డిస్కౌంట్ ఆఫర్స్ అనగానే ఆ లింక్స్‌ క్లిక్ చేస్తున్నారా?.. ముందు ఈ విషయం తెలుసుకోండి..!

by Gantepaka Srikanth |
డిస్కౌంట్ ఆఫర్స్ అనగానే ఆ లింక్స్‌ క్లిక్ చేస్తున్నారా?.. ముందు ఈ విషయం తెలుసుకోండి..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉచిత ఆఫర్లకు మోసపోవద్దని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీజీసీఎస్బీ డైరక్టర్ శిఖా గోయాల్ తెలిపారు. సైబర్ క్రైమ్ అవగాహన పై దిశ పత్రికతో శనివారం మాట్లాడారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వారం రోజుల పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అవగాహన కలిగించినట్టు తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతున్న మహకుంభమేళాకు వెళ్తున్న భక్తులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగిస్తున్నట్టు తెలిపారు. సైబర్ నేరాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2024 సంవత్సరంలో రూ.1,869 కోట్లు సైబర్ నేరగాళ్లు దోచుకున్నారని తెలిపారు. టీజీసీఎస్బీ ద్వారా రూ.179 కోట్ల రికవరీ చేశామని, రూ.244 కోట్లు హోల్డ్‌లో ఉంచామన్నారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా నేరగాళ్ల బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం ద్వారా రికవరీ చేయడం సాధ్యపడుతుందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తుందని వెల్లడించారు.

మహకుంభమేళాలో అప్రమత్తత అవసరం..

ఆన్‌లైన్ హోటల్, ధర్మశాల, గెస్ట్ హౌస్ బుకింగ్‌లలో సైబర్ నేరగాళ్లు తమ నేరచర్యలు చేపడుతున్నారని టీజీసీఎస్బీ దృష్టికి వచ్చిందని తెలిపారు. 45 రోజుల ఈవెంట్‌లో మిలియన్ల మంది సందర్శకులు వస్తారని అంచనా వేయడంతో, సైబర్ నేరగాళ్లు డిమాండ్‌ను చురుగ్గా ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. నకీలీ వెబ్‌సైట్ లింకులు సైబర్ నేరగాళ్లు వినియోగించనున్నారని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీగా తగ్గింపు ధరలకు వసతి కల్పిస్తూ మోసగాళ్లు భక్తులను ఆకర్షించేలా ప్రయత్నాలు చేస్తారని తెలిపారు.

టీజీసీఎస్బీ జారిచేసిన మార్గదర్శకాలు..

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంచే ధృవీకరించబడిన వెబ్‌సైట్‌లను మాత్రమే వినియోగించుకోవాలి.

ప్రభుత్వంచే ఆమోదించబడిన అధికారిక వసతిగృహాల జాబితా https://kumbh.gov.in/en/Wheretostaylist లో అందుబాటులో ఉంది.

డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటనల వెబ్‌సైట్లు, యాప్ లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోవాలి.

ప్రభుత్వ గుర్తింపు లేని సంస్థల బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ముందస్తు చెల్లింపులు చేయవద్దు.

ఆన్‌లైన్‌లో వ్యక్తిగత, లేదా ఆర్థిక సమాచారాన్ని తెలిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలి.

వివిధ వాట్సప్ మేసేజ్‌ల ద్వారా వచ్చిన దేవతల చిత్రాలు వంటివి డౌన్‌లోడ్ చేసిన ఫొటోలు, వీడియోలను ఫార్వర్డ్ చేయకుండా జాగ్రత్త వహించాలి.

సైబర్ మోసాన్ని గుర్తించిన వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు కాల్ చేయాలి.

www.cybercrime.gov.in లో అధికారిక సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌‌లో ఫిర్యాదు చేయాలి.

సైబర్ భద్రత, అప్‌డేట్‌లపై మరింత సమాచారం కోసం tecsb.tspolice.gov.in ని సందర్శించవచ్చు.

సోషల్ మీడియాలో ఇన్‌స్టా గ్రామ్, ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, లింక్డ్‌ఇన్ సైబర్ క్రైమ్ సమాచారం అందుబాటులో ఉందని తెలిపారు.

Next Story

Most Viewed