- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పైగా’ భూములు ప్రభుత్వానివే.. : హై కోర్టు
‘పైగా’ భూములు ప్రభుత్వానివేనని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం సర్వే నం.46లోని 84.30 ఎకరాల భూమి తమదేనంటూ కొందరు వ్యక్తులు చేసిన అప్పీలును డిస్మిస్ చేసింది. హైకోర్టు జస్టిస్ ఎం. లక్ష్మణ్ శుక్రవారం తీర్పు వెలువరించినట్లు రాజేంద్రనగర్ ఆర్డీఓ కే చంద్రకళ తెలిపారు. రూ. 5వేల కోట్ల భూమి సర్కారుదేనని కోర్టులు స్పష్టం చేస్తున్నా.. బడాబాబులు పట్టువదలకుండా కేసులపై కేసులు వేస్తుండడం విస్మయానికి గురి చేస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నడిబొడ్డున రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం సర్వే నం.46లోని 84.30 ఎకరాల భూమిపై ఎన్నో ఏళ్లుగా వివాదాల కొలిమి చల్లారడం లేదు. ఖాళీగా కనిపించే ఈ రూ. 5వేల కోట్ల విలువైన ఈ భూమిని చేజిక్కించుకునేందుకు బడాబాబులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కేసుల మీద కేసులు వేస్తూ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లోనూ ఆ భూమి సర్కారుదేనంటూ హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులు వెలువరించినా, అప్పీళ్లకు వెళ్తూ భంగపడుతూనే ఉన్నారు.
మరోసారి ‘డిస్మిస్’
రాయదుర్గం భూములు ప్రభుత్వానివేనని శుక్రవారం హైకోర్టు జస్టిస్ ఎం. లక్ష్మణ్ తీర్పునిచ్చారు. తమకు హక్కులు ఉన్నాయంటూ దాఖలు చేసిన రెండో అప్పీల్ నం.1118/1999 ను డిస్మిస్ చేశారు. ఓఎస్ నం.74/1978, అప్పీల్ సూట్ నం.62/1997, 22/1999 ఆర్డర్లను ధృవీకరిస్తూ ఈ భూములు ప్రభుత్వానివేనని స్పష్టం చేసినట్లు రాజేంద్రనగర్ ఆర్డీఓ కే చంద్రకళ ‘దిశ’కు తెలిపారు. ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ సీఎస్ విద్యానాథన్, హైకోర్టు సీనియర్ కౌన్సిల్ హరీందర్ పర్షద్, పాల్వాయి వెంకట్ రెడ్డిలు వాదనలు వినిపించినట్లు చెప్పారు.
కుట్రలకు తెర!
ఆ భూమిపై పెత్తనం చెలాయించేందుకు కొన్ని బడా నిర్మాణ, రియల్ ఎస్టేట్ సంస్థలు తెర వెనక పావులు కదుపుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మూడు దశాబ్దాలుగా ఆ భూములను ప్రజాప్రయోజనాల కోసం వినియోగించకుండా అడ్డుకుంటున్నారు. పలు కోర్టుల్లో కేసులు నడుస్తుండగానే మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించి వారికి అనుకూలంగా తీర్పు పొందారు.
ఆ భూమి ప్రైవేటు వ్యక్తులదేనంటూ హెచ్ఆర్సీ తీర్పునిచ్చింది. నిజాం జారీ చేసినట్లుగా చెప్తున్న ఫర్మానా కరెక్టేనని, ఆ భూమిపై హక్కులు వారికే చెందుతాయంటూ పేర్కొన్నది. కానీ ఈ కేసుపై విచారణ గురించి, తీర్పు వెలువడే సమాచారం రెవెన్యూ అధికారులకు అందకుండా జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ అంశంపైనే హైకోర్టు స్పష్టతనిచ్చింది. కానీ 84.30 ఎకరాల ప్రభుత్వ భూమిపై హక్కులు పొందేందుకు ప్రైవేటు శక్తులు చేసిన కుట్రలు పటాపంచలయ్యాయి. ఆ తీర్పుపై హైకోర్టు సీరియస్ అయ్యింది. తాజాగా మరోసారి హైకోర్టులో వారి కుట్రలకు తెరపడింది.
వివాదాలు సృష్టించి..
రాయదుర్గం సర్వే నం.46లో 84.30 ఎకరాల భూమి ప్రభుత్వానిదే. సేత్వార్, 1954–55 ఖాస్రా పహాణీ మొదలుకొని ఇప్పటివరకు అది సర్కారుకు చెందిన భూమే. కానీ 55 ఏండ్లుగా దానిపై వివాదాలు సృష్టించారు. ఆ భూమి తనదేనని, పట్టా మంజూరు చేయాలంటూ వలీఉల్లా హుస్సేన్ అనే వ్యక్తి అప్పటి హైదరాబాద్ పశ్చిమ ఆర్డీఓకు దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి ఆర్డీవో పట్టాను మంజూరు చేశారు. ఆ తర్వాత ఇది వివాదాస్పదం కావడంతో జాయింట్ కలెక్టర్ ‘బోర్డు ఆఫ్ రెవెన్యూ‘ ప్రకారం నిబంధనలకు సరిపోదనే కారణంతో 1968 మార్చి 12న రద్దు చేశారు.
పట్టాదారు అని ధ్రువీకరించే ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వలీ ఉల్లాహ్ హుస్సేనీ ‘బోర్డు ఆఫ్ రెవెన్యూ’ కు అప్పీలు చేశారు. జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు సరైనవే అంటూ 1971 ఫిబ్రవరి 11న బోర్డు సమర్థించింది. ఇంతలోనే ఎం.రాములు, ఇతరులు ఈ భూమిని కొనుగోలు చేసినట్లు చెప్తూ వలీఉల్లాహ్ హుస్సేనీ ఫైల్ చేసిన ఓఎస్ 47/1985, 74/1978లపై అప్పీలు చేశారు. దీన్ని విచారించిన అప్పటి జిల్లా ప్రిన్సిపల్ కోర్టు 1997లో కేసును డిస్మిస్ చేసింది. ఆ తర్వాత హైకోర్టులో రిట్ పిటిషన్ (నెం. 1108/2009, 581/2009, 1729/2009)లు దాఖలయ్యాయి.
వాటిపై చాలా కాలం వాదనలు కూడా జరిగాయి. కోర్టు ఆఫ్ వార్డ్ నుంచి విడుదల చేయాలంటూ వలీఉల్లాహ్ హుస్సేనీ కొడుకు అజీజుల్లాహ్ హుస్సేనీ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ తతంగం నడుస్తుండగానే హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదంటూ లింగమయ్య అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ ను దాఖలు చేశారు. దీన్ని విచారించిన సింగిల్ జడ్జి బెంచ్ మ్యుటేషన్ చేయాలంటూ శేరిలింగంపల్లి తహశీల్దార్ ని కోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ తహశీల్దార్ హైకోర్టులో అప్పీలు(నం.33/2017) చేసుకున్నారు. ఇలా కేసుల పరంపర కొనసాగుతూనే ఉన్నది. లేని హక్కులను పొందేందుకు ఆనాటి నుంచి కుట్రలు సాగిస్తున్నారని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు.
తెర వెనుక పెద్దోళ్లు
రాయదుర్గంలోని 84.30 ఎకరాలపై కేసులు పెండింగులో ఉండగానే ఎం/ఎస్ లార్వెన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. షెడ్యూల్ ప్రాపర్టీని డెవలప్ మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు పేర్కొంది. దీంతో మెరిట్స్, ఫ్యాక్ట్స్ ను పరిగణనలోకి తీసుకోకుండానే స్థలం ప్రైవేటుదంటూ ఆర్డర్ జారీ చేసింది. ఈ మేరకు వారికి స్థలాన్ని స్వాధీనం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ ను ఆదేశించింది.
దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం డబ్ల్యూపీ 28023/2021 ఫైల్ చేసింది. దాంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హెచ్ఆర్సీ ఆర్డర్స్(2704/2020)ని డిస్పోజ్ చేసింది. రకరకాల కేసులతో వివాదాల్లో నలుగుతున్న భూమినే డెవలప్ మెంట్‌కి తీసుకోవాలన్న ఆలోచన రావడమే పెద్ద కుట్రగా తెలుస్తున్నది. ఎవరైనా వివాదాలు ఉన్నాయంటే ఎందుకొచ్చిన చిక్కు.. కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారంటూ తప్పుకుంటారు. కానీ కొన్ని కంపెనీలు మాత్రం అలాంటి భూములపైనే ఫోకస్ పెట్టడం, కేసులను నడిపిస్తుండడం విస్మయానికి గురి చేస్తున్నది.