TG Assembly: అసెంబ్లీలో ఆర్వోఆర్ డ్రాఫ్ట్..! సభలో ప్రవేశపెట్టి అభిప్రాయాల సేకరణ

by Shiva |   ( Updated:2024-08-01 02:30:07.0  )
TG Assembly: అసెంబ్లీలో ఆర్వోఆర్ డ్రాఫ్ట్..! సభలో ప్రవేశపెట్టి అభిప్రాయాల సేకరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్ ద్వారా చోటు చేసుకున్న అక్రమాలు, పొరపాట్ల కారణంగా లక్షలాది మంది రైతాంగం పడుతున్న ఇబ్బంది అంతా ఇంతా కాదు. దీనికి కారణమైన ఆర్వోఆర్ యాక్ట్ 2020కి స్వస్తి పలకడం మినహా మరో మార్గమేదీ ప్రభుత్వం ముందు కనిపించడం లేదు. ధరణి అధ్యయన కమిటీ సైతం కొత్త చట్టం అనివార్యమని తేల్చేసింది. ఈ క్రమంలోనే మరో 20 ఏళ్ల వరకు ఎలాంటి సవరణలకు అవకాశం ఇవ్వకుండా సరికొత్త ప్రజాస్వామిక రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే ధరణి కమిటీ సభ్యులు, భూ చట్టాల నిపుణులు రూపొందించిన ఆర్వోఆర్ యాక్ట్ డ్రాఫ్ట్‌పైన సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికార యంత్రాంగం, నిపుణులతో చర్చించారు. అదే డ్రాఫ్ట్ పాలసీని ముందుగా మంత్రివర్గ సమావేశంలో చర్చించి, ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. అసెంబ్లీలో నేరుగా ఆమోదించకుండా పార్లమెంటు మాదిరిగా ముందుగా చట్టంపై వివరణ ఇవ్వడం, ఆ తర్వాతే జనంలోకి తీసుకెళ్లడం.. చేర్పులు, మార్పులు చేసిన త ర్వాతే అమల్లోకి తీసుకురావాలన్నది ఉద్దేశం. మిగతా రాష్ట్రాల్లో అమలవుతోన్న మెరుగైన రెవెన్యూ చట్టాలపై అధ్యయనం ద్వారానే రూపకల్పన చేశారు.

అసెంబ్లీలో అక్రమాల సినిమా..

అసెంబ్లీలో కొత్త ఆర్వోఆర్ చట్టం అవసరం ఎంత వరకు ఉన్నదనే దానిపై ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది. ఈ క్రమంలోనే ధరణి పోర్టల్, ఆర్వోఆర్ యాక్ట్-2020 ద్వారా ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు? ఎన్ని వేల ఎకరాలను కొల్లగొట్టారు? ఎన్వోసీలు ఎలా జారీ చేశారు? ఈ నాలుగేళ్లుగా ఆడిట్ లేకుండా ఎలా భూ పరిపాలనను నిర్వహించారు? అనే అంశాలపై గత ప్రభుత్వపు తప్పిదాలను ఎండగట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైనట్లు సమాచారం. అసెంబ్లీలో ధరణి అక్రమాల సినిమా చూడనున్నట్లు తెలిసింది. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి, వికారాబాద్ జిల్లాల్లో సాగిన భూ దందాలపై పెద్ద చర్చ జరగనుంది. ఆర్వోఆర్ 2020 చట్టంలోని లోపాలను, ధరణి పోర్టల్‌లోని లొసుగుల ఆధారంగా ఏం జరిగాయో సభలో ప్రభుత్వం వివరించనున్నట్లు టాక్. ఇప్పటికే థర్డ్ పార్టీ ద్వారా అక్రమాల చిట్టాను సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధం చేయించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పీల్ వ్యవస్థ లేకుండా సామాన్యుల నుంచి ఎలా భూములను లాక్కున్నారో సభ ముందు ఉంచి కొత్త చట్టం ప్రతిపాదనలను వివరిస్తారని తెలుస్తోంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత కొత్త ఆర్వోఆర్ చట్టంపైన ప్రతి ఊరిలోనూ విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. అదేవిధంగా అభిప్రాయాలను, అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభిప్రాయ సేకరణ ప్రాసెస్‌ను 15 రోజుల్లో కంప్లీట్ చేయనున్నారు.

Advertisement

Next Story