కిడ్నీ బాధితుల్లో సెక్స్ సమస్యలు

by Mahesh |   ( Updated:2025-03-21 06:42:33.0  )
కిడ్నీ బాధితుల్లో సెక్స్ సమస్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కిడ్నీ సమస్యలు ఉన్న వారిలో శారీరక ధర్మాల్లో మార్పులు సెక్స్ సమస్యలను మరింత జఠిలం చేస్తాయి. సీరియస్ కిడ్నీ సమస్యల వల్ల పురుషులలో అంగస్తంభన, స్త్రీలలో సెక్స్ సమస్యలు వస్తాయి. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వారి రక్తంలో క్రియాటిన్,యూరియా స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల కోరిక తగ్గడం, భావప్రాప్తి పొంద లేకపోవడం గమనించవచ్చు. డయాలసిస్ వల్ల క్రియాటిన్ పరిమాణం తగ్గి కోరికలు మామూలు స్థితికి వచ్చినా.. అంగస్తంభనలో సమస్యలు తలెత్తుతాయి. అలాగే హార్మోన్ల మార్పులను గమనిస్తే గొనడో ట్రోఫీన్స్ పెరుగుతాయి. ఉదాహరణకి ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ (FSH)పెరుగుతుంది. ల్యూటినైజింగ్ హార్మోను తగ్గుతుంది. దీనివల్ల సెక్స్ హార్మోన్స్ టెస్టోస్టిరాన్ పరిమాణం తగ్గిపోతుంది. ఈ అపసవ్య స్థాయి అంతా హార్మోన్ల చికిత్సతో మామూలు అవుతుంది.

పెయిన్ కిల్లర్స్..

పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ తో కిడ్నీలకు ప్రమాదమే. పారా థైరాయిడ్ పెరగడం జింకు లోపం, రక్తహీనత, అధిక రక్తపోటు, హైపోగొనిడిజం, బీ12 లోపం, షుగర్ బీపీలకు వాడే మందుల వల్ల కూడా అంగస్తంభన లోపం ఏర్పడుతుంది. ఈ వ్యాధుల వల్ల 50 శాతం అంగస్తంభన లోపం వస్తుంది. అందుకే రెగ్యులర్ గా కిడ్నీ, డయాబెటిక్ ప్రొఫైల్ చేయించుకుంటూ ఉండాలి.

జింక్ తప్పనిసరి

ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఖనిజాలు, ఎల్ -ఆర్జినిన్ శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. డయాలసిస్ అయి, కిడ్నీ మార్పిడి అయిన వారిలో ఆహారంలో జింక్ ఖనిజం ఉండటం ద్వారా శృంగారంలో పాజిటివ్ ఫలితం వస్తుంది. ఏ వ్యాధి లేకపోయినా ఆహారంలో జింక్ లోపం ఉన్నవారిలో లైంగిక సామర్థ్యం తగ్గడం గమనించవచ్చు. ఈ విషయంలో రోగులు కాని వారికి కూడా సరైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

కిడ్నీ మార్పిడి..

కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వారిలో డిప్రెషన్,మానసిక ఒత్తిడి అధిక స్థాయిలో ఉంటాయి. ఈ ప్రభావం కచ్చితంగా సెక్స్ జీవితంపై పడుతుంది. కొన్నిసార్లు స్త్రీ పురుషులు ఇద్దరిలో కిడ్నీ మార్పిడి వల్ల జీవితంపై ఆశ పెరిగి శృంగార జీవితం మెరుగుపడుతుంది.

చెక్ జీఎఫ్ఆర్..

గ్లోమెరులార్ ఫిల్టరేషన్ రేట్ (జీఎఫ్ఆర్) ప్రతి నిమిషానికి 100 నుంచి 120 మిల్లీలీటర్లు ఉండాలి. ఈ స్థాయి తగ్గితే కిడ్నీలు దెబ్బ తింటున్నట్టు గా అనుమానించాలి. మధుమేహుల్లో మైక్రో ఆర్బోమిన్ బయటపడితే చికిత్స మొదలుపెట్టాలి. చాలాసార్లు అంగస్తంభన లోపం శరీరంలో హృదయ, కిడ్నీ సంబంధిత వ్యాధులను సూచిస్తుంది. ఈ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేయించుకొని.. వాటిని తగ్గించుకోవడం ద్వారా సెక్స్ సమస్యలకు దూరం కావచ్చు.

డాక్టర్ భారతి

ఎంఎస్ సెక్సాలజిస్ట్ మ్యారేజ్ & ఫ్యామిలీ కౌన్సిలర్ సైకోథెరపిస్ట్

జివిఎస్ రీసెర్చ్ సెంటర్ ఫర్ అండ్ మెంటల్ హెల్త్

Read more about Sex education https://www.dishadaily.com/Sexeducation

Next Story