- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG Govt.: తెలంగాణ To ఫిలిప్పీన్స్..! బియ్యం ఎక్స్‌పోర్ట్ చేసేందుకు కసరత్తు

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బియ్యం ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి కానున్నాయి. బియ్యం సరఫరా చేసేందుకు రాష్ర్టంలో 50 మిల్లులు అంగీకరించినట్లు తెలిసింది. ఫిబ్రవరి రెండో వారంలో ముందుగా 15 వేల టన్నులు పంపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మిల్లుల నుంచి కాకినాడ పోర్ట్ వరకూ బియ్యాన్ని లారీలో పంపిస్తారు. అక్కడి నుంచి ఫిలిప్పీన్స్ కు తరలిస్తారు. బియ్యం కోసం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ఫిలిప్పీన్స్ దేశం ఇక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించింది. దీంతో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, కమిషన్ డీఎస్ చౌహాన్ మూడు నెలల క్రితం ఆ దేశానికి చెందిన ప్రతినిధులతో చర్చించారు. బియ్యంలో నూక 5 శాతానికి మించకుండా ఎగుమతి చేయాలని ఆ దేశం కోరడంతో రాష్ట్రం నుంచి లక్ష టన్నుల బియ్యం ఎగుమతికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. వానాకాలం ధాన్యం సేకరణ ప్రారంభమైన తరువాత రాష్ట్ర మిల్లర్ల సంఘం నాయకులతో పౌర సరఫరా శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్ సమావేశం ఏర్పాటు చేసి ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతి చేసే విషయంలో చర్చలు జరిపి అక్కడికి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. దీంతో గత యాసంగి సీజన్ కు చెందిన ధాన్యం తీసుకెళ్లిన మిల్లర్లు సీఎంఆర్ చేసి బియ్యం ఇప్పటివరకు ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఆ సీజన్కు చెందిన ధాన్యం సీఎంఆర్ చేసి బియ్యం ఇవ్వాలని సూచించడంతో దీనికి పలు మిల్లులు ముందుకొచ్చాయి.
లక్ష మెట్రిక్ టన్నులు సేకరణ..
ఫిలిప్పీన్స్ కు బియ్యం సరఫరా చేసేందుకు ఎనిమిది జిల్లాలోని 50 మిల్లలు నుంచి లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం నల్లగొండ, యాద్రాద్రి, సూర్యాపేట, మెదక్, ఖమ్మం జిల్లాలకు చెందిన 10 మిల్లులు అంగీకరించాయి. ఈ మిల్లుల్లో గత యాసంగి సీజన్ కు సంబంధించిన వడ్లను సీఎంఆర్ చేసి 15 వేల టన్నుల బియ్యాన్ని ఫిలిప్సీన్స్ కు పంపించడానికి అంగీకరించినట్లు పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. ఇప్పటివరకు ప్రభుత్వం సీఎంఆర్ కు 25 శాతం నూకను అంగీకరించేది ప్రస్తుతం 5 శాతం నూకతోనే బియ్యం పంపించాల్సి ఉంటుంది. అందుకే క్వింటాలు రూ. 350 మిల్లర్లకు ఇవ్వనున్నారు. దీంతో పాటు క్వింటాల్ కు రూ.50 చొప్పున మిల్లింగ్ చార్జీలు కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది.
బియ్యం ప్యాక్ చేయడానికి తెల్ల గన్నీ బ్యాగులను పౌరసరఫరాల శాఖ మిల్లర్లకు అందించనుంది. అయితే బియ్యం నాణ్యతతో పాటు నూక శాతం అధికారుల బృందం పూర్తిగా పరిశీలన చేసిన తరువాతే సరఫరాకు ఏర్పాటు చేస్తారు. తాజాగా నల్లగొండ జిల్లా హలియాలోని వజ్రలేజ్రైస్ మిల్లులో బియ్యం నాణ్యతను ఫిలిప్పీన్స్కు చెందిన అధికారులు వచ్చి పరిశీలించారు. అక్కడ పండించిన 1010, 1064 ధాన్యం రకాలను నాణ్యమైనవిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెండు మూడు రోజుల్లో ఖమ్మం, మెదక్ జిల్లాల్లోని రెండు మిల్లుల వద్దకు వెళ్లి బియ్యం పరిశీలించనున్నట్లు తెలిసింది.
ఫిబ్రవరిలో కాకినాడ పోర్టుకు తరలింపు..
ప్రభుత్వం సిద్దం చేసిన బియ్యం మిల్లుల నుంచి నేరుగా కాకినాడ పోర్టుకు తరలిస్తారు. ఫిబ్రవరి రెండో వారంలో ముందుగా 15 వేల టన్నులు ఎగుమతి చేసేందుకు రవాణ చార్జీలను ప్రభుత్వమే భరించనుంది. అక్కడి నుంచి ఓడల ద్వారా ఫిలిప్పీన్స్కు పంపిస్తారు. గత ఉమ్మడి పాలనలో తెలంగాణ బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడి బియ్యం నాణ్యత తగ్గడంతో ఇతర దేశాలు బియ్యం దిగుమతి చేసుకునేందుకు మొగ్గు చూపలేదు. మళ్లీ కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాత ఇతర దేశాలకు తెలంగాణ బియ్యం వెళ్లనున్నాయి.