గెస్ట్ లెక్చరర్స్‌కు 12 నెలల వేతనం అమలు చేయాలి

by Javid Pasha |
గెస్ట్ లెక్చరర్స్‌కు 12 నెలల వేతనం అమలు చేయాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లను ప్రతీ సంవత్సరం ఆటో రెన్యూవల్ చేయాలని, అదేవిధంగా గెస్ట్ లెక్చరర్లకు కన్సాలిడేట్‌గా 12 నెలల వేతనం అమలు చేయాలని గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ గెస్ట్ లెక్చరర్ల సంఘం డిమాండ్ చేసింది. శనివారం హైద్రాబాద్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి‌ని, ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణలను సంఘం నాయకులు కలిసి వినతి పత్రాలు అందజేశారు. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, అసోసియేట్ ప్రెసిడెంట్ కె. మహేష్ కుమార్ మాట్లాడుతూ.. జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్లు పడుతున్న సమస్యల పట్ల ఇటీవల సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా ఈ విద్యా సంవత్సరం నుండే కన్సాలిడేట్ గా, 12 నెలల వేతనం అమలయ్యేలా చూడాలన్నారు. కళాశాలల్లో పూర్తి సమయం ఉంటూ.. రెగ్యూలర్ లెక్చరర్లతో సమానంగా పనిచేస్తున్నామని తెలిపారు.

పీరియడ్ విధానం వల్ల పూర్తి వేతనం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పీరియడ్ విధానం గెస్ట్ లెక్చరర్ల పాలిట గుదిబండలా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. త్వరలోనే ఈ విషయంపై సమీక్షా సమావేశం నిర్వహించి న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అనంతరం ఇంటర్మీడియట్ కమీషనర్ నవీన్ మిట్టల్‌ను కలిసి ఈ విద్యాసంవత్సరం 6 నెలలకు సంబందించిన బడ్జెట్ వెంటనే విడుదల చేయాలని, కాంట్రాక్ట్ బదిలీలు, ఇతరాత్రా కారణాలతో జరిగిన బదిలీల ద్వారా డిస్టర్బ్ అవుతున్న గెస్ట్ లెక్చరర్లకు మరొకచోట అడ్జస్ట్ మెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం కోశాధికారి కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు ప్రసాద్, ఇస్సాక్, నవీన్ రెడ్డి, రాంచందర్, శ్రీధర్, అంజయ్య, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Next Story