అసలు దోషుల వివరాలు వెలుగులోకి.. సంచలనంగా మారిన రిమోట్ సెన్సింగ్ రిపోర్ట్

by Gantepaka Srikanth |
అసలు దోషుల వివరాలు వెలుగులోకి.. సంచలనంగా మారిన రిమోట్ సెన్సింగ్ రిపోర్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: లేక్ వ్యూ, లేక్ ఫ్రంట్ వ్యూ అంటూ కొన్ని కంపెనీలు చెరువుల వద్ద ‘రియల్’ ప్రాజెక్టులను చేపట్టాయి. దత్తత తీసుకొని సీఎస్ఆర్ ఫండ్స్‌తో చెరువుల సుందరీకరణ చేస్తామని గత ప్రభుత్వానికి చెప్పాయి. అయితే ఎలాంటి సుందరీకరణ పనులు చేపట్టకుండానే.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టాయి. ఇటీవల తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ రిలీజ్ చేసిన రిపోర్ట్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2014, 2024 గూగుల్ మ్యాపుల ద్వారా జలవనరులు అన్యాక్రాంతమైన తీరును వెలుగులోకి తీసుకురావడం రియల్ ఎస్టేట్ రంగంలో చర్చకు దారి తీసింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఎన్ని చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయన్న విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారికంగా ప్రకటించారు. దీంతో హైడ్రా భవిష్యత్తులో 920 చెరువులు, కుంటలను కాపాడే బాధ్యత చేపడితే ఎన్ని కంపెనీపై ఎఫెక్ట్ పడుతుందోననే ఆసక్తి నెలకొన్నది.

బడా కంపెనీల ప్రాజెక్టుల సైతం..

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పాలగూడ, నెక్నాంపూర్, బండ్లగూడ జాగీర్, గోపన్ పల్లి, కూకట్ పల్లి నుంచి హైటెక్ సిటీ దారి, గచ్చిబౌలి ప్రాంతాల్లో బడా కంపెనీలు చేపట్టిన పలు ప్రాజెక్టులు చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లోనే ఉన్నాయని రిపోర్టు ద్వారా తెలుస్తున్నది. వీటిపై ఏం చర్యలు తీసుకుంటారోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కంపెనీల ప్రాజెక్టులు జల వనరుల చెంతనే ఉన్నాయని ప్రభుత్వానికి రిపోర్ట్ అందింది. ఇందులో కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి. కొన్ని పాక్షికంగా ఉన్నాయి. మరికొన్నింటికి బఫర్ జోన్ ఎఫెక్ట్ కానుందని సమాచారం. అయితే ఈ కంపెనీలన్నీ తాము అన్ని రకాల అనుమతుల తర్వాతే ప్రాజెక్టులు చేపట్టినట్లు ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ద్వారా తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటారా? లేదంటే అనుమతులు ఉన్నాయని వదిలేస్తారా? అన్న చర్చ జోరుగా సాగుతున్నది. సోషల్ మీడియాలో సైతం ఇదే చర్చ నడుస్తున్నది.

అప్రమత్తంగా కొనుగోలుదారులు

2014కి ముందు 225 పూర్తిగా, 196 పాక్షికంగా చెరువులు, కుంటలు అన్యాక్రాంతమయ్యాయి. 2024 వచ్చేసరికి మరో 20 చెరువులు పూర్తిగా, అంతకు ముందు పాక్షికంగా కబ్జాకు గురైన వాటిలో 24 మాయమయ్యాయి. అలాగే ఇంకో 127 కుంటల కబ్జాపర్వం కొనసాగింది. దీంతో ఆయా చోట్ల రూ. వేల కోట్ల పెట్టుబడులతో చేపట్టిన ప్రాజెక్టులపై చర్చలు మొదలయ్యాయి. తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ నివేదిక జనంలోకి వెళ్లిన తర్వాత ఇండ్లు కొనుగోలు చేసేవారిలో అప్రమత్తత పెరిగింది. ఆ జాబితాలో తాము కొనాలనుకునే ఫ్లాట్ల్ ఉంటే ఎలా అనే సందేహంతో వెనుకాముందు అవుతున్నారు. అయితే తమకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని డెవలపర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా, ఎఫ్టీఎల్, బఫర్ జోన్, రిమోట్ సెన్సింగ్ రిపోర్టుల నేపథ్యంలో హెచ్ఎండీఏలో కొన్ని వందల ప్రాజెక్టుల ఫైళ్లు పెండింగులో పడ్డాయని తెలిసింది. వీటికి అనుమతులు లభిస్తాయో లేదోనన్న చర్చ జరుగుతున్నది.

పదేండ్ల నిర్లక్ష్యానికి..

గత ప్రభుత్వం ఓ సారి హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులన్నింటినీ సర్వే చేయించి హద్దురాళ్లను పాతించింది. గూగుల్ మ్యాపులను సర్వే నంబర్లు, కో ఆర్డినేట్స్ తో సహా సిద్ధం చేసి వెబ్ సైట్ లోనూ ఉంచింది. పబ్లిక్ డొమెయిన్ లోనూ ఉన్నాయి. అయినా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కబ్జాలపర్వం కొనసాగింది. చెరువుల పక్కనే పెద్దపెద్ద ప్రాజెక్టులు వెలిశాయి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టాయి. సీఎస్ఆర్ నిధులతో చెరువు సుందరీకరణ చేస్తామని చెప్పిన కంపెనీలు.. ఆ తర్వాత ఎలాంటి పనులు చేపట్టకుండానే మార్కెటింగ్ చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి జలవనరుల సర్వే చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

చర్యలు ఎవరిపై?

రిమోట్ సెన్సింగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం పలు ప్రాజెక్టులు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోనే ఉన్నట్లు తెలుస్తున్నది. జాబితాలోని కో ఆర్డినేట్స్ ను పరిశీలిస్తో ఇందులో ఏయే కంపెనీలు ఉన్నాయో ఈజీగానే తెలుస్తుంది. అయితే ఈ కంపెనీలన్నీ అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాతే ప్రాజెక్టులు మొదలుపెట్టినట్లు చెప్తున్నాయి. అయితే వాటర్ బాడీస్ లో అనుమతులు ఎలా ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? చెరువులకు ఎన్వోసీలు లభించాయా? క్షేత్ర స్థాయి పరిశీలన చేసిన హెచ్ఎండీఏ అధికారులు ఎవరు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు పొందిన వాటిపై యాక్షన్ ఉండదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో డెవలపర్స్ చేపట్టిన రూ.వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకు అనుమతులు జారీ చేసిన హెచ్ఎండీఏ, రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

2014 నుంచి 2023 వరకు చెరువుల కబ్జా ఇలా..

జీరో నుంచి పూర్తిగా కబ్జాకు గురైన చెరువులు: 20

జీరో నుంచి పాక్షికంగా కబ్జాకు గురైన చెరువులు: 57

పాక్షికం నుంచి పూర్తిగా కబ్జాకు గురైన చెరువులు: 24

పాక్షికం నుంచి మరికొంత కబ్జాకు గురైన చెరువులు: ౭౦




Advertisement

Next Story

Most Viewed