TGSRTC: కొత్త బస్సులు కొంటున్నాం.. 3,035 ఉద్యోగాలు భర్తీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండీ సజ్జనార్

by Shiva |
TGSRTC: కొత్త బస్సులు కొంటున్నాం.. 3,035 ఉద్యోగాలు భర్తీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండీ సజ్జనార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అంతేగాక త్వరలో 3,035 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. హైద‌రాబాద్ బాగ్ లింగంప‌ల్లిలోని ఆర్టీసీ కళా భ‌వ‌న్‌లో శ‌నివారం ఆర్టీసీ ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హజరై మాట్లాడుతూ.. ఆర్టీసీలో గత పదేళ్లుగా కనీసం ఒక్క బస్సును కొనలేదన్నారు. 15 ఏళ్లు దాటిన బస్సులను కూడా తిప్పారన్నారు. దీని వలన ఉద్యోగులకు పని భారం పెరిగేదన్నారు. ఎండీగా సజ్జనార్ వచ్చిన తర్వాత ఆర్టీసీలో అద్భుతమైన మార్పులు వచ్చాయన్నారు. రాబోయే ఐదేళ్ల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా మరిన్ని కొత్త బస్సులు, రెండోసారి ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు రూ.2,750 కోట్ల విలువగల ప్రయాణాన్ని ఉచిత మహిళ పథకం కింద అందజేశామన్నారు. ఉద్యోగుల బాండ్స్ పెరిగాయని రూ.200 కోట్లు చెల్లించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఆ నిధులు చెల్లించే బాధ్యత ప్రభుత్వం‌పై ఉందన్నారు.

ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ప‌నికి త‌గ్గ గుర్తింపు ఉంటేనే ఏ ఉద్యోగులైన ఉత్సాహంగా ప‌ని చేస్తుంటారని తెలిపారు. ఈ విష‌యాన్ని టీజీఎస్ ఆర్టీసీ యాజ‌మాన్యం గుర్తించి ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రతి ఏటా ప్రగతి చ‌క్రం పేరుతో అవార్డుల‌ను అందజేస్తుందన్నారు. ఆర్టీసీ వృద్దికి అధికారులు, సిబ్బంది నిబద్దత, అంకితభావంతో పనిచేస్తున్నారని, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. సిబ్బంది పనితీరు వల్లే రాఖీ పౌర్ణమి రోజు రికార్డు స్థాయిలో 63 ల‌క్షల మందిని గమ్యస్థానాలకు సంస్థ చేర్చిందని గుర్తు చేశారు. ఒక్కరోజులో రూ.32 కోట్ల ఆదాయం సంస్థకు వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ డాక్టర్ ర‌వింద‌ర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కృష్ణకాంత్, వినోద్ కుమార్,వెంకటేశ్వర్లు, ఫైనాన్స్ అడ్వైజర్ విజ‌య‌పుష్ఫ, సీపీఎం ఉషాదేవి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

చెరువులపై సమాచారం ఇవ్వండి: మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణ పై తమకు సమాచారం ఇవ్వండి అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు ఆక్రమణలను తెలియజేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం ఎవరి మీద కక్ష పూరితంగా ,వ్యక్తిగతంగా ఉద్దేశ్య పూర్వకంగా చర్యలు తీసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed