అసంతృప్త ఎమ్మెల్యేలపై అధిష్టానం సైలెంట్

by Mahesh |   ( Updated:2022-12-21 03:40:32.0  )
అసంతృప్త ఎమ్మెల్యేలపై అధిష్టానం సైలెంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రిపైనే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే వ్యతిరేకంగా గళం విప్పడం తొలిసారి. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అయినా వారిపై చర్యలకు బీఆర్ఎస్ అధిష్టానం వెనుకంజ వేస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో ఏం చర్యలు తీసుకుంటే ఎటుదారి తీస్తుందోనని సైలెంట్‌గా ఉన్నట్లు సమాచారం. అందుకే చూసీచూడనట్లు వ్యవహరిస్తుందని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఒకవేళ చర్యలకు పూనుకుంటే రాబోయే ఎన్నికల్లో పార్టీకి నష్టమనే భావన పార్టీ అధిష్టానంలో నెలకొన్నది. అందుకోసమే రాబోయే ఎన్నికల వరకు మౌనంగా ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం.

రాష్ట్ర రాజకీయాల్లో తొలిసారిగా ఎమ్మెల్యేలు నిరసన గళం వినిపించారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్‌గా మారిన పదిరోజుల్లోనే అధికారపార్టీలో లొల్లి మొదలైంది. ఇప్పటివరకు మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయట పడ్డాయి. కేబినెట్ మంత్రి పైనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు తొలిసారిగా గళం విప్పారు. మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాలతోనే మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారే స్వయంగా ప్రకటించారు. తమకు తెలియకుండానే మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మార్పుతో పాటు ఏ నిర్ణయమైనా తాను తీసుకుంటూ ఎమ్మెల్యేలను జీరో చేస్తున్నాడని మండిపడ్డారు.

అంతేకాదు రహస్య మీటింగ్ కాదని, మంత్రి అనుసరిస్తున్న విధానం ను వ్యతిరేకిస్తూ సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. మల్లారెడ్డి నియోజకవర్గానికే నామినేటెడ్ పదవులు అన్నీ వెళ్తున్నాయని, పార్టీని నమ్ముకున్న వారికి, తమ వెంట ఉన్న వారికి ఏ విధంగా న్యాయం చేయగలమని, పార్టీ కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. అంతేకాదు ఒకే సామాజిక వర్గానికి వెళ్తున్నాయని పేర్కొన్నారు. అంటే మంత్రులు అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలు ఏ స్థాయిలో ఉన్నాయనేది స్పష్టమవుతున్నది. మేడ్చల్ జిల్లాలో ప్రారంభమైన తిరుగుబాటు పార్టీలో ఎటు దారితీస్తుందోనని నేతల్లో చర్చనీయాంశమైంది.

చర్యలకు వెనుకంజ..

రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఓ ఫాం హౌస్ కేంద్రంగా జరిగిన ఎమ్మెల్యేలకు ఎర కేసు సంచలనం సృష్టించింది. అందులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి దూకుడు పెంచింది. బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో కీలకంగా ఉన్న రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడం, విచారణకు హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ కేసులో సాక్షిగా కేసీఆర్ కుమార్తె కవిత కు సీబీఐ నోటీసులు ఇవ్వడంతో పాటు విచారణ సైతం చేపట్టింది.

అదేవిధంగా మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్రకు సీబీఐ నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టింది. వరుస ఘటనలతో బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఈ తరుణంలో మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా మైనంపల్లి హనుమంతరావు, అరికపూడి గాంధీ, వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు, బేతి సుభాష్ రెడ్డి భేటీ అయ్యారు. అయితే మొదటిసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశం కావడంతో పార్టీ సీరియస్‌గా ఉన్నప్పటికీ వారిపై చర్యలకు మాత్రం వెనుకంజ వేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరను బీఆర్ఎస్ అని చెబుతున్నప్పటికీ ఆ క్రమశిక్షణ కట్టుదాటి నిరసన గళం బహిర్గత మవుతున్నది.

ఎన్నికల వరకు మౌనమే..

తాజాగా పార్టీ కట్టు దాటిన ఐదుగురు ఎమ్మెల్యేలపై చర్యలకు ఆచితూచి వ్యవహరిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో 9నెలలు మాత్రమే గడువు ఉండటంతో ఎమ్మెల్యే హనుమంతరావు ఇంట్లో భేటీ అయిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే పార్టీ మారే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కేడర్‌ను నష్టపోవడమే కాకుండా, రాబోయే ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తుంది. జాతీయ రాజకీయాలకు వెళ్లాలనుకునే బీఆర్ఎస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోవడం తథ్యమనే సంకేతాలు సైతం వచ్చినట్లు సమాచారం. అందుకోసం ఎన్నికల వరకు మౌనంగా ఉండాలని, అసంతృప్తిని పట్టించుకోవద్దని ఆలోచనలో ఉన్నట్టుంది. అందుకే భేటీపై అధిష్టానం స్పందించడం లేదని సమాచారం

Also Read....

లిక్కర్ స్కాంలో కవిత ఫిక్స్! 'Aam Aadmi'తో రూ. 100 కోట్ల డీల్

Advertisement

Next Story