Governor Tamilisai:గవర్నర్ తమిళిసైతో 'ప్రొటోకాల్' రగడకు చెక్.. సర్కార్ మాస్టర్ స్కెచ్

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-13 07:18:08.0  )
Governor Tamilisai:గవర్నర్ తమిళిసైతో ప్రొటోకాల్ రగడకు చెక్.. సర్కార్ మాస్టర్ స్కెచ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్‌తో తలెత్తిన ప్రొటోకాల్ వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు సర్కారు కసరత్తు మొదలు పెట్టింది. పలు ప్రత్యామ్నాయాలపై చర్చ జరుగుతున్నా క్లారిటీ ఇవ్వడానికి అధికారులు జంకుతున్నారు. ప్రగతిభవన్, రాజ్‌భవన్ మధ్య మొదలైన గ్యాప్ మరింతగా పెరిగిందని స్వయంగా గవర్నరే వ్యాఖ్యానించారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయనీ వెల్లడించారు. రెండు వ్యవస్థల మధ్య వివాదం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మెడకు చుట్టుకున్నది. భవిష్యత్తులో ఈ ఉల్లంఘనలు ఉండకుండా అనుసరించాల్సిన విధివిధానాలపై సచివాలయ అధికారుల స్థాయిలో చర్చలు మొదలయ్యాయి. ప్రత్యామ్నాయ ప్రోటోకాల్ విధానం ఉనికిలోకి వచ్చే అవకాశం ఉన్నది. ప్రతి జిల్లాకూ ఒకరిని ప్రొటోకాల్ అధికారిగా నియమించే అవకాశంపైనా చర్చ జరుగుతున్నది. ఈ బాధ్యతలను వారికే అప్పగించడం ద్వారా గవర్నర్, కేంద్ర మంత్రులు, అధికారులు జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు స్వాగతం పలుకుతారు. రాజ్యాంగపరంగా కల్పించాల్సిన ప్రొటోకాల్ బాధ్యతలనూ వారే చూసుకుంటారు. రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఆ హోదా కలిగినవారు జిల్లాల పర్యటన చేసినప్పుడూ ఇదే విధానం అమలవుతుంది. దీని ద్వారా కలెక్టర్, ఎస్పీ అధికారులు వారి రోజువారీ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా చూడొచ్చన్నది అధికారుల అభిప్రాయం. కొత్త విధానం అమలులోకి వస్తే కలెక్టర్, ఎస్పీకి బదులుగా నిర్దిష్ట ప్రొటోకాల్ అధికారే బాధ్యత తీసుకుంటారు.

ముఖ్యమంత్రి తరఫున ప్రతినిధి వ్యవస్థ

గవర్నర్‌తో ఏర్పడిన ఆగాథం నేపథ్యంలో ముఖ్యమంత్రి సైతం రాజ్‌భవన్‌కు వెళ్లే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. గతేడాది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తర్వాత గవర్నర్‌తో ప్రత్యేకంగా సీఎం భేటీ కాలేదు. ఒకటి రెండు సందర్భాల్లో రాష్ట్రపతికి స్వాగతం పలకడం లాంటి కార్యక్రమాల్లో తారసపడినా తూర్పు-పడమరగానే ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం తరఫున ఒక మంత్రిని ప్రతినిధిగా ఎంపిక చేసి వ్యవహారాలను నెట్టుకురావాలన్న ఆలోచన కూడా చర్చల్లో ఉన్నది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడల్లా సీఎంకు బదులుగా హోం మంత్రి మహమూద్ ఆలీ వెళ్తున్నారు. ఇకపై గవర్నర్ దగ్గరకు సైతం సీఎం తరఫున ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి పంపే అవకాశం ఉన్నది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం, మంత్రివర్గంలో మార్పుల సమయాల్లో గవర్నర్‌తో ముఖ్యమంత్రి చర్చించడం ఆనవాయితీ. ఇప్పటివరకూ అదే జరిగింది. కానీ ప్రస్తుత గవర్నర్‌తో గ్యాప్ పెరిగిన నేపథ్యంలో సీఎం ముఖాముఖి సమావేశాలు చోటు చేసుకోలేదు. బడ్జెట్ సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే జరిగిపోయాయి. గతేడాది మే నెలలో మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను తొలగించిన తర్వాత ఏర్పడిన ఖాళీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. మంత్రివర్గంలోకి మరొకరిని తీసుకుంటే గవర్నర్ చేతుల మీదుగానే ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఆ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంటుంది. కానీ గ్యాప్ కారణంగానే భర్తీ చేయకుండా ఏడాదిగా నెట్టుకొస్తున్నట్లు టీఆర్ఎస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రొటోకాల్ ఉల్లంఘనలకు చెక్

ప్రధాని మోడీ ఫిబ్రవరి 5న ముచ్చింతల్‌కు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి హాజరుకాలేదు. సీఎం తరపున మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెళ్లారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి 'ప్రతినిధి' విధానమే అమలయ్యే అవకాశమున్నది. యాదాద్రికి వెళ్లినప్పుడు గవర్నర్‌కు ప్రొటోకాల్ ప్రకారం ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి ఆహ్వానం పలకలేదు. గవర్నర్ కూడా సందర్భానుసారం ఈ అంశాన్ని మీడియాకు వివరిస్తూనే ఉన్నారు. కేంద్ర హోంశాఖకు నివేదికలో వీటిని ప్రస్తావించినట్లు స్వయంగా గవర్నరే ఢిల్లీలో మీడియాకు వివరించారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా భద్రాద్రి వెళ్లినప్పుడు కూడా కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలకలేదు. ఇలా వరుసగా ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. ఇకపై ఇలాంటి ఆరోపణలు రాకుండా ఉండేలా స్పష్టమైన విధాన నిర్ణయాన్ని తీసుకునే చాన్స్ ఉన్నది. ఒకవైపు అఖిల భారత సర్వీసు నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయాలనుకుంటున్నది. రాష్ట్రాల అభిప్రాయాలను కూడా కోరింది. తెలంగాణ ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నది. కానీ రాష్ట్ర స్థాయిలో మాత్రం ప్రొటోకాల్ నిబంధనల్లో మార్పుల దిశగా అధికారుల స్థాయిలో చర్చలు జరుగతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed