- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పిన సర్కార్ బడ్జెట్ లెక్క.. పది నెలలైనా స్కీమ్‌ల వ్యయం అంతంతే!
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ అంచనాలు లెక్క తప్పాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం లేకపోవడంతో ఖర్చుల్లోనూ కోతపడింది. కంపల్సరీ ఖర్చుల కోసమే ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. సంక్షేమ పథకాల అమలులో అనుకున్న ప్రగతిని సాధించలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కలను విశ్లేషించిన ‘కాగ్’ జనవరి 2023 చివరి నాటికి వసూలైన పన్నులు, చేసిన ఖర్చు తదితరాలపై ప్రొవిజనల్ నివేదికను విడుదల చేసింది. సోషల్ సెక్టార్‌కు కేవలం 46% నిధులను మాత్రమే విడుదల చేసి ఖర్చు చేసినట్లు వెల్లడించింది. పది నెలల్లో కేవలం 62% మాత్రమే ఖర్చు చేసినందున, రానున్న రెండు నెలల్లో మిగిలిన 38% ఖర్చు చేయడం అనుమానంగానే కనిపిస్తున్నది.
సొంత ఆదాయం అంచనాల్లో ప్రభుత్వం 80% మేర లక్ష్యాన్ని సాధించినా, ఇతర రూపాల్లో సమకూర్చుకోవాల్సిన నిధుల్లో మాత్రం వెనకబడింది. కేవలం 62 శాతానికి మాత్రమే పరిమితమైంది. జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు, పాత అప్పులపై వడ్డీలు, కొన్ని అప్పుల చెల్లింపు తదితరాలకు పేమెంట్లు తప్పనిసరి అయ్యాయి. సంక్షేమ పథకాలకు మాత్రం లక్ష్యంలో సగం కూడా ఖర్చు చేయలేకపోయింది.
ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాలకు మాత్రమే క్రమం తప్పకుండా విడుదల చేసి ఖర్చు చేసింది. కానీ స్కాలర్ షిప్పులు, ఫీజు రీయింబర్స్ మెంట్, రుణమాఫీ, దళితబంధు లాంటి పథకాలకు నిధులు లేని కారణంగా విడుదల, ఖర్చు సాధ్యం కాలేదు. ఆదాయం ఉన్నట్లయితే వాటిని బడ్జెట్ అంచనాల ప్రకారం ఖర్చు చేసి ఉండేదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
అంచనాలను చేరుకోని లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం 12 నెలల్లో సొంత పన్నుల ద్వారా రూ. 1.26 లక్షల కోట్లను ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ జనవరి వరకు రూ. 1.02 లక్షల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. జీఎస్టీ, వ్యాట్, ఎక్సయిజ్ తదితర పన్నుల విషయంలో ఆయా విభాగాల అధికారులను పరుగులు పెట్టించి రాష్ట్ర అవసరాలు, అంచనాలకు తగినట్లుగా ఆదాయాన్ని ఆర్జించింది.
కానీ కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో, రిజర్వుబ్యాంకు ద్వారా రుణాల రూపంలో పొందాలనుకున్న ఆదాయానికి మాత్రం భారీగానే గండిపడింది. అన్ని రూపాల్లో రాష్ట్రం పన్నెండు నెలల వ్యవధిలో రూ. 1.93 లక్షల కోట్లను సమీకరించుకోవాలనుకుంటే అందులో జనవరి చివరినాటికి కేవలం రూ. 1.20 లక్షల కోట్లు మాత్రమే సాధ్యమైంది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ. 41 వేల కోట్లు వస్తుందని లెక్కలు వేసుకుంటే పదినెలల్లో అది రూ. 7,876 కోట్లకు మాత్రమే పరిమితమైంది. లక్ష్యంలో 19% మాత్రమే సాధ్యపడింది.
ఖర్చుల్లోనూ సగమే..
సోషల్ సెక్టార్ (వెల్ఫేర్) రంగానికి లక్ష కోట్లను ఖర్చు చేయాలని బడ్జెట్‌లో అంచనా వేసుకుంటే, కేవలం 46,780 కోట్లను మాత్రమే ఖర్చు చేసింది. గతేడాది ఇదే పది నెలల సమయానికి 61% మేర ఖర్చు చేసింది. అన్ని రకాల రెవెన్యూ ఖర్చులు కలుపుకుని రూ. 1.89 లక్షల కోట్లను అంచనా వేసుకుంటే అందులో రూ. 1.24 లక్షల కోట్లు మాత్రమే వ్యయం చేయగలిగింది.
పన్నులు, గ్రాంట్లు, అప్పులు, నాన్-ట్యాక్స్ రెవెన్యూ తదితర అన్ని రకాలుగా మొత్తం రూ. 2.45 లక్షల కోట్ల మేర నిధులు సమకూరుతాయనుకుంటే పది నెలల్లో అది రూ. 1.54 లక్షల కోట్ల (63%)కే పరిమితమైంది. మైనింగ్ లాంటి పన్నేతర (నాన్-ట్యాక్స్) ఆదాయం సుమారు రూ. 25 వేల కోట్లు వస్తుందని లెక్కలు వేసుకుంటే అది రూ. 10 వేల కోట్ల దగ్గరే ఆగిపోయింది.
ఎన్నికల ఏడాదిలో సంక్షేమం ఎలా?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో మూడింట రెండొంతులు మాత్రమే సాధ్యమైంది. ఈ కారణంగా తప్పనిసరి ఖర్చులకు మాత్రమే ప్రభుత్వం పరిమితమైంది. ఇతర ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి వచ్చింది. అందువల్లనే దళితబంధుకు రూ. 17,700 కోట్లు కేటాయించుకున్నా ఒక్క పైసాను విడుదల చేయలేదు.
రుణమాఫీకి కూడా దాదాపు రూ. 4 వేల కోట్లను విడుదల చేయలేదు. ఎన్నికలు లేని సంవత్సరంలోనే వెల్ఫేర్ స్కీమ్‌లకు నిధులు సరిపోయినంతగా లేకపోవడంతో ప్రభుత్వం ఖర్చులపై ఆంక్షలు విధించుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నందున ప్రజలకు వరాలు, హామీలు, తాయిలాలు, సొంత జాగా ఉన్న కుటుంబాలకు ఇల్లు కట్టుకోడానికి ఆర్థిక సాయం తదితరాలకు వెచ్చించాల్సి ఉంటుంది.
కొత్త బడ్జెట్‌లో..
వచ్చే నెల నుంచి అమల్లోకి వచ్చే కొత్త బడ్జెట్‌లో గ్రాంట్ల ద్వారా రూ.41 వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 17 వేల కోట్లు వస్తుందని అంచనా వేసుకున్నది. కానీ ఇందులో ఏపీ నుంచి వస్తుందన్న నమ్మకం ఆర్థిక శాఖ అధికారుల్లోనూ లేదు. కేంద్ర గ్రాంట్లలో గతేడాది లాగానే ఈసారి కూడా రూ. 10 వేల కోట్లు దాటకపోవచ్చనే డౌట్ ఉన్నది. దీంతో ఈ రెండింటిలోనూ దాదాపు రూ. 48 వేల కోట్ల మేర కోత పడొచ్చనే అభిప్రాయం అధికారుల్లోనే వ్యక్తమవుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చి వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత అమలుచేసేలా వాయిదా వేస్తుందేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.