TG Govt.: రైతు కూలీల గుర్తింపుపై సర్కార్ ఫోకస్.. లెక్కలు తీసున్న అధికారులు

by Shiva |
TG Govt.: రైతు కూలీల గుర్తింపుపై సర్కార్ ఫోకస్.. లెక్కలు తీసున్న అధికారులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రైతు కూలీల లెక్కలు తీసే పనిలో ప్రభుత్వం పడింది. అందుకు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నది. జాబ్ కార్డు ఉన్న వారిలో వ్యవసాయం భూమి లేని కూలీలు ఎంత మంది ఉన్నారోనని ఆరా తీస్తున్నది. వారందరికీ ఈ నెల 28న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక్కో ఫ్యామిలీకి రూ.6 వేల ఆర్థిక సాయం చేయనుంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రతి ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. పథకం ప్రారంభం సందర్భంగా ఇప్పుడు సగం డబ్బులు, తర్వాత మిగతా సగం ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది.

నేరుగా అకౌంట్‌లో డబ్బులు జమ

వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల అకౌంట్‌లో వేయాలని సర్కారు నిర్ణయానికి వచ్చింది. ఉపాధి హామీ పథకం కింద పనులు చేసే కూలీలు అందరికీ ఇప్పటికే పోస్టు ఆఫీసుల్లో ఖాతాలు ఉన్నాయి. ప్రభుత్వం అందించే సాయం కూడా నేరుగా ఆ అకౌంట్స్‌లో జమ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తున్నది. అయితే, వ్యవసాయ కూలీలను గుర్తించే విషయంలో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సర్కారు నుంచి పంచాయతీరాజ్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద 51 లక్షల మందికి జాబ్ కార్డులు ఉన్నాయి. ఈ స్కీమ్‌లో ప్రతి ఏటా 100 రోజుల పాటు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తున్నది. అందులో 25 వేలు మంది మాత్రమే వంద రోజుల పాటు కూలీకి వెళ్తుండగా, 60 నుంచి 70 రోజుల పాటు కూలీ పనులు చేసిన లబ్ధిదారుల సంఖ్య 2.50 లక్షలు ఉన్నట్టు ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో గుంట భూమిలేని కూలీలు ఎంత మంది ఉన్నారు? అర ఎకరం వరకు ల్యాండ్ ఉన్న కూలీల సంఖ్య ఎంత? అని విడివిడిగా జాబితా తయారు చేస్తున్నట్టు తెలుస్తున్నది.

బడ్జెట్‌లో రూ.1,200 కోట్లు కేటాయింపు

వ్యవసాయ కూలీలకు ప్రతి ఏటా రూ.12 వేలు ఇచ్చేందుకు ప్రస్తుత బడ్జెట్ 2024–25లో రూ.1,200 కోట్లు కేటాయించారు. నిజానికి మార్చిలోపు ఈ స్కీమ్ కింద కేటాయించిన నిధులు అన్ని ఖర్చు చేయాలి. ఈ నెల 28న సగం డబ్బులే అంటే ఒక్కో ఫ్యామిలీకి రూ.6 వేలు ఇచ్చి, మిగతా అమౌంట్‌ను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రారంభించునున్న ఈ స్కీమ్‌కు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని భావిస్తోన్న ప్రభుత్వం ఆ రోజున ప్రతి జిల్లాకేంద్రంలో ఇన్‌చార్జి మంత్రుల ఆధ్వర్యంలో స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తునట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed