- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
a true life story.. తీరం లేని దూరం.!
ఎక్కడ ప్రేమలు పెనవేసుకుంటాయో..
అక్కడ మానవసంబంధాలు సజీవంగా ఉంటాయి.!
ఎక్కడ అనురాగాలు అల్లుకుంటాయో..
అక్కడ ఆప్యాయతలు అంతకంతకూ రెట్టింపవుతాయి.!
ఒకప్పుడు ఇంటింటా కనిపించిన మధుర సన్నివేశాలివి.
కానీ..
నేడు కనుమరుగయ్యాయి.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బతికున్నంతకాలం..
ఊపిరిపోసుకున్న ఈ అనుబంధాల పొదరిల్లు..
ఇప్పుడు బీడు భూమివలె నెర్రెలువాసిపోయింది.
వేరెవరో కాదు..
భార్యాభర్త మధ్యనే ఎడబాటు రాజ్యమేలి ప్లాస్టిక్ ప్రేమలు పరిహసిస్తున్నాయి.!
అనుబంధాలు.. అనురాగాల పొదరిల్లు ఉమ్మడి కుటుంబాలు. అదొక స్వర్ణయుగం. మళ్లీ రాదేమో. ఎందుకంటే కాలం చాలా మారింది. ఎంత అంటారా.. భార్యా భర్త సంవత్సరాల తరబడి మాట్లాడుకోలేనంత. మనుషులు.. మనసుల మధ్య అంతరం అంతకంతకూ పెరిగి.. కలహాలు కమ్ముకొని ఎడబాటు ఎదురీదుతోంది సోదరా.!
ఇది కథ.!
రామతీర్థ, కృష్ణవేణి ఇద్దరు దంపతులు. అన్యోన్యమైన జీవితం వాళ్లది. ఇద్దరూ ఉపాధ్యాయులే. కాకపోతే రిటైర్డ్ అయ్యారు.
వీరికి ముగ్గురు సంతానం.
ముగ్గుర్నీ బాగా చదివించారు. వాళ్లేమో విదేశాల్లో సెటిలయ్యారు.
రామతీర్థ, కృష్ణవేణి ఇద్దర్నీ వేర్వేరుగా చూడలేం. అందరూ వాళ్లని కృష్ణారామా అని కలిసి పిలుస్తారు.
నెలలో ఒకరోజు మాత్రమే కొడుకులు, కోడళ్లు, కూతురు, అల్లుడు, మనవలు, మనవరాండ్లతో వీడియోకాల్స్ మాట్లాడటానికి చాన్స్ ఉంటుంది.
కానీ, వాళ్లకంతా టెక్నాలజీ తెలియదు.
అందుకోసం వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటుందని ప్రతి అనే అమ్మాయిని పెయిడ్ గెస్ట్‌గా పెట్టుకుంటారు.
నెలకోసారి కాకుండా రోజూ పిల్లలతో, బయటి ప్రపంచంతో టచ్‌లో ఉండేందుకు ప్రీతి కృష్ణారామా పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది. చాలా తొందరగా రామతీర్థ, కృష్ణవేణి సోషల్ మీడియాకు కనెక్ట్ అవుతారు. ఫేమస్ కూడా అవుతారు. #కృష్ణారామా పోస్టు పెడితే అది వైరల్ అవ్వాల్సిందే.
ఇంతవరకు బాగనే ఉంది. కానీ ఎప్పుడైతే వీరి జీవితం పబ్లిక్‌లోకి వెళ్లిందో అప్పుడు మెల్లగా వీరి అభిప్రాయాల్లో భేదాలు వస్తాయి.
చిన్న విషయమే అయినా ఒకరికొకరు మాట్లాడుకోలేనంత దూరం పెరిగిపోతుంది. #కృష్ణారామా కాస్త విడిపోయి కృష్ణవేణి, రామతీర్థ అని రెండు వేర్వేరు అకౌంట్లుగా మారిపోతుంది.
తర్వాత ఇది పెరిగి పెద్దదయ్యి 70 ఏళ్ల వయసులో విడాకులు తీసుకునే స్థాయికి చేరుకుంది. ఒకానొక దశలో ఆత్మహత్యకు కూడా ప్రయత్నిస్తారు.
పిల్లలని బాగా చదివించి విదేశాల్లో ఉద్యోగం వచ్చేలా చేసి, వారికి దూరంగా ఉంటే ఆ భాద ఎలా ఉంటుందో ఈ కథ ద్వారా తెలుస్తుంది. పిల్లలకి దూరంగా ఉన్నారనే లోటు ఉండొద్దనే ఉద్దేశంతో ఇతర వ్యాపకాలు పెట్టుకుంటే ఆఖరికి కొంప ముంచే పరిస్థితి వచ్చింది.
వృద్ధ దంపతులుగా రాజేంద్ర ప్రసాద్.. గౌతమి నటించి కొన్ని వాస్తవ సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించారు.
ఇది జీవితం.!
తమిళనాడులోని కోయంబత్తూరు.
నాగమాణిక్యం వయసు 73 సంవత్సరాలు. అతని భార్య రాజ సులోచన వయసు 63 సంవత్సరాలు.
వీరికిద్దరు పిల్లలు.
వారికి పెండ్లిళ్లు అయిపోయి ఎక్కడివాళ్లక్కడ సెటిలైపోయారు. ఎపుడో అమాసకో పున్నానికో అలగ్ సలగ్ వచ్చి కలిసిపోతుంటారు. అదికూడా ఒక గంటో.. లేదా ఒక పూటనో.
నాగమాణిక్యం సారువాడు.. రాజ సులోచన ఇద్దరే ఆ ఇంట్లో ఉంటారు. పిల్లలు వేరే ప్రాంతాల్లో ఉండి.. ఇంట్లో తల్లిదండ్రులు మాత్రమే ఉంటే ఆ జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి.
ఇక ఈ మధ్యయితే వీడియో కాల్స్ అందుబాటులోకి వచ్చి ఆన్‌లైన్ పలకరింపుల ద్వారా తల్లిదండ్రులను కాస్త ఉల్లాసపరుస్తున్నారు.
ఆ అర్ధగంట కోసం వారమంతా ఎదురుచూస్తుంటారు.
అచ్చం కృష్ణారామా సినిమాలోని రాజేంద్రప్రసాద్, గౌతమి పరిస్థితే నాగమాణిక్యం, రాజ సులోచనది.
అసలు వాళ్లిద్దరి మధ్యా ఏం జరిగిందో తెలియదు. ఒకే ఇంట్లో ఉంటూ పదేళ్లుగా ఇద్దరికీ మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్. కనీసం సైగలుకూడా లేవు.
ఇంటిపైన గదిలో నాగమాణిక్యం ఉంటాడు. కింద రాజ సులోచన ఉంటుంది.
కరెక్టుగా తినే టైమ్‌కి మాణిక్యం సారువాడు కిందికొస్తాడు. అప్పటికే మేడంగారు భోజనమంతా రెడీచేసి టేబుల్ మీద పెడుతుంది. వాటిని తీసుకుని నాగమాణిక్యం తన రూమ్‌కి వెళ్లిపోతాడు.
ఇంతే ఇగ.
పదేళ్లుగా ఆ ఇంట్లో జరిగే రొటీన్ సినిమా.
డిసెంబర్ 29న నాగమాణిక్యం ఎప్పట్లాగే తినే సమయానికి కిందికొచ్చాడు. రెడీగా ఉన్న భోజనాన్ని తీసుకొని పైకెళ్లాడు.
ఇక అంతే.
నాగమాణిక్యం సారు మళ్లీ కిందికి రాలేదు. అయ్యో పాపం ముసలాయ్న ఎటువోయిండు.. ఏం కథా.. కనిపిస్తలేడు అని రాజ సులోచన అనుకోలేదు. ఆరు రోజులైంది.. పైకెళ్లిన మనిషి ఇంకా కిందికి దిగలేదు.
ఉపాసం ఉన్నడా.. బయటెక్కడైనా తినొచ్చినట్టుండు అందుకే కిందికొస్తలేడు అనుకుందామె.
కానీ అప్పటికే నాగమాణిక్యం చనిపోయాడు. శవం కుళ్లిపోయి వాసన కిందికి గుప్పుమంటేగానీ రాజ సులోచన అమ్మగారికి చూడాలనిపించలేదు. కిటికీలోంచి చూస్తే సారెప్పుడో అనంతలోకాలకు వెళ్లిపోయాడని అర్థమైంది.
పంతం నీదా నాదా సై.!
చూశారు కదా.? సినిమాలోని రామతీర్థ, కృష్ణవేణిలా.. నిజ జీవితంలోని నాగమాణిక్యం, రాజ సులోచనలా బయటపడని వాళ్లెంతో మంది ఉన్నారు. చిన్న చిన్న విషయాలకు అలిగి కూర్చుంటారు. నువ్వే ముందు మాట్లాడాలి.. నువ్వే ముందు మాట్లాడాలి అని ఈగోలకు పొయ్యి చిన్న సమస్యను పెద్దది చేసుకుంటారు. పరిస్థితులు కలిపే ప్రయత్నం చేసినా కలవరు. పిల్లలు కలపాలని చూసినా సహకరించరు. వాళ్ల పంథం నెగ్గించుకోవడానికి సంవత్సరాల తరబడి నిశ్శబ్దానికి పెద్దపీట వేస్తారు. పిల్లలకు పెండ్లీలయ్యి తాతలు నానమ్మలు అయినంక కూడా కృష్ణారామా అని ఒకరికొకరు తోడుగా నిలవాల్సిందిపోయి ఈ పంథాలెందుకో ఆలోచించుకోవాలి. సమస్య చిన్నదా.. పెద్దదా అని కాదు.. అదేదైనా రాజీ పడాల్సిందే.!
ఉమ్మడి కుటుంబం
నీకు నేను.. నాకు నువ్వూ.. అనుకున్నవాళ్లే ఎడబాశి పోవడానికి కారణం కుటుంబ వ్యవస్థ లోపలే అంటున్నారు నిపుణులు. ఉమ్మడి కుటుంబాలున్నప్పటి అనురాగాలు.. ఆప్యాయతలు ఇప్పుడు కరువయ్యాయనేది అందరికీ తెలిసిన నిజం. బతుకు పోరాటంలో తల్లిదండ్రులను విడిచి ఎవరికి అనుకూలమైన ప్రాంతంలో వాళ్లు సెటిలవుతున్నారు. కానీ ఎప్పుడూ కాకపోయినా వీలున్నప్పుడయినా అందరూ కలిస్తే తల్లిదండ్రులకు వెలితిగా ఉండదు. ఒంటరి అనే ఫీలింగ్ రాదు. ఒంటరి అనే ఫీలింగ్ వల్లే ఎవరిమీదనో కోపాన్ని భార్య భర్త మీద, భర్త భార్య మీద చూపించి చివరికి ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. అది క్రమంగా నాగ మాణిక్యం సారు కథలా మారిపోతుంది.
వీళ్లలా ప్రయత్నించండీ.!
ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం పోలీస్ పటేల్ రామయ్య, బాపమ్మకు ఇద్దరు కుమారులు, ఏడుగురు కుమార్తెలు. వీళ్లంతా వేర్వేరు ప్రాంతాల్ల సెటిలయ్యారు. బిజీ లైఫ్‌లో కలుసుకోవడం వీలుకావడం లేదు. మేనత్త ఎవరు.. బాబాయ్ ఎవరూ.. అసలు తాతా నానమ్మ ఎవరూ అనేవి పిల్లలు మర్చిపోతున్నారనే ఉద్దేశంతో బాపమ్మ కుటుంబం అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశి ఆత్మీయ కలయిక ఏర్పాటు చేశారు. ఇక అప్పటి నుంచి అదే ఆనవాయితీగా ప్రతీయేటా సంక్రాంతికి అందరూ ఒక్కచోట చేరి... పిల్లా పాపలతో సందడి చేస్తారు. ఆ తర్వాత మళ్లీ ఏడాదిపాటు వాట్సాప్ గ్రూపులో ఆ మధుర జ్ఞాపకాలను పంచుకుంటూ మరో సంక్రాంతి కోసం ఎదురుచూస్తుంటారట.
ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు వీలుకాకపోవచ్చు. కానీ వీలైనప్పుడల్లా పెద్దవాళ్ల దగ్గరికి పిల్లలను తీసుకెళ్లండీ. ఎవరు ఎవరికి ఏమవుతారో అనే విషయాలైనా తెలుస్తాయి. పెద్దలకు వృద్ధాప్యంలో కాస్త ఆటవిడుపు దొరుకుతుంది. తరాలు మారినా తాతెవ్వరూ ముత్తాతెవరూ అనే కన్ఫ్యూజన్ లేకుండా పిల్లలు ఎదుగుతారు. కమ్యునికేషన్‌తో ఉండండీ.. మరో నాగమాణిక్యం, రాజ సులోచనలా తయారవ్వకండి..!!