బిగ్ న్యూస్: మరో కీలక హామీకి KCR ఎగనామం.. రోజు రోజుకు రైతుల్లో పెరుగుతోన్న ఆందోళన..!

by Satheesh |
బిగ్ న్యూస్: మరో కీలక హామీకి KCR ఎగనామం.. రోజు రోజుకు రైతుల్లో పెరుగుతోన్న ఆందోళన..!
X

రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని బీఆర్ఎస్ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక నాలుగేండ్లలో నాలుగు విడతల్లో దానిని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ నాలుగున్నరేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ కేవలం ఐదు శాతం మాత్రమే అమలు చేశారు. బ్యాంకర్ల లెక్కల ప్రకారం రూ. 27,487.36 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా ప్రభుత్వం 1,207.37 కోట్లు మాత్రమే మాఫీ చేసింది. ఎన్నికలకు మరో నాలుగైదు నెలలు మాత్రమే టైం ఉండటంతో మాఫీ పూర్తిస్థాయిలో అమలవుతుందా? లేదంటే ప్రభుత్వం ఎగనామం పెడుతుందా? అన్న ఆందోళన రైతుల్లో మొదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో : రూ.లక్ష వరకు రైతు రుణాన్ని నాలుగేండ్లలో నాలుగు విడతలుగా మాఫీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటించారు. అది కేవలం మాటలకే పరిమితమైంది. నాలుగున్నరేండ్లు దాటినా రెండు విడతల్లో రూ.35 వేల వరకు రుణమున్న వారికి మాత్రమే ప్రభుత్వం మాఫీ చేసింది. మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

దీంతో రుణమాఫీ పూర్తి స్థాయిలో ఎప్పుడు అమలు అవుతుందని రైతుల్లో అనుమానం, చర్చలు మొదలయ్యాయి. బ్యాంకు ఖాతాల్లో మాఫీ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో అని ఎదురుచూస్తున్నారు. నాలుగేండ్లుగా బ్యాంకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు.. రుణమాఫీ హామీ అమలుపైనే ఆశలు పెట్టుకున్నారు.

బీసీ సామాజిక వర్గానికి చెందిన కులవృత్తిదారులకు తలా రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం.. రైతు రుణమాఫీపై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ప్రశ్న రైతుల నుంచి వ్యక్తమవుతున్నది. రైతుబంధు, రైతుబీమా మినహా ఇతర వ్యవసాయ స్కీములన్నింటినీ ఎత్తివేసిన అధికార పార్టీపైన, స్థానిక ఎమ్మెల్యేలపైనా అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

2018 ఎన్నికల సమయంలో రెండు లక్షల వరకు మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చినా ఓట్లు వేయలేదని, రూ.లక్ష మాఫీ చేస్తామని ప్రకటించిన కేసీఆర్ మాటకే విలువ ఇచ్చామని గుర్తుచేస్తున్నారు. ఫస్ట్ టర్ములో ఇచ్చిన హామీని అమలుచేసిన కేసీఆర్.. రెండోసారి మాత్రం అటకెక్కించడాన్ని తప్పుపడుతున్నారు.

అమలైంది ఐదు శాతమే:

రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామంటూ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఫిబ్రవరి 22న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. బడ్జెట్‌లో రూ.6,000 కోట్లను కేటాయిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.

రుణమాఫీకి మొత్తం రూ.21,556 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రెండు దశల్లో కేవలం ఐదు శాతమే (రూ.1,207 కోట్లు) రైతుల ఖాతాల్లో జమ చేసింది. కానీ బ్యాంకుల లెక్కల ప్రకారం రుణమాఫీ స్కీమ్‌ను సంపూర్ణంగా అమలు చేయాలంటే రూ.27,487.36 కోట్లు అవసరమవుతుందని తేలింది.

ఈ లెక్కలను రాష్ట్ర వ్యవసాయ శాఖకు పంపారు. మొత్తం 42.22 లక్షల మందికి రుణమాఫీ డబ్బులు జమ చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇప్పటివరకు రెండు దశల్లో కేవలం 5.42 లక్షల మందికే లబ్ధి చేకూరింది. ఇంకా 36.80 లక్షల మంది రైతులకు మాఫీ కావాల్సి ఉన్నది. ఇందుకోసం సుమారు రూ.26,279.99 కోట్లు అవసరం. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకూ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయలేదు.

కొనుగోలు కేంద్రాల దగ్గర తడిచిపోయిన ధాన్యానికీ ప్రభుత్వం నుంచి సాయం అందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న నాలుగైదు నెలల్లో రుణమాఫీ పూర్తిగా అమలు చేయడంపై రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రుణాలు మాఫీ కాకపోవడంతో వాటిపై వడ్డీ విషయంలో రైతులు చిక్కులు ఎదుర్కొంటున్నారు. నాలుగేండ్లుగా పేరుకుపోయిన వడ్డీల సంగతేంటనే ఆవేదన వారిని వెంటాడుతున్నది. మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఈసారి హామీ ఇచ్చినా అది అమలు కావడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది?

2021 ఆగస్టు 1వ తేదీన ప్రగతి‌భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన కేబినెట్ సమావేశంలోనే రూ.50 వేల వరకు రుణాలున్న రైతులకు మాఫీ చేయడంపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు మూడేండ్లు కావస్తున్నా కేవలం రూ.25,001-35,000 మధ్య రుణాలున్న రైతులకే మాఫీ అయింది. ఇంకా రూ.35,001-లక్ష మధ్య రుణాలున్న రైతుల మాఫీ పెండింగ్‌లోనే ఉన్నది.

ఇందుకోసం ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.20,349.27 కోట్ల మేర నిధులు విడుదల కావాల్సి ఉన్నది. స్టేట్ లెవల్ బ్యాంకర్ల కమిటీ లెక్కల ప్రకారం రూ.26,279.99 కోట్లు రిలీజ్ కావాల్సి ఉన్నది. రానున్న నాలుగైదు నెలల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

2018 రుణమాఫీ అమలు ఇలా

-----------------

అవసరమైన నిధులు : రూ. 27,487.36 కోట్లు

ప్రభుత్వం నుంచి జమ అయింది : రూ. 1,207.37 కోట్లు

ఇంకా అందాల్సింది

బ్యాంకర్ల కమిటీ ప్రకారం : రూ. 26,279.99 కోట్లు

ప్రభుత్వ లెక్కల ప్రకారం : రూ. 20,349.27 కోట్లు

మొత్తం లబ్ధిదారుల సంఖ్య : 42,22,928

రెండు విడతల్లో లబ్ధి పొందినవారు : 5,42,609 మంది

ఇంకా లబ్ధి పొందాల్సిన రైతులు : 36,80,319 మంది

మాఫీ అయిన రుణాలు : రూ. 35,000 లిమిట్ వరకు

Advertisement

Next Story

Most Viewed