- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG Govt.: కొత్త టూరిజం పాలసీపై సర్కార్ కసరత్తు.. 27 పర్యాటక ప్రాంతాల గుర్తింపు

దిశ, తెలంగాణ బ్యూరో: భారీగా దేశ, విదేశీ పర్యాటకులను ..పెట్టుబడులను ఆకర్షించేందుకు పర్యాటక నూతన పాలసీని తెలంగాణ ప్రభుత్వం తాజాగా తెర మీదకు తెచ్చింది. పర్యాటక రంగానికి మరింత మెరుగులు దిద్ది...పరుగులు పెట్టించేందుకు ఈ పాలసీని డిసెంబర్‌లో సిద్ధం చేసింది. కొత్త పాలసీకి మరిన్ని సవరణలు చేసిన మంత్రివర్గం...సోమవారం ప్రత్యేక జీవోను విడుదల చేసింది. ఈ రంగం ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. అలాగే మూడు లక్షల మందికి అదనపు ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తోంది. పర్యాటకుల్ని ఆకర్షించడంలో దేశంలో తొలి ఐదు స్థానాల్లో తెలంగాణను నిలపాలని నిర్ణయించింది.
టూరిజం నుంచి 10 శాతానికి మించి ఆదాయం
రాష్ట్ర ఆదాయంలో 10 శాతానికి మించిన ఆదాయాన్ని టూరిజం నుంచి దక్కేందుకు ప్రభుత్వం ప్రణాళికలను ఖరారు చేసింది. ఈ పాలసీ 2030 వరకూ అంటే ఐదేళ్లపాటు... అమలు చేయడానికి టూరిజం అధికారులు ప్రణాళికలను రూపొందించారు. పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించే వారికి పలు రాయితీలు ఇవ్వనున్నారు. పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేవారికి ప్రభుత్వ భూములను లీజుకు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. పర్యాటక పాలసీ కోసం...తెలంగాణ టూరిజం పోర్టల్‌ను రూపొందించనున్నది. ఈ పోర్టల్‌లో తెలంగాణ చరిత్రకు సంబంధించిన అంశాలను పొందుపరచనున్నారు. పర్యాటక రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించనున్నారు. స్పోర్ట్స్ టూరిజానికి సంబంధించి వివరణాత్మక ఫ్రేమ్ వర్క్‌ను సిద్ధం చేశారు.
అన్ని సేవలూ ఒకేచోట..
రానున్న ఐదేళ్లలో పర్యాటక రంగం కొత్తపుంతలు తొక్కాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రాకృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక నేపథ్యం గల ప్రాంతాల వివరాలను, ఆహ్లాదకరమైన ప్రదేశాలు, వసతి, భోజన, రవాణా సౌకర్యాలకు సంబంధించిన సమాచారం ఒకే చోట అందించేలా టూరిజం శాఖ ప్లాన్ చేస్తోంది. వన్‌స్టాప్ ప్లాట్ ఫామ్‌గా సేవలు అందించేందుకు తెలంగాణ టూరిజం అధికారులు పోర్టల్‌ను ఇప్పటికే రూపొందించినట్టు సమాచారం.
రాష్ట్రంలో 27 పర్యాటక ప్రాంతాలు
రాష్ట్రంలో 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను గుర్తించిన పర్యాటక శాఖ యుద్ధప్రాతిపదికన తొమ్మిదింటిని అభివృద్ధి చేయడానికి కార్యాచరణను రూపొందించింది. వికారాబాద్, సోమశీల, కాళేశ్వరం, నాగార్జున సాగర్, భద్రాచలం, వరంగల్, ట్రైబల్ సర్కు్లేట్ ఇందులో జోడేఘాట్, ఉట్నూరు, ఉషేగావ్, కేస్లాగూడ, వన్యప్రాణుల అభయారణ్యం, జలపాతాలు, ఎకో టూరిజం, చార్మినార్‌లో లాడ్‌బజార్, మక్కామసీదు, చూమోహల్లా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియం ప్రత్యేక పర్యాటక ప్రాంతాలుగా ఇప్పటికే గుర్తింపు పొందాయి. తెలంగాణకు 2500 ఏళ్లకు మించిన చారిత్రక నేపథ్యం ఉంది. 14వ శతాబ్దంలో కాకతీయులు చేపట్టిన కట్టడాలు, ప్రాకృతిక ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, అద్భుతమైన కోటలు, స్మారక చిహ్నాలు, దేవాలయాలు, సరస్సులు, రాతి ప్రాంతాల్లో సహజ సౌందర్యాలు, వన్యప్రాణులు, వృక్షజాలం, జంతుజాలం, విభిన్న జాతులు, పండుగలు.. తెలంగాణ ప్రత్యేకతలు. అయితే గత దశాబ్ద కాలంగా పర్యాటకాన్ని ఆకర్షించే ప్రయత్నాలు జరగలేదని కొత్త సర్కార్ గుర్తించింది. అందుకే పర్యాటక ప్రదేశాలను గుర్తించి..నూతన పాలసీని తెరమీదకు తీసుకొచ్చింది. పర్యాటక ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు, రాయితీలు ఐదేళ్ల వరకు అమల్లో ఉంటాయని కాంగ్రెస్ సర్కార్ తెలియజేసింది. రాయితీ పొందే కొత్త టూరిజం ప్రాజెక్టుల్లో అడ్వెంచర్ టూరిజం, కారవాన్ పార్క్ ప్రాజెక్టులు, పర్యాటక కారవాన్లు, హౌస్ బోట్లు, తదితరమైన ఉన్నాయి.
పర్యాటక ప్రాంతాల్లో పోలీస్ గస్తీ
ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేసి మహిళలకు భద్రత కల్పిస్తారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా కీలక ప్రాంతాల్లో ఐకానిక్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో ప్రసిద్ది చెందిన బతుకమ్మ, ఉత్సవాలు, జాతరలు, వైద్య వెల్నెస్ టూరిజం, ఆధ్యాత్మిక ప్రాంతాలను టూరిజం పాలసీలో చేర్పించి...పర్యాటక రంగానికి పెట్టపీట వేశారు.