కాంగ్రెస్‌లో కొత్త కమిటీలు.. గ్రౌండ్ లెవల్లో కీలకంగా పనిచేసినోళ్లకు ఛాన్స్

by Gantepaka Srikanth |
కాంగ్రెస్‌లో కొత్త కమిటీలు.. గ్రౌండ్ లెవల్లో కీలకంగా పనిచేసినోళ్లకు ఛాన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో కొత్త కమిటీల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. వైస్ ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఆఫీస్ బేరర్లు, ఆర్గనైజేషన్ మెంబర్లు, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ తదితర పదవులను భర్తీ చేయనున్నారు. స్టేట్ ఆఫీస్ గాంధీభవన్ నుంచి జిల్లా స్థాయి లో కమిటిలన్నీ ఏర్పాటు కానున్నాయి. కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో పార్టీకి సంబంధించిన పదవులను నింపనున్నారు. త్వరలోనే అప్లికేషన్ల స్వీకరణ మొదలు కానునున్నది. అయితే పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినోళ్లకే పదవులు కేటాయిస్తామని ముఖ్య లీడర్లు చెప్తున్నారు. పైగా ప్రస్తుతం పార్టీ పవర్ లో ఉన్నందున ప్రభుత్వంతో సంపూర్ణమైన సమన్వయంతో పనిచేసే వ్యక్తులనే ఎంపిక చేయనున్నట్లు గాంధీభవన్ ముఖ్య నేతలు వివరిస్తున్నారు. ఇన్నాళ్లు పీసీసీ కార్యవర్గంలో వివిధ హోదాల్లో పనిచేసిన కొందరు నేతలను కొత్త టీమ్ లోనూ తీసుకునే అవకాశం ఉన్నది. కొందరికి పదవి అప్ గ్రేడ్ చేస్తుండగా, మరి కొందరికి ఇంత కాలం పనిచేసిన పోస్టునే మళ్లీ ఇచ్చే చాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇలా కాంగ్రెస్ కొత్త కార్యవర్గం లో దాదాపు 200 మంది నేతలు వివిధ పోస్టుల్లో పనిచేయనున్నారు.

లిస్టు సేకరించి ఏఐసీసీకి!

రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పవర్‌లో ఉన్నది. దీంతో ఆటోమెటిక్‌‌గా పార్టీ పదవులకు డిమాండ్ పెరుగుతుంది. పార్టీ, ప్రభుత్వం పెద్దల నుంచి ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. తమ అనుచరులకు పదవులు ఇప్పించే విషయంలో పీసీసీపై ఒత్తిడి ఉంటుంది. స్టేట్ నుంచి జిల్లా పోస్టుల వరకు ఇదే పరిస్థితి నెలకొంటుంది. దీంతో పదవుల ఎంపిక పర్ ఫెక్ట్ గా నిర్వహించాలని పార్టీ ప్లాన్ చేస్తున్నది. దీనిలో భాగంగానే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల టికెట్లకు దరఖాస్తు చేసినట్టే, పార్టీ పదవుల కోసమూ అప్లికేషన్ ప్రాసెస్ ను పెట్టనున్నారు. వచ్చిన జాబితాను ఏఐసీసీకి పంపించి ఫైనల్ జాబితాను సెలెక్ట్ చేసే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు లీకులు ఇచ్చాయి. దీని వలన పార్టీలోకి కీలక నేతలు, ప్రభుత్వంలోని మంత్రులు, ఇతర ముఖ్య లీడర్ల మధ్య భేదాభిప్రాయాలు రావని టీపీసీసీ ఆలోచిస్తున్నది.

అవసరమైతే పొస్టులు పెంపు

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏఐసీసీ నుంచి కేవలం ఐదుగురు వైస్ ప్రెసిడెంట్లు, పది మంది సీనియర్ వైస్ ప్రెసిడెంట్లతో మాత్రమే ఫస్ట్ టీమ్ ను ప్రకటించారు. ఆ తర్వాత పార్టీ రిక్వెస్ట్ మేరకు 30 మంది వైస్ ప్రెసిడెంట్లు, 56 మంది జనరల్ సెక్రటరీలను ఎంపిక చేశారు. దీనికి ఏఐసీసీ కూడా అప్రూవ్ ఇచ్చింది. పార్టీని పవర్ లోకి తీసుకువచ్చేందుకు జనాల్లోకి విస్తృతంగా పనిచేయాల్సి ఉంటుందని, ఇందుకోసం జంబో టీమ్ అవసరం అని గత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అనుమతి కోరారు. పరిశీలించిన పార్టీ ఇందుకోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీపీసీసీ నుంచి ఓ జాబితా పంపగా, అన్ని పేర్లకూ అనుమతి ఇస్తూ ఏఐసీసీ ప్రకటన రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు కూడా అవసరమైతే పోస్టుల సంఖ్యను పెంచే అవకాశం ఉన్నది. టీపీసీసీ కార్యవర్గంతోపాటు డీసీసీలు, స్పోక్స్ పర్సన్స్, మీడియా కమిటీ వంటి పదవులనూ ప్రకటించనున్నారు.

కొత్త చీఫ్‌కు ఛాలెంజే!

ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న టైమ్‌లో కమిటీలు ఏర్పాటు విషయంలో పార్టీలో కాస్త విభేదాలు తలెత్తాయి. నేతల మధ్య అభిప్రాయ భేదాలు, సమన్వయ లోపం కారణంతో సమస్యలు ఏర్పడ్డాయి. దీనిలో భాగంగానే గతంలో పార్టీ కార్యదర్శి పోస్టులను హోల్డ్ లో పెట్టారు. ఇప్పటికీ ఆ పోస్టులు భర్తీ కాలేదు. అయితే గతంలో పార్టీ పవర్‌లో లేదు. ఈ సారి అధికారంలో ఉండటంతో కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎలా సమన్వయం చేస్తారోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొన్నది. ఎవరిని అసంతృప్తికి గురిచేసినా, పార్టీలో డ్యామేజ్, మిస్ కమ్యూనికేషన్ వంటివి జరుగుతాయని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పార్టీకి కీలకమైన కమిటీల ఎంపిక కొత్త పీసీసీకి చాలెంజ్ గా మారనున్నది. అయితే ఆయన క్షేత్రస్థాయి నుంచి పార్టీ లో వివిధ పదవుల్లో వర్క్ చేసిన అనుభవం కొత్త కమిటీల ఏర్పాటులో సంపూర్ణంగా పనిచేస్తుందని ఓ నేత ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed