- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రం బిగ్ స్కెచ్.. ఆ నిర్ణయంతో కేసీఆర్ కు షాక్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విమోచన దినోత్సవ ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నది. కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని తొలిసారిగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం టాక్ ఆఫ్ ద స్టేట్‌గా మారింది. ఈనెల 17న ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించింది. పలువురు కేంద్ర మంత్రులకు సూచనలు ఇచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం నగరంలో శుక్రవారం పార్టీ రాష్ట్ర నేతలతో సమీక్ష నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్స్ వేదికగా నిర్వహించే ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కర్నాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నట్లు రాష్ట్ర పార్టీ వర్గాలు ధృవీకరించాయి. సాయుధ దళాల బలగాల కవాతుతో పాటు భారీ బహిరంగ సభను కూడా అక్కడే నిర్వహించాలని బీజేపీ స్టేట్ యూనిట్ ప్లాన్ చేస్తున్నది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల తరహాలోనే ఈ వేడుకను కూడా గ్రాండ్‌గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఆర్ఎస్ఎస్ కూడా ఇదే తరహా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. నిజాం పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగి 75 ఏండ్లయిన సందర్భంగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 'నైజాం విముక్త స్వతంత్ర్య అమృతోత్సవాల' పేరుతో ఈ వేడుకలు జరగనున్నాయి. మండల స్థాయి నుంచి పలు కార్యక్రమాలకు షెడ్యూలును ఇప్పటికే ఖరారు చేసింది.
కేసీఆర్‌కు చెక్ పెట్టేలా..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఉద్యమ సమయంలో హామీ ఇచ్చిన కేసీఆర్.. ఇప్పటి వరకూ దానిని జరపలేదని బీజేపీ నేతలు పలుమార్లు విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి రావాలని వ్యూహం రచించిన బీజేపీ.. సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహించి ప్రజలకు చేరువ కావాలనుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా విమోచన దినోత్సవ వేడుకల నిర్వహణ ఇందులో భాగమే. తెలంగాణలో ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే అయినా స్టీరింగ్ మాత్రం మజ్లిస్ చేతిలో ఉన్నదంటూ కేంద్ర హోం మంత్రే పలుమార్లు వ్యాఖ్యానించారు. మజ్లిస్ పార్టీకి భయపడే విమోచనా దినోత్సవాన్ని కేసీఆర్ జరపడంలేదని కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టేలా కేంద్రం అధికారికంగా విమోచనా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను తొలిసారిగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ప్రతి ఏటా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూనే ఉన్నది. ఈసారి మాత్రం రాష్ట్ర వేడుకలకు పోటీగా కేంద్ర ప్రభుత్వం కూడా అఫీషియల్‌గా నిర్వహించింది. తెలంగాణ విషయంలో ఏ అవకాశాన్నీ వదులుకోరాదన్న రీతిలో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. దూకుడుగా నిర్ణయాలను తీసుకుంటున్నది.
ప్రతి ఏడాదీ హాజరవుతున్న అమిత్ షా
ప్రతి ఏడాదీ సెప్టెంబరు 17న తెలంగాణలో బీజేపీ నిర్వహించే విమోచన దినోత్సవ వేడుకలకు అమిత్ షా హాజరవుతున్నారు. గతేడాది నిర్మల్‌లో జరిగిన కార్యక్రమానికీ హాజరయ్యారు. ఈసారి కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా జరిగే వేడుకలకు హోంమంత్రి హోదాలో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. హైదరాబాద్ స్టేట్ పాలనలో కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నందున ఈసారి విమోచన దినోత్సవ వేడుకలకు కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన విజయ సంకల్ప సభ గ్రాండ్ సక్సెస్ అయిందన్న భావనతో విమోచన దినోత్సవ వేడుకలకు కూడా దాన్నే ఎంపిక చేసింది. రాష్ట్ర పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. సెప్టెంబరు 17న విమోచన దినోత్సవ వేడుకలు ఉదయం 7 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో ప్రారంభం కానున్నాయి. అధికారికంగా సాయుధ బలగాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నది. ఈ వేడుకలు నిర్వహణకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏర్పాట్లను ముమ్మరం చేయాలని భావిస్తున్నది. సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగానే తెలంగాణకు విముక్తి లభించిందనే వాణిని అమిత్ షా ప్రధానంగా ఈ సభలో ప్రస్తావించనున్నారు. కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు పార్టీ శ్రేణులను విస్తృతంగా సమీకరించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రయత్నాలను ప్రారంభించారు.
ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏడాది పాటు...
నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగి 75 ఏండ్లయిన సందర్భంగా 'నైజాం విముక్త స్వతంత్ర్య అమృతోత్సవాలు' పేరుతో ఏడాది పాటు వేడుకలు నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ సైతం సిద్ధమవుతున్నది. ఆ సంస్థ పరివార క్షేత్రాలకు ఇప్పటికే యాక్షన్ ప్లాన్‌ను రెడీ చేసింది. వివిధ క్షేత్రాల ముఖ్యలతో ఆర్ఎస్ఎస్ ప్రముఖులు సమావేశాలు నిర్వహించారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులు, నిజాం వ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్నవారి కుటుంబ సభ్యులతో రాష్ట్ర, జిల్లా, మండలాల వారీగా కమిటీలు వేయాలనుకుంటున్నది. ఈ ప్రక్రియను ఈనెల 15 లోపు పూర్తిచేయనున్నది. ఒక్కో జిల్లాకు ఒక్కో ముఖ్య ఆర్ఎస్ఎస్ కార్యకర్తకు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించనున్నది. విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 17న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆర్ఎస్ఎస్ యూనిట్లు ఉన్నచోట్ల జాతీయ జెండాలను ఆవిష్కరించే షెడ్యూల్ రూపొందింది. ఏడాది పాటు ఈ వేడుకలను నిర్వహించాలనుకుంటున్నందున నవంబరులో యువ సమ్మేళనాలు, డిసెంబరులో జన జాగరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేయనున్నది. ఫిబ్రవరిలో పలు రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశాలు నిర్వహించనున్నది. పూర్తిస్థాయి కమిటీలు ఏర్పాటైన తర్వాత మిగిలిన కార్యక్రమాల రూపకల్పన జరగనున్నది. నిజాం అకృత్యాలను హైలైట్ చేస్తూ జిల్లాల వారీగా చారిత్రక ఘటనలను సేకరించనున్నది. దానికి అనుగుణంగా సాంస్కృతిక కార్యక్రమాలు, సమ్మేళనాలను నిర్వహించాలని భావిస్తున్నది. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాద్ మాత్రం ప్రత్యేక దేశంగా ఉన్నదని, అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ ఒత్తిడితో దాదాపు 13 నెలల తర్వాత 17 సెప్టెంబర్ 1948న హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమైందని ఇప్పటికే పలు సందర్భాల్లో అటు ఆర్ఎస్ఎస్, ఇటు బీజేపీ పేర్కొన్నాయి. తెలంగాణకు విమోచనకు ప్రధాన కారణం సర్దార్ పటేల్ అనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనుకుంటున్నాయి ఈ రెండూ. ఇదిలా ఉండగా ఈ ఉత్సవాలకు సంబంధించి ఉత్సవ సమితి గౌరవాధ్యక్షుడు జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి, ఉత్సవ సమితి అధ్యక్షుడు వంశతిలక్ దీనికి సంబంధించిన కార్యాచరణను శనివారం ప్రకటించనున్నారు.
ప్రజా సంగ్రామ యాత్ర నుంచి 'బండి'
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడుత ప్రజా సంగ్రామ యాత్రను ఈనెల 12 నుంచి నిర్వహించనున్నారు. సెప్టెంబరు 17న విమోచన దినోత్సవం ఉన్న నేపథ్యంలో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి పరేడ్ గ్రౌండ్ కార్యక్రమంలో పాల్గొంటారు. విమోచన వేడుకల నిర్వహణకు ఇబ్బందుల్లేకుండా పాదయాత్ర రూట్‌ను ఖరారు చేసే చర్చలు జరుగుతున్నాయి. మల్కాజ్‌గిరి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 17 నాటికి కంటోన్మెంట్ పరిసరాల్లోనే ఉంటుంది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ శనివారం తెలంగాణకు రానున్నారు. ఉదయం హుజూరాబాద్ వెళ్లి ఈటలను పరామర్శించనున్నారు. అనంతరం సాయంత్రం ఈ అంశంపై పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించి పాదయాత్ర, విమోచన వేడుకల నిర్వహణ, బహిరంగ సభపై చర్చించనున్నారు.
Also Read : కేసీఆర్ తెలంగాణలో తిరగలేకే పక్క రాష్ట్రాలకెళ్లి పరువు తీస్తుండు : కొండా