3 నెలలు టైం ఇవ్వండి వీధికుక్కల అంతు తేలుస్తాం: మంత్రి తలసాని

by GSrikanth |   ( Updated:2023-02-23 13:56:25.0  )
3 నెలలు టైం ఇవ్వండి వీధికుక్కల అంతు తేలుస్తాం: మంత్రి తలసాని
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూడు నెలలు టైం ఇవ్వండి.. వీధి కుక్కులు, కోతుల సంగతి తేలుస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్‌లోని మంత్రి కార్యాలయంలో గ్రేటర్‌లో వీధి కుక్కలు, కోతుల బెడద నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ, వెటర్నరీ, హెల్త్ తదితర శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల భద్రత, జీవాల సంరక్షణకు ప్రభుత్వం సమ ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. వీధికుక్కల విషయంలో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం, పురపాలకశాఖ, పశుసంవర్ధకశాఖ, జీహెచ్ఎంసీ ఎల్లప్పుడు ప్రజలకు అండగా ఉంటాయని తెలిపారు.

అంబర్ పేటలో నాలుగేళ్లబాలుడు వీధికుక్కల దాడిలో చనిపోవడం బాధాకరమని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మేయర్ వ్యాఖ్యలను విపక్షాలు వ్యతిరేక కోణంలో చూస్తూ దుష్ర్పచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కుక్కల, కోతుల నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు ఆధునిక టెక్నాలజీ కూడా అందిపుచ్చుకుంటామని స్పష్టం చేశారు. కుక్కులు, కోతుల నివారణకు ఎవరైనా సూచనలు చేస్తే స్వీకరిస్తామని స్పష్టం చేశారు. విమర్శ కోసం సలహాలు ఇస్తే మేము తీసుకోబోమని వెల్లడించారు. కోతులు, కుక్కల బెడద లేకుండా చేయడానికి ప్రత్యేక నిపుణులను రప్పిస్తామన్నారు.

గ్రేటర్‌లో నెల రోజులపాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి కుక్కలకు స్టెరిలైజేషన్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బస్తీలు, కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. కుక్కలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాలకు తరలించి ఆహారం, నీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాంసపు షాపుల నిర్వాహకులు మాంసం వ్యర్ధాలను రోడ్లపై వేస్తున్న కారణంగా మటన్, చికెన్ షాపుల వద్ద కుక్కల సంఖ్య ఎక్కువగా పెరుగుతుండటానికి కారణం అవుతున్నాయని పేర్కొన్నారు. మటన్, చికెన్ షాపుల వద్ద రేపటి నుండి స్పెషల్ డ్రైవ్, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రస్తుతం కుక్కల కోసం 8 ప్రత్యేక టీంలతో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు చెప్పారు. కోతులు, కుక్కల సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రత్యేక యాప్ ను కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, అడిషనల్ కమిషనర్ హెల్త్ శృతి ఓజా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, జోనల్ కమిషనర్‌లు, డిప్యూటీ జోనల్ కమిషనర్‌లు పాల్గొన్నారు.

Advertisement

Next Story