డీఎస్సీ నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్.. ఆల్రెడీ విద్యాశాఖకు ఆదేశాలు కూడా..!

by karthikeya |   ( Updated:2024-09-25 03:04:27.0  )
డీఎస్సీ నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్.. ఆల్రెడీ విద్యాశాఖకు ఆదేశాలు కూడా..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మరోసారి డీఎస్సీ నిర్వహించాలని భావిస్తున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వేసే ఆస్కారమున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖకు సర్కార్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఈ నోటిఫికేషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డీఎస్సీ-2023లో భాగంగా ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ఫిబ్రవరిలో మరో నోటిఫికేషన్ కు సర్కార్ సిద్ధమవడం గమనార్హం. కాగా, డీఎస్సీ-2023కి సంబంధించి ప్రిలిమినరీ కీని విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. త్వరలోనే ఫైనల్ కీతో పాటు జీఆర్ఎల్ కూడా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 1:30 టీచర్-స్టూడెంట్ రేషియో ఉండాల్సి ఉండగా, తెలంగాణలో మాత్రం 1:16 నిష్పత్తిలో ఉంది. రేషనలైజేషన్ చేస్తే చాలా పోస్టులు మిగిలిపోతాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీలను భర్తీ చేసేందుకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అనుకున్నట్లుగానే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే.. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రభుత్వ పెద్దలు 5వేల పోస్టులతో డీఎస్సీ వేస్తామంటూ ప్రకటనలు చేశారు. అయితే డీఎస్సీ-2025లో వారు చెప్పినట్లుగా 5 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇస్తారా? లేక ఆ సంఖ్య పెరుగుతుందా? తగ్గుతుందా అనేది తెలియాల్సి ఉంది. తెలంగాణలో అన్ని ప్రైమరీ పాఠశాలల్రలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ బడుల్లో పాఠాలు చెప్పేందుకు టీచర్లను వచ్చే ఏడాది ఇవ్వనున్న నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed