జూనియర్ డాక్టర్ల స్ట్రైక్‌కు ముహూర్తం ఖరారు

by GSrikanth |
జూనియర్ డాక్టర్ల స్ట్రైక్‌కు ముహూర్తం ఖరారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 22 నుంచి జూనియర్ డాక్టర్లు స్ట్రైక్ చేయనున్నారు. స్టైఫండ్ రావట్లేదని ఆందోళనలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటీసును సోమవారం జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ డీఎంఈ వాణికి అందజేశారు. ఈ సందర్భంగా జూడా ప్రెసిసెంట్ సీహెచ్ జీ హర్ష సాయి మాట్లాడుతూ...రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ స్టైఫండ్ సమస్య నెలకొన్నదన్నారు. రెండు నెలల నుంచి అందలేదన్నారు. ప్రతి నెల ఇదే సమస్య వస్తుందన్నారు. ప్రతి నెల 15 వరకు స్టైఫండ్ ను అందజేస్తామని హెల్త్ మినిస్టర్ హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. టోకెన్ నంబర్ తీసుకొని సెక్రటేరియట్, డీఎంఈ ఆఫీస్ ల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు.

గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తామని సర్కార్ ప్రకటించినా, ఎలా అమలు చేస్తారు? అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదన్నారు. ఏపీలో జీవో 36 ద్వారా కేవలం రెండు మూడు రోజుల్లోనే స్టైఫండ్ కు నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. ఇక్కడ ఆ పరిస్థితి లేదన్నారు. దీంతోనే సమ్మె చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిరసనల్లో పీజీలు, ఇంటర్నిష్ స్టూడెంట్లు పాల్గొంటారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లో విధులు బహిష్కరించనున్నట్లు వెల్లడించారు. ఇక ఉస్మానియాకు కొత్త బిల్డింగ్ , పెరిగిన విద్యార్ధులకు అనుగుణంగా యూజీ, పీజీ హాస్టళ్ల సౌకర్యాలను పెంచడం, గవర్నమెంట్ ఆసుపత్రులలో ట్రాన్స్ పోర్ట్ వంటి సౌకర్యాలు కూడా కల్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

Advertisement

Next Story