- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు భాగాలుగా మహానగరం.. సర్కార్ స్పెషల్ ప్లాన్
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మహానగరాన్ని మూడు భాగాలుగా విభజించాలని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు వరకూ ఉన్న జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, శివారు గ్రామాలను విలీనం చేసి ఢిల్లీ తరహాలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. దీనికి సంబంధించిన అధ్యయన బాధ్యతలను అడ్మినిస్టేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ)కి అప్పగించింది. మరో వైపు హెచ్ఎండీఏను త్రిపుల్ ఆర్ వరకూ విస్తరించాలని ప్లాన్ చేస్తున్నది. ఈ విషయంపై సీఎం సమక్షంలో పలుమార్లు చర్చలు సైతం జరిపినట్టు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.
625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. 150 డివిజన్లతో ఉన్న జీహెచ్ఎంసీలోకి శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కలుపుకుని మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతున్నదని తెలిసింది. జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, కంటోన్మెంట్ బోర్డు ఏరియా పరిధి, 20 మున్సిపాలిటీలు, మరో 33 గ్రామ పంచాయతీలను కలుపుకుని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించాలని భావిస్తున్నట్లు సమాచారం.
మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల మాదిరిగానే మూడు మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తే పరిపాలన, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పౌర సేవల నిర్వహణ పరంగానూ సులభతరం అవుతుందని సర్కారు భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే విభజన ప్రాసెస్‌ను ఆదాయ వనరులు, శాంతిభద్రతలు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, రాజకీయ అంశాలను పరిగణనలోకి తీసుకుని చేయాలని ప్రభుత్వం డెసిషన్ తీసుకున్నట్టు సమాచారం. దీనికి తోడు మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధి, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధి ఒకేలా ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులకు ఆర్డర్స్ జారీ చేసినట్టు తెలిసింది. అయితే హైడ్రా నేపథ్యంలోనే మూడు మున్సిపల్ కార్పొరేషన్ల అంశం తెరపైకి వచ్చిందని తెలుస్తున్నది. ఒక్కోసారి ఔటర్ రింగ్ రోడ్డు పరిధి దాటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, ఈ క్రమంలో న్యాయ, సాంకేతిక పరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని, మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తే ఈ సమస్య ఉండదని ప్రభుత్వం భావిస్తున్నది.
త్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ..
హెచ్ఎండీఏను త్రిపుల్ ఆర్ వరకు విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగానే నాలుగు జోన్లను ఆరు జోన్లుగా మార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హెచ్ఎండీఏ ఏడు జిల్లాల పరిధిలో 7,200 చదరపు కిలో మీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. త్వరలోనే రిజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) మొత్తం హెచ్ఎండీఏ పరిధిలోకి తెచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గతంలో హెచ్ఎండీఏలో నాలుగు జోన్‌లు ఉండగా, నగరవాసులకు సేవలు అందించే విషయంలో ఇబ్బందులు తలెత్తేవి. తగినంత సిబ్బంది లేకపోవడంతో బిల్డింగ్ పర్మిషన్లు, ఇతర సేవలు అందించడంలో తీవ్ర జాప్యం జరిగేది. శంషాబాద్, ఘట్‌కేసర్ జోన్లను యథాతధంగా ఉంచి, శంకర్‌పల్లి, మేడ్చల్ జోన్లను రెండేసి జోన్లుగా విభజించారు. హెచ్ఎండీఏ జోన్లకు త్రిపుల్ ఆర్ సమీపంలోని ప్రాంతాలను అనుసంధానం చేయనున్నారు.
ఆస్కీకి అధ్యయన బాధ్యతలు
జీహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్డు వరకూ విస్తరించి మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు, హెచ్ఎండీఏ, హైడ్రా భౌగోళిక స్వరూపంపై అధ్యయనం చేసే బాధ్యతను ప్రభుత్వం అడ్మినిస్టేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ)కి అప్పగించింది. దీని పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. అయితే మూడు కార్పొరేషన్లలో ఒక్కో వార్డుకు ఎంత జనాభా ఉండాలి? ఎన్ని సర్కిళ్లు ఉండాలి? సరిహద్దులు ఎలా ఉండాలి? ఉద్యోగుల సంఖ్య, అధికారుల కేటాయింపు, ఆదాయవనరుల లభ్యత వంటి అంశాలపై ఆస్కీ అధ్యయనం చేయనుంది. ఈ నివేదికను సర్కారుకు అందజేసిన తర్వాత సీఎం ఓ నిర్ణయానికి రానున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.