ఐదేళ్ళు కంటిన్యూ కావడం కష్టమే.. కాంగ్రెస్ వైపు చూస్తున్న ఆ గులాబీ నేతలు!

by GSrikanth |
ఐదేళ్ళు కంటిన్యూ కావడం కష్టమే.. కాంగ్రెస్ వైపు చూస్తున్న ఆ గులాబీ నేతలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోకల్ లీడర్లు డైలమాలో పడ్డారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో గందరగోళం నెలకొంది. అధికారం లేకపోవడంతో ఐదేళ్లు గులాబీలో కొనసాగడం కష్టంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం తాజా, మాజీ ఎమ్మెల్యేల సహకారం కూడా లేకపోవడంతో కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పార్టీ కేడర్ ను నిలబెట్టుకోవాలని అధిష్టానం పాట్లుపడుతుండగా, పార్టీ సీనియర్లు మాత్రం చోద్యం చూస్తున్నారు. నేతలు తీరుమార్చుకోకపోతే రానున్న పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కష్టాలు తప్పవు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి అధికారం కోల్పోవడంతో లోకల్ లీడర్లు డైలమాలో పడ్డారు. పార్టీలో కొనసాగాలా? ఇతర పార్టీలోకి వెళ్లాలా అనేది ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీ లీడర్లంతా చేరారు. ఇంతకాలంపార్టీలో పదవులు అనుభవించారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా గెలిచినవారున్నారు. ఇతరపార్టీల నుంచి వలసవచ్చినవారున్నారు. ప్రస్తుతం సుమారు 80శాతం మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ కు చెందినవారే. అయితే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికే ప్రియార్టీ ఉంటుంది. నిధుల నుంచి మొదలుకొని ఏ పనియినా కావాలంటే అధికారపార్టే కీలకం. దీంతో స్థానికంగా అభివృద్ధి పనులు చేసుకోవాలంటే ఖచ్చితంగా అధికారం అవసరం. లేకుంటే ప్రజల నుంచి సైతం ఒత్తిడి తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో ఐదేళ్లపాటు ఎలా కొనసాగాలన్నది వారిముందున్న లక్ష్యం. దీంతో ఏం చేయాలనే దానిపై సందిగ్ధం నెలకొంది.

హస్తంవైపు చూపు...

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లు పాటు ఆపార్టీకి చెందినవారిదే పెత్తనం కొనసాగుతుంది. దీంతో లోకల్ లీడర్లంతా కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గుచూపుతున్నారు. గ్రామాలకు అధిక నిధులు మంజూరు కావాలన్నా?... సంక్షేమ పథకాలు మొదలుకొని ప్రతీది ప్రియార్టీతో రావాలంటే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన అనివార్య పరిస్థితి. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీ నుంచి తాజా, మాజీ ఎమ్మెల్యేలు సైతం గ్రామాల లీడర్లతో సమావేశం నిర్వహించలేదని సమాచారం. అసెంబ్లీ ఫలితాలు వచ్చి 20రోజులు గడిచినా స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహించి భరోసా కల్పించకపోవడంతో పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలోపార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరునే ప్రస్తుతం వ్యవహరిస్తుండటంతో లోకల్ లీడర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పార్టీ మారితే మేలని అభిప్రాయానికి వచ్చినట్లు కొంతమంది పేర్కొనడం విశేషం.

పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కష్టాలు...

పంచాయతీల్లో చేసిన పనులకు నిధులు మంజూరు కాకపోవడం, ఏకగ్రీవ గ్రామాలకు నగదు ప్రోత్సాహం ఇవ్వకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్రవ్యతిరేకతతో ఉన్నారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో పార్టీని వీడలేదు. నిధులు వస్తాయోననే ఆశతో ఉన్నారు. అయితే ప్రభుత్వ మార్పిడి జరగడంతో స్థానిక నేతలంతా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అదే జరిగితే గ్రామస్థాయిలో గులాబీ పార్టీ ఉనికి ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలను ముందే గుర్తించిన పార్టీ అధిష్టానం స్థానిక ప్రజాప్రతినిధులను కట్టడిచేసే ప్రయత్నాలు షురూ చేసినట్లు సమాచారం. అయితే అధికారం లేనప్పుడు పార్టీలో ఉంటారా? ఉండారా? అనేది పార్టీలో చర్చకుదారి తీసింది. ఏ పార్టీకి అయినా గ్రామం నుంచే బలోపేతం కావడంతో కాంగ్రెస్పార్టీ కూడా దృష్టిసారించినట్లు సమాచారం. హస్తం పార్టీలో గులాబీ స్థానిక ప్రజాప్రతినిధులు చేరితే రాబోయే గ్రామ, మున్సిపల్, పార్లమెంట్ ఎన్నికల్లోనూ గడ్డుపరిస్థితి తప్పదు. ప్రతీకూల ఫలితాలు వచ్చే అవకాశం లేకపోలేదు. మరీ ఏమేరకు కారు దిగకుండా కట్టడిచేస్తారో చూడాలి.

Advertisement

Next Story