశారు. బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టే.. ఎవరైనా వాళ్ల పనులు నిమిత్తం అధికారం ఉన్న వాళ్లనే ఆశ్రయిస్తుంటారు కాబట్టి.. అప్పుడు వాళ్లు చక్కబెట్టిన పనులను.. ఇప్పుడు వీళ్లు భుజానికి ఎత్తుకొని వారి స్థానాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు షురూ చేశారు.

ఎన్నో ఏళ్లుగా ఒకేలా ఉండే పరిస్థితులలో జనవరి1 తేదీ నుంచి ఎన్నో మార్పులు జరుగుతూ వస్తున్నాయి. వార్డు నుంచి మండల స్థాయిలో ప్రభుత్వ పథకాల మంజూరు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో కీలకంగా వ్యవహరించిన పొంగులేటి అనుచరుల స్థానాన్ని కైవసం చేసుకునేందుకు రాజకీయ ప్రత్యర్థులు చురుకుగా పావులు కదుపుతున్నారు. ఇన్నాళ్లుగా ఏ విషయానికైనా తమను సంప్రదించే అధికార ప్రజాప్రతినిధులు ఇప్పుడు వేరే వారికి ప్రాధాన్యత ఇస్తూ ఉండటం కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.

Also Read.

చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు.. ఎన్నికల శంఖారావం తలపించేలా!

Advertisement

Next Story

Most Viewed