BRS ఫస్ట్ మీటింగ్ అక్కడే.. త్వరలో తేదీ ఖరారు?

by GSrikanth |   ( Updated:2022-12-14 23:31:27.0  )
BRS ఫస్ట్ మీటింగ్ అక్కడే.. త్వరలో తేదీ ఖరారు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలి మీటింగ్‌ను మహారాష్ట్రలో నిర్వహించనున్నారు. అందుకు వేదిక అమరావతి కాబోతుంది. రైతుసభ పేరిట నిర్వహించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర కిసాన్ సంఘ్ నేతలతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. త్వరలోనే సభ తేదీని ఖరారు చేసే అవకాశం ఉందని, సభా వేదికగా కార్యచరణను ప్రకటించేందుకే కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

జాతీయ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లో దూకుడు పెంచే ప్రయత్నం ప్రారంభించారు. ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్.. మొదటి సభను రాంలీల మైదానంలో నిర్వహిస్తారనే ప్రచారం జరిగింది. కానీ అధికారంగా ప్రకటించలేదు. తాజాగా మహారాష్ట్రలో అమరావతి వేదికగా తొలిసభను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దేశంలో వ్యవసాయ రంగంపై 40 శాతం మంది జీవనం సాగిస్తుండటంలో రైతు సమస్యలే ఎజెండాగా ముందుసాగుతానని కేసీఆర్ ప్రకటించారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకు వెళ్తానని పేర్కొనడంతో పాటు రైతుసంఘాల నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. మహారాష్ట్రకు చెందిన కిసాన్ సంఘ్ నేతలతో సైతం చర్చించినట్లు సమాచారం. అయితే రైతుసభ పేరిట అమరావతిలో నిర్వహిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే మరో దఫా కిసాన్ సంఘ్ నేతలతో పాటు పలురైతుసంఘాలతో చర్చించి తేదీని ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

ఏటా దేశంలోని మహారాష్ట్రలో అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్నట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. 2020లో 4,006 ఆత్మహత్యలతో మహారాష్ట్ర తొలిస్థానంలో నిలిచిందని పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి విదర్భ ప్రాంతంలోని అమరావతిలో 331, యావత్‌మల్‌ జిల్లాలో 270 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు. మరాఠ్వాడా ప్రాంతంలో 805 మంది చనిపోయారని సమాచారం. ఇది ఇలా ఉంటే మహారాష్ట్రలో 2019లో 3,927, 2020లో 2,547, 2021లో 2498 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు నేషనల్ క్రైం బ్యూరో పేర్కొంది. ఏ నివేదికలు అయినా రైతు ఆత్మహత్యల్లో మాత్రం మహారాష్ట్ర టాప్ లో ఉంది. దీంతో మహారాష్ట్ర వేదికగా బీఆర్ఎస్ పార్టీ రైతుసభను నిర్వహించాలని భావిస్తుంది. రైతులకు భరోసాను అమరావతి నుంచే ప్రారంభించేందుకు కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు. చండిఘడ్ లో రైతు చట్టాల రద్దు పోరులో మరణించిన 693 (పంజాబ్ – 543, హర్యానా – 150) రైతు కుటుంబాలకు రూ.3లక్షల చొప్పున కేసీఆర్ ఆర్థిక సహాయం చేసిన విషయం తెలిసిందే.

మహారాష్ట్రపై కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఒక వైపు రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉండటం, మరోవైపు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఉండటంతో అక్కడ పాగా వేసేందుకు కసరత్తు ప్రారంభించారు. శివసేన అధినేత ఉద్దక్ ఠాక్రే ప్రభుత్వానికి బీజేపీ పడగొట్టడంతో శివసేన గుర్రుగా ఉంది. ఇదే అదునుగా ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. బీజేపీకి చెక్ పెట్టే ఆలోచనతోనే ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే రైతుసభతో ఒకవేదికపైకి తెచ్చి బీజేపీని ఎదుర్కొనేందుకు పావులు కదుపుతారని తెలిసింది. అయితే ఇదే వేదికపై తెలంగాణలో రైతుసంక్షేమం కోసం అమలు చేస్తున్న 24 గంటల కరెంటు, రైతు బీమా, రైతుబంధు, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇలా సభలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సభకు శివసేన, ఎన్సీపీలను ఆహ్వానిస్తారా? లేకుంటే రైతుసంఘాలతోనే కేసీఆర్ ముందుకు వెళ్లారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story

Most Viewed