100 డైల్ చేస్తే ప్రాణానికి ముప్పా..?

by Kalyani |
100 డైల్ చేస్తే ప్రాణానికి ముప్పా..?
X

దిశ, తాండూరు రూరల్ : అక్రమ ఇసుక మాఫియా గురించి 100కు డయల్ చేసి సమాచారమిస్తే ప్రాణానికి ముప్పు తప్పదని సందేహాలు వస్తున్నాయి. అక్రమ ఇసుక రవాణాపై డయల్ 100 కు సమాచారమిచ్చిన కాంగ్రెస్ నేతపై ఏకంగా అర్ధరాత్రి ఇంటికెళ్లి ఇసుక మాఫియా డాన్ గా వ్యవహరిస్తున్న ఓ మాజీ సర్పంచ్ అగ్గానుర్ భీమప్ప అనుచరులు దాడి చేసిన సంఘటన కరణ్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీర్ శెట్టిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుల పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం వీరెశెట్టి పల్లి గ్రామ శివారులోని కాగ్నానది నుంచి అక్రమార్కులు ఇసుకను తరలిస్తున్నానే విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన ఫిరంగి జర్నప్ప శుక్రవారం రాత్రి 2 గంటల సమయంలో డయల్ 100 కు కరన్ కోట్ పోలీసులకు ఫోన్లో సమాచారం చేరవేశారు. దీంతో ఎస్ఐ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకొని స్టేషన్ తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశాడనే కోపంతో జర్నప్పను ఇసుక మాఫియా డాన్ గా పిలువ బడే ఓ మాజీ సర్పంచ్ (బీమప్ప) మాఫియా గ్యాంగ్ శుక్రవారం అర్ధరాత్రి అతనిపై దాడి చేశారు. దీంతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇసుక మాఫీయా అర్ధరాత్రి ఊళ్లకు వచ్చి దాడి చేయడంపై గ్రామస్తులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇదంతా గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరా కూడా రికార్డు అయినట్లుగా జర్నప్ప తెలిపాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలిపారు. కానీ కేసు నమోదులో ఒక డ్రామాగా కొనసాగినట్లుగా సమాచారం. అలాగే జర్నప్ప కూడా భీమప్ప తనను బెదిరించాడని తనను తన పిల్లలను కూడా చంపుతానని అలాగే పిల్లలు స్కూల్లో చదువుతున్నారని వారిని కూడా టీసి ఇచ్చి పంపుతా అని బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని వాపోయాడు. ఈ విషయంపై శనివారం డీఎస్పీ ఫిర్యాదు చేయడానికి వచ్చిన కూడా డిఎస్సి అందుబాటులో లేకపోవడంతో మరోమారు కరన్ కోర్ట్ ఎస్సై విట్టల్ రెడ్డికి వివరించాడు. విట్టల్ రెడ్డి ఫిర్యాదు స్వీకరించడం జరిగిందని కేసు నమోదు చేస్తానని చెప్పడం జరిగిందని తెలిపారు. అయితే మరోసారి ఈ విషయంపై కూడా రాజీ కావాలని ఒత్తిడి తెస్తున్నట్లుగా జర్నప్ప పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లు 5 ఉండగా రెండిటి పైన కేసు కావడం పై పోలీసులపై పలు విమర్శలు ఉన్నాయి.

అధికార పార్టీ లీడర్ పై దాడి..!

వీరిశెపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడైన వ్యక్తిపై దాడి చేయడంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికార పార్టీకి చెందిన లీడర్ అక్రమ మాఫియా ఇసుక గురించి 100 డయల్ ఇచ్చిన సమాచారం ఇసుక మాఫియా గ్యాంగ్ కు ఎలా తెలిసింది అన్న విషయమే తీవ్ర చర్చనీయంగా మారింది. రహస్య విషయాలను 100 కు డయల్ చేస్తే ప్రాణానికి ప్రమాదంగా ఉంటుందని భావన ప్రజల్లో కలుగుతోంది.

ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన బాధితుడు

అక్రమ ఇసుక మాఫియా గ్యాంగ్ తనపై దాడి చేసిందని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గత 30 ఏళ్ల నుంచి అగ్గానుర్ భీమప్ప అనే వ్యక్తి ఇసుక మాఫియా చేస్తున్నట్లు ఎమ్మెల్యేకు తెలిపినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

Next Story

Most Viewed