అలంకారప్రాయంగా హెచ్ఆర్సీ

by Javid Pasha |
అలంకారప్రాయంగా హెచ్ఆర్సీ
X

ప్రజలకు రాజ్యాంగ, చట్టబద్ధంగా హక్కుల రక్షణ కల్పించాల్సిన హ్యూమన్ రైట్స్ కమిషన్‌ (మానవ హక్కుల కమిషన్) అలంకార ప్రాయంగా మారింది. బాధితులకు న్యాయం అందించాల్సిన కమిషన్ కార్యాలయం ఖాళీగా దర్శనమిస్తున్నది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌ గా జస్టిస్ చంద్రయ్య గత ఏడాది డిసెంబర్ 22వ తేదీన రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి ఆ కుర్చీ ఖాళీగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త బాడీని ఏర్పాటు చేయలేదు. చైర్మన్ ఉన్నప్పుడే పెండింగ్ లో ఉన్న ఫిర్యాదుల సంఖ్య ఇటీవల మరింత పెరిగింది. ప్రజల సమస్యలకు సకాలంలో పరిష్కారం దొరకడం లేదు.

దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్చార్సీలో ఫిర్యాదు చేసేందుకు కార్యాలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి బాధితులు కోటి ఆశలతో వస్తున్నారు. అయితే.. చైర్మన్ లేకపోవడంతో అక్కడి అధికారులు చెప్పే నిర్లక్ష్యపు సమాధానం విని, ఇక్కడ న్యాయం దొరకదనే నిరాశతో వెళ్లిపోతున్నారు. లీగల్‌ సెల్ ద్యారా పరిష్కారం దొరుకుతుందని, ఇక్కడిదాకా రావడమెందుకని ఉచిత సలహాలిచ్చి పంపించేస్తున్నారు. హెచ్ఆర్సీ బిల్డింగ్‌లో గదుల మరమ్మతుల పనులు జరుగుతున్నాయనే కారణాన్ని కూడా చూపిస్తున్నారు. మేజర్ సమస్య అనుకునే కొన్ని పిటిషన్లను తీసుకున్నా.. వాటిని రిజిస్టర్ చేసి ఫైళ్లకే పరిమితం చేస్తున్నారు. గతంలో సగటున రోజుకు 30కి పైగా ఫిర్యాదులు వచ్చేవి. ఇప్పుడు చైర్మన్ లేకపోవడంతో 10 ఫిర్యాదులే వస్తున్నాయి. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఫిర్యాదుల సంఖ్య క్రమంగా తగ్గింది.

అధికారులు తిప్పి పంపించారు: సలాం, షాబాద్ (రంగారెడ్డి జిల్లా)

“మా ఊరు షాబాద్. నా భూమిని రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తులకు ఉద్దేశ్యపూర్వకంగానే రిజిస్టర్ చేశారు. రెవెన్యూ అధికారులకు చెబితే.. సమస్యను పరిష్కరించడానికి బదులు నన్ను మానసికంగా వేధిస్తున్నారు. హెచ్ఆర్సీలో గత ఏడాది డిసెంబరు 5వ తేదీన ఫిర్యాదు చేశాను. సోమవారం (ఫిబ్రవరి 27) రావాలంటూ హెచ్ఆర్సీ నుంచి మెసేజ్ వచ్చింది. తీరా వస్తే అధికారులు తిప్పి పంపించారు. మళ్లీ ఎప్పుడు రావాలో సరైన సమాధానం చెప్పలేదు”

మాకు న్యాయం చేయండి: పిన్నంచర్ల గ్రామ దళితులు

“మాది వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలం, పిన్నంచర్ల గ్రామం. మా ఊర్లో సర్పంచ్ భర్త మమ్మల్ని కులం పేరుతో దూషించి దాడులకు పాల్పడ్డారు. అగ్రకుల అధిపత్యం చూపిస్తున్నారు. వారిని అరెస్టు చేయాలని ఫిర్యాదు చేసినా పోలీసులు నిందితులకే వత్తాసు పలికారు. మాపైనే అక్రమ కేసులు పెట్టారు. మాకు న్యాయం చేయాలని హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశాం”.

నాకు ప్రాణహాని ఉంది: శివ కుమార్ యాదవ్ (వనపర్తి)

“రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి, కొత్తకోట సీఐ శ్రీనివాస్ రెడ్డి‌ల నుండి మాకు ప్రాణహాని ఉంది. మంత్రి నిరంజన్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు నాపై కొత్తకోట సీఐ కేసు నమోదు చేశాడు. మంత్రి అనుచరులు ఆరోపిస్తున్నట్లుగా మంత్రికి వ్యతిరేకంగా నేను ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. నాకు వచ్చినదాన్ని వాట్సాప్ ద్వారా షేర్ మాత్రమే చేశాను. దీంతో సీఐ నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. తీవ్రంగా దూషించడంతో పాటు కొట్టారు. కొట్టినట్టు జడ్జి ముందు చెబితే కుటుంబ సభ్యులను ఎన్‌కౌంటర్ చేస్తానని సీఐ బెదిరించారు. పోలీస్ కస్టడీలో పెట్టుకొని స్వయంగా మంత్రి నిరంజన్ రెడ్డికి కాల్ చేసి క్షమాపణలు చెప్పించారు. వారి నుంచి రక్షణ కల్పించాలని, మంత్రి, సీఐపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశాను.”

Advertisement

Next Story