హౌసింగ్ భూముల రక్షణకు టెండరింగ్ పూర్తి

by karthikeya |
హౌసింగ్ భూముల రక్షణకు టెండరింగ్ పూర్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆక్రమణలు, కబ్జాలకు గురి కాని హౌసింగ్ శాఖ భూముల పరిరక్షణకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు నడుం బిగించారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాలు కలిగి ఉన్న తెలంగాణ హౌసింగ్ శాఖ భూములు పెద్ద ఎత్తున కబ్జాకు గురి కాగా, మరికొన్ని కోర్టుల్లో వివాదాల్లో నలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి వివాదం లేకుండా, కబ్జాకు గురి కాని భూములను పరిరక్షించాలన్న ఆఫీసర్ల ఆలోచనకు ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. అందుకు అవసరమైన బడ్జెట్‌ను సైతం కేటాయింపులు చేయగా, ఆ శాఖ ఉన్నతాధికారులు వాటిని కాపాడేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. హౌసింగ్ భూములను కాపాడేందుకు కంచె వేసేందుకు టెండరింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. తొందర్లోనే కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు షురూ అవనున్నాయని వెల్లడిస్తున్నారు. హౌసింగ్ భూముల చుట్టూ ప్రీకాస్ట్ గోడల నిర్మాణం చేయనున్నట్టు, ఇందుకు శాఖ అధికారులు రూ.25 కోట్లు కేటాయించినట్టు తెలిసింది. హౌసింగ్ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆఫీసర్లు పేర్కొంటున్నారు.

భూములకు జియో గ్రాఫికల్‌ మ్యాపింగ్

తెలంగాణ రాష్ట్ర హౌసింగ్‌ బోర్డు, డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌(దిల్‌) ఆధీనంలో ఉన్న ల్యాండ్స్‌పై హౌసింగ్ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. హౌసింగ్ బోర్డు ఆధీనంలో ఉన్న భూములు ఆక్రమణలు, కబ్జాలకు గురికాకుండా కాపాడుకోవాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఆ భూముల చుట్టూ కంచె నిర్మించాలని, జియో గ్రాఫికల్‌ మ్యాపింగ్ చేయాలని నిర్ధారించింది. ఈ విషయంలో ఇదివరకే ఆఫీసర్లు ఒక రిపోర్టును ప్రభుత్వానికి అందించగా, అందుకు అవసరమైన నిధులను ఇటీవల ప్రభుత్వం కేటాయించింది. ఈ ఫండ్స్‌తో హౌసింగ్‌ బోర్డు, దిల్‌ పరిధిలో ఉన్న భూముల చుట్టూ ప్రహారీలు తొందర్లోనే నిర్మించనున్నారు.

రెండు విడతలుగా చర్యలు

హౌసింగ్ బోర్డు భూములను పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెండు విడతలుగా చర్యలు చేపట్టనున్నది. తొలి విడతగా ఇదివరకే పనులు నిర్వహించేందుకు టెండర్లను ఇటీవల పూర్తి చేయగా, రెండో విడతకు కూడా టెండర్ల ప్రక్రియతో ముందుకు వెళ్లనున్నారు. మొత్తం 17 ప్రదేశాల్లో ప్రహారీలు, కంచెలు నిర్మించనున్నారు. ఈ నిర్మాణాలు పూర్తి కావడానికి కొంత సమయం పట్టొచ్చని ఆర్ అండ్ బీ శాఖలో ఒక ఉన్నతాధికారి ‘దిశ’కు తెలిపారు. వీలైనంత త్వరగానే నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కోర్టుల్లో వివాదాలున్న భూములకు మాత్రం తాము కంచె వేయలేమని, కబ్జాకు గురైన వాటిని తిరిగి పొందేందుకు న్యాయపరంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed