శ్రీరఘునాథ ఆలయాభివృద్ధికి రూ.20 కోట్లు ఇవ్వండి.. ఎమ్మెల్యే ధన్ పాల్

by Sumithra |
శ్రీరఘునాథ ఆలయాభివృద్ధికి రూ.20 కోట్లు ఇవ్వండి.. ఎమ్మెల్యే ధన్ పాల్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీరఘునాథ ఆలయాభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు ఇవ్వాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త ప్రభుత్వాన్ని కోరారు. శనివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే ఈ విషయం పై మాట్లాడుతూ ఇందూర్ నగరంలో సుమారు వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన శ్రీరఘునాథ ఆలయం చాలా ఏళ్లుగా ప్రభుత్వాల ఆదరణ కరువై ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందన్న విషయాన్ని ధన్ పాల్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు వేములవాడ రాజన్న, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాలు మాదిరిగానే ఇందూరులోని శ్రీరఘునాథాలయం కూడా చారిత్రక వైభవానికి చిహ్నంగా, ఆధ్యాత్మిక చింతనకు ఆలవాలంగా ఉందని ఆయన అసెంబ్లీలో వివరించారు. ఖిల్లా రామాలయంలో రాముల వారిని దర్శించుకోవడానికి ఉత్తర తెలంగాణలోని భక్తులతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారన్నారు. నిత్యధూప, దీప నైవేద్యాలతో, పూజలు, నిత్యార్చనలతో ఒకప్పుడు అలరారిన ఈ దేవాలయంలో సీతారామస్వామి వారి కళ్యాణ ఉత్సవాలు ఘనంగా జరిగేవని, అలాంటి దేవాలయం ఇప్పుడు పాలకుల నిరాదరణకు గురైందన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి, అక్కడికి వచ్చే భక్తులకు కనీస మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 20 కోట్ల నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తే ఉత్తర తెలంగాణాలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా ఖ్యాతి గాంచడంతో పాటు, పర్యాటకంగానూ ప్రసిద్ధి గాంచుతుందని ఎమ్మెల్యే ప్రభుత్వానికి సూచించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా ఎన్నో కుటుంబాలకు ఉపాధితో ఇక్కడ మేలు జరుగుతుందన్నారు. ఇంతకాలం ప్రభుత్వాలు పట్టించుకోని కారణంగా విలువైన ఆలయ భూములు కబ్జాలకు గురై అన్యాక్రాంతమైనట్లు ఆయన ప్రభుత్వానికి వివరించారు. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు.

Next Story