Health : ఈ అలవాట్లతో మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం.. నిద్రలేమికి కారణమదే!

by Javid Pasha |
Health : ఈ అలవాట్లతో మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం.. నిద్రలేమికి కారణమదే!
X

దిశ, ఫీచర్స్ : అకస్మాత్తుగా కళ్లు తిరగడం, చిన్న పనికే ఎక్కువగా అలసిపోవడం, ఏకాగ్రతను కోల్పోవడం, చదివింది గుర్తుండకపోవడం, రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు ఇటీవల పలువురిలో పెరిగిపోతున్నాయి. అందుకు ప్రధాన కారణాల్లో ఒకటి స్లీపింగ్ హార్మోన్ అయిన మెలటోనిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకు కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు. అవేమిటో చూద్దాం.

ఎలక్ట్రానిక్ డివైజ్‌ల అతి వినియోగం

మనం యాక్టివ్‌గా ఉండాలంటే శరీరంలో అన్ని హార్మోన్లు, జీవక్రియల సమతుల్యతతోపాటు స్లీపింగ్ హార్మోన్ మెలటోనిన్ కీలకపాత్ర పోషిస్తుంది. అయితే రాత్రిళ్లు ఎలక్ట్రానిక్ డివైజ్‌ల అతి వినియోగం ఇందుకు ఆటంకంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌ టాప్‌లు, టీవీలు, కంప్యూటర్ల ముందు రాత్రింబవళ్లు అదే పనిగా గడిపేవారిలోనే ఎక్కువగా ఈ సమస్య తలెత్తుతోంది. అలాగనీ వాటిని యూజ్ చేసినందుకే ప్రాబ్లం వస్తుందని కాదు, సరైన స్లీపింగ్ షెడ్యూల్‌ను మేనేజ్ చేయకుండా, గ్యాప్ తీసుకోకుండా అతిగా యూజ్ చేయడంవల్ల మాత్రమే అసలు సమస్య ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రిపూట వీటి స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ల వల్ల కళ్లపై, మెదడుపై ప్రభావం పడుతుంది. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి నిద్రపోయేకంటే ఒక గంట ముందు నుంచే ఎలక్ట్రానిక్ డివైజెస్‌కు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు.

ఫుడ్ అండ్ డ్రింక్స్

టీ, కాఫీ, హై షుగరింగ్ డ్రింక్స్ వంటివి ఓ పరిమితి మేరకు తాగితే పర్లేదు. కానీ కొందరు రాత్రిపూట పడుకునే ముందు వీటిని తాగుతుంటారు. అయితే వీటిలోని కెఫిన్ కంటెంట్ నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతుంది. అట్లనే చిప్స్, స్వీట్లు వంటివి రాత్రిళ్లు ఎక్కువగా తినడం ఇదే విధమైన ప్రభావం చూపుతుందని, పైగా రక్తంలో చక్కెరస్థాయిలు పెరగడానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.కాబట్టి పడుకోవడానికి ముందు కెఫిన్ రిలేటెడ్ పానీయాలకు దూరంగా ఉండాలి.

సరైన షెడ్యూల్ లేకపోవడం

పని, వ్యాయామం, నిద్ర, ఆహారం ఇలా దేనికైనా సరే టైమ్ టేబుల్ మెయింటైన్ చేస్తే ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా నిద్రపోవడానికి, మేల్కోవడానికి కూడా ఇది చాలా ముఖ్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒకే టైమ్ ప్రకారం తినడం, నిద్రపోవడం, మేల్కోవడం వంటివి ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. అలా కాకుండా రోజుకో టైమ్‌కు పడుకోవడం, మేల్కోవడం వంటివి కంటిన్యూ చేస్తుంటే క్రమంగా నిద్రలేమికి, తద్వారా ఇతర అనారోగ్యాలకు దారితీస్తాయి. ఇది మీ జీవక్రియను, స్లీప్ సైకిల్‌ను నియంత్రించి మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి ఆటంకంగా మారుతుంది.

నిద్రకు ముందు వర్కౌట్స్

ఫిట్‌నెస్ మీద ఆసక్తితో కొందరు ఎప్పుడంటే అప్పుడు వ్యాయామాలు చేస్తుంటారు. కొందరు ఉదయం టైమ్ దొరకలేదనో, ఫిట్‌నెస్ మీద ఆసక్తితోనో రాత్రిళ్లు నిద్రపోయేకంటే ముందు కూడా చేస్తుంటారు. కాగా తిన్న తర్వాత కాసేపు నడక అవసరం కానీ, నిద్రకు ముందు వ్యాయామాలు మాత్రం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. ఇవి నిద్రలేమికి దారితీయడం ద్వారా మెలటోనిన్ హార్మోన్లను అడ్డుకుంటాటాయి. తద్వారా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

ఆందోళన, ఒత్తిడి

అతి ఆలోచనలు క్రమంగా ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తాయి. క్రమంగా స్లీపింగ్ సైకిల్‌ను ప్రభావితం చేస్తాయి. దీంతో ఎంత ప్రయత్నించినా నిద్రపట్టదు. కొంతకాలం నిద్రలేమిని ఎదుర్కొన్నవారిలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది మరింత ఒత్తిడికి, ఇతర అనారోగ్యాలకు కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆందోళన, ఒత్తిడి రహిత జీవనశైలిని అలర్చుకోవాలి. ముఖ్యంగా రాత్రిళ్లు పడుకునే ముందు స్ట్రెస్, యాంగ్జైటీస్ వంటి వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. కాసేపు మెడిటేషన్ లేదా పుస్తకం చదవడం వంటి అలవాట్ల ద్వారా వీటిని డైవర్ట్ చేయవచ్చు అంటున్నారు నిపుణులు. అయినా ఫలితం లేకపోతే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story