మంత్రులు, ఎమ్మెల్యేలకు టెస్టింగ్ టైం.. గెలిస్తే ప్రమోషన్.. ఓడితే జరిగేది ఇదే..!

by Disha Web Desk 4 |
మంత్రులు, ఎమ్మెల్యేలకు టెస్టింగ్ టైం.. గెలిస్తే ప్రమోషన్..  ఓడితే జరిగేది ఇదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్లుండి సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనున్నది. దీంతో పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ చార్జులుగా ఉన్న కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్‌గా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఒకవేళ అనుకున్న ఫలితాలు రాకపోతే అధిష్టానం నుంచి చివాట్లు తప్పవనే ఆందోళన వారిలో కనిపిస్తున్నది. రెండురోజుల క్రితం కేసీ వేణుగోపాల్ ఎన్నికల ప్రచారం తీరుపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో, సదరు లీడర్లలో కదలిక వచ్చినట్టు తెలుస్తున్నది. ఈనెల 10,11 తేదీల్లో ఏఐసీసీ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. దీంతో వారు పాల్గొనే సభలు, రోడ్డుషోల విజయవంతానికి ప్రత్యేక దృష్టిపెట్టారు.

గెలిస్తే ప్రమోషన్, ఓడితే డిమోషన్

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపోటములు మంత్రులు, ఎమ్మెల్యేలకు చాలెంజ్‌గా మారాయి. ఇన్ చార్జులుగా ఉన్న స్థానాల్లో అభ్యర్థులు గెలిస్తే పదవులు దక్కుతాయని, ఓడితే ఉన్న పదవులు ఊడుతాయనే సంకేతాలను అధిష్టానం ఇచ్చినట్టు చర్చ జరుగుతున్నది. ఈ విషయాన్ని గ్రహించిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సొంత ఎన్నికల కంటే ఎక్కువ సీరియస్‌గా తీసుకుని పనిచేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ప్రధానంగా గట్టి పోటీ ఉన్న సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థి విజయం కోసం పలు రకాలు వ్యూహాలను అమలు చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారం చేయని ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల్లో పర్యటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే పోల్ మేనేజ్మెంట్‌పై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తున్నది. ఏ విధంగా పోల్ మేనేజ్మంట్ చేయాలో తమ కేడర్‌కు ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈనెల 10, 11 తేదీల్లో రాష్ట్రానికి రాహుల్, ప్రియాంక రానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సభలు, రోడ్డు షోల సక్సెస్ కోసం ప్లాన్ చేస్తున్నారు.

సొంత సెగ్మెంట్లో మెజార్టీపై ఫోకస్

తమ సొంత నియోజకవర్గాల్లో ఓటింగ్‌పై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువ ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు వచ్చిన ఓట్ల కంటే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ తక్కువ ఓట్లు వస్తే, హైకమాండ్ నుంచి చివాట్లు తప్పవనే ఆందోళన వారిలో కనిపిస్తున్నది. అందుకని నియోజకవర్గంలోని పలు వర్గాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల ఓట్లు రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోని మైనార్టీ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు కాంగ్రెస్ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.

లీడర్ల కదలికలపై ఆరా..

ఎన్నికల ప్రచారంలో మంత్రులు, ఎమ్మెల్యేల కదలికలపై కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నది. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నికలను సీరియస్ గా తీసుకోవడం లేదని ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ సీరియస్‌గా క్లాస్ తీసుకున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. పోలింగ్ ముగిసేవరకు లీడర్ల ప్రచారం, పోల్ మేనేజ్మెంట్‌పై కూడా అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది.

Next Story

Most Viewed