3 వారాలైనా వరద నష్టం ఇవ్వని కేంద్రం.. రిపోర్టుల స్టడీ పేరుతో కాలయాపన

by karthikeya |
3 వారాలైనా వరద నష్టం ఇవ్వని కేంద్రం.. రిపోర్టుల స్టడీ పేరుతో కాలయాపన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వరదలు తగ్గిపోయి దాదాపు మూడు వారాలవుతున్నది. కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి 20 రోజులు దాటింది. అటు కేంద్ర బృందం సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసి కూడా రెండు వారాలు దాటింది. కానీ.. ఇప్పటివరకూ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఇప్పటికీ తాత్కాలిక సాయంగానీ, పూర్తిసాయం గానీ రాష్ట్రానికి అందలేదు. కేంద్రం నుంచి వచ్చే సాయం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. సాధారణంగా సాయం అందించడానికి నెల రోజులకు పైగానే సమయం పడుతుందని, ప్రస్తుతం సెంట్రల్ టీమ్ ఇచ్చిన రిపోర్టుపై పరిశీలన జరుగుతున్నదని పేర్కొన్నాయి. ఇంకో రెండు మూడు వారాలు సమయం పట్టవచ్చని తెలిపాయి.

సాయం కోసం రేవంత్ రిక్వెస్ట్

కేంద్ర మంత్రి చౌహాన్‌తోపాటు కేంద్ర అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ముఖ్యమంత్రితో, ప్రధాన కార్యదర్శితో రివ్యూ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 6న సచివాలయంలో ఈ రివ్యూ జరిగింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారని, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని సీఎం కేంద్ర మంత్రికి, కేంద్ర బృందానికి వివరించారు. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు రూ.5,438 కోట్ల మేర నష్టం జరిగినట్లు తెలిపారు. వరద సహాయక చర్యలపై వివరించి రాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ప్రాణనష్టం తగ్గించామని వాళ్ల దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌కు సాయం చేసే తరహాలోనే తెలంగాణకూ అందించాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వరద నష్టాన్ని ఒకే తీరులో చూడాలని నొక్కిచెప్పారు. రోడ్లు, కల్వర్టులు, కాల్వలకు జరిగిన డ్యామేజీని చక్కదిద్దడానికి తాత్కాలిక మరమ్మతు చేయాల్సి ఉన్నదని, తక్షణ సాయంగా కేంద్రం నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలకు ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) నిధులను కేంద్రం విడుదల చేయడంలో ఇప్పుడున్న మార్గదర్శకాలను సవరించాలని కూడా కోరారు.

భరోసా ఇచ్చినా సాయం అందలే..

విపత్తుల సమయంలో ప్రజలకు కేంద్రం సాయం అందించే విషయంలో తారతమ్యాలు, రాజకీయాలు ఉండవని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రివ్యూలో స్పష్టం చేశారు. ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చారు. కానీ.. ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున తలా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్న విషయాన్ని కూడా కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. కేంద్రం నుంచి సాయం అందకపోవడంతో ఇప్పటివరకు బాధితులకు నష్టపరిహారం అందలేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి, కేంద్ర మంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 11,12 తేదీల్లో ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో కేంద్ర అధికారుల బృందం పర్యటించింది. ఈ పర్యటనకు ముందే ప్రధాన కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో వరద నష్టాన్ని ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించారు. రెండు రోజులపాటు ఫీల్డ్ విజిట్ చేసిన ఈ బృందం ముఖ్యమంత్రితో ఈ నెల 13న సచివాలయంలో రివ్యూ చేసింది.

కేబినెట్ భేటీ తరువాతే నిర్ణయం

వరదలు తగ్గిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల అధికారుల నుంచి తెప్పించిన వివరాల ప్రకారం ప్రాథమిక అంచనా వేసింది. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.5,438 కోట్లుగా భావించినా.. మధ్యంతర నివేదికలో అది రూ.10,032 కోట్లుగా తేలినట్లు కేంద్ర బృందానికి సీఎం రేవంత్ వివరించారు. కేంద్ర బృందం క్షేత్రస్థాయి అధ్యయనం అనంతరం రాష్ట్రంలో జరిగిన నష్టం వివరాలను నివేదిక రూపంలో కేంద్ర హోంశాఖకు అందించింది. అప్పటికే శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఒక నివేదికను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అందజేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం ఒక నివేదికను కేంద్ర హోంశాఖకు పంపింది. వీటన్నింటినీ ఆ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున ప్రచారంలో బిజీగా ఉన్న కేంద్ర హోంమంత్రి పోలింగ్ అనంతరం దృష్టి పెట్టే అవకాశమున్నట్లు హోంశాఖ వర్గాల సమాచారం. హై లెవల్ కమిటీ చైర్మన్‌గా అమిత్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో వరద సాయంపై స్పష్టత రానున్నది. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత నిర్ణయం వెలువడనున్నది.

ఫస్ట్ వీక్‌లో ఢిల్లీకి రేవంత్

మరోవైపు.. ముఖ్యమంత్రి రేవంత్ సైతం వచ్చేనెల ఫస్ట్ వీక్‌లో ఢిల్లీకి వెళ్లే అవకాశమున్నది. ఆ టూర్‌లో అవకాశాన్ని బట్టి ప్రధాని మోడీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రానికి ఇవ్వాల్సిన వరద సాయంపై విజ్ఞప్తి చేయనున్నారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాతనే వరద సాయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల మధ్య చర్చలు, సమావేశాలు జరిగి కొలిక్కి వచ్చే అవకాశమున్నది.

Advertisement

Next Story