పెండింగ్ స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్.. ఆ 19 స్థానాలపై ఇవాళ మరోసారి చర్చ..!

by Satheesh |   ( Updated:2023-10-30 06:35:26.0  )
పెండింగ్ స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్.. ఆ 19 స్థానాలపై ఇవాళ మరోసారి చర్చ..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. అనేక దశల్లో వడపోత తర్వాత ఎంపిక చేస్తున్న అభ్యర్థుల జాబితా సర్వత్రా ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో మొదటి దశలో 55 మంది, రెండో దశలో 45 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా పెండింగ్‌లో ఉన్న 19 స్థానాలపై ఫోకస్ పెట్టింది. మూడో విడత జాబితాపై నేడు మరోసారి పార్టీ పెద్దలు చర్చలు జరపబోతున్నారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ముఖ్య నేతలు ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ వేణుగోపాల్‌తో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సమావేశమై పెండింగ్‌లో ఉన్న 19 స్థానాలపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.

వామపక్షాలతో పొత్తు, టీజేఎస్ మద్దతు విషయంలో ఈ సమావేశంలో నేతలు చర్చించే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు మిర్యాలగూడ, వైరా అసెంబ్లీ స్థానాలు తమకు కేటాయిస్తేనే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటామని సీపీఎం నేతలు తేల్చి చెప్పారు. ఇక సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం ఇస్తారని ప్రచారం జరుగుతున్న చెన్నూరు విషయంలో హస్తం పార్టీ కొత్త మెలిక పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. సీపీఐకి కొత్తగూడెం మాత్రమే ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ కేసీ వేణుగోపాల్‌తో స్క్రీనింగ్ కమిటీలో జరగబోయే సమావేశంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed