బీసీల చుట్టూ తెలంగాణ పాలిటిక్స్

by karthikeya |
బీసీల చుట్టూ తెలంగాణ పాలిటిక్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అన్ని పార్టీలూ బీసీ రాగాన్ని ఆలపిస్తున్నాయి. కులగణన, బీసీ రిజర్వేషన్ చుట్టే అన్ని పార్టీలు యాక్టివిటీస్ మొదలుపెట్టాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ఇంకా నాలుగేండ్లు ఉన్నా.. ఇప్పటి నుంచే బీసీ ఎజెండాతో పార్టీలు పావులు కదుపుతున్నాయి. త్వరలో జరగనున్న గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు వచ్చే ఏడాది చివర్లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు పార్టీలు రెడీ అవుతున్నాయి. ఆ దిశగానే సొంత వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి.

కాంగ్రెస్ ఇలా..

సోషల్ జస్టిస్ తమ పార్టీలోనే సాధ్యమని నొక్కిచెప్తున్న కాంగ్రెస్.. స్టేట్ పార్టీ చీఫ్ పోస్టును బీసీ నేతకే ఇచ్చామని చెప్తున్నది. కులగణనను వీలైనంత తొందర్లో కంప్లీట్ చేస్తామని, ఆ తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తామని కొత్తగా ఎన్నికైన పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలోనే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బీసీ సంఘాలు సైతం ప్రభుత్వంపై రిజర్వేషన్ విషయంలో ఒత్తిడి తెస్తున్నాయి.

బీసీల ఐక్యత కోసం..

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికై రెండేండ్లు కొనసాగిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య.. మరో నాలుగేండ్ల పదవీ కాలాన్ని వదులుకుని ఇటీవలే రాజీనామా చేశారు. బీసీలను ఐక్యం చేసి బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తానని, ఇందుకోసమే రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. బీసీ నినాదంతో కొత్త పార్టీ పెట్టాలనే ఒత్తిడి కూడా వస్తున్నదని, అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా చేరాలంటూ కోరుతున్నారని వివరించారు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సహా పలువురు బీసీ ఉద్యమం చేస్తానన్న ఆర్ కృష్ణయ్య నిర్ణయానికి మద్దతు పలికారు. అంతేకాకుండా ఈసారి ఎన్నికల్లో తనకు బీసీలు ఓటు వేస్తే చాలని, రెడ్డీలతో పాటు ఓసీ ఓట్లు తనకు అవసరం లేదని తీన్మార్ మల్లన్న కామెంట్ చేశారు.

బీజేపీపై ఒత్తిడి..

బీజేపీ స్టేట్ చీఫ్ పోస్టును బీసీలకే ఇవ్వాలనే ఒత్తిడి ఆ పార్టీపై పెరుగుతున్నది. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే అమిత్ షా హామీ ఇచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బీసీ వ్యక్తినే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చేయాలంటూ ఆ కమ్యూనిటీ లీడర్లు హైకమాండ్‌కు స్పష్టం చేయాలనుకుంటున్నారు. ఒకవైపు బీసీ జపం చేస్తున్నా మరోవైపు జాతీయ స్థాయిలో కులగణన ప్రక్రియమై భిన్నమైన వైఖరి తీసుకున్నది. జనాభాలో దాదాపు సగం మంది బీసీలు ఉన్నందున ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలంటూ దీర్ఘకాలంగా ప్రధానిని ఓబీసీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. అయినా వారి డిమాండ్ నెరవేరలేదు. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తూ కులగణనకు వెనకాడడాన్ని కాంగ్రెస్ రాజకీయ అస్త్రంగా మల్చుకున్నది. బీసీ ఓటు బ్యాంకు, జనాభాను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి, సంక్షేమంలో మాత్రమే కాక రాజకీయపరంగానూ న్యాయమైన వాటా దక్కాలని బీసీ సంఘాలు అన్ని పార్టీలను, ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాయి. పార్టీలకు అతీతంగా బీసీలను ఐక్యం చేయాలన్న ప్రతిపాదనలు కూడా కొన్ని తెరమీదకు వస్తున్నాయి. దీనికి ఆర్ కృష్ణయ్య చొరవ తీసుకుంటారా?... లేక మరో రూపంలో వేదిక ఉనికిలోకి వస్తుందా?.. అనేది కీలకంగా మారింది.

బీఆర్ఎస్ రాష్ట్రాల టూర్..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశం మేరకు కొద్దిమంది బీసీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో దీర్ఘకాలంగా 69% రిజర్వేషన్ విధానం అమలవుతున్నందున అక్కడి బీసీ మంత్రిత్వశాఖ, బీసీ కమిషన్ పెద్దలతో బీఆర్ఎస్ బృందం సమావేశమైంది. రాజ్యాంగ సవరణ ద్వారా 69% చట్టబద్ధత పొందడానికి అనుసరించిన విధానాలు, ఇప్పుడు ఆ చట్టంతో బీసీలకు కలుగుతున్న లబ్ధి తదితరాలపై ఆ బృందం స్టడీ చేస్తున్నది. ఇతర రాష్ట్రాల్లోనూ బీసీ కులగణన చేపట్టినందున తెలంగాణలోనూ బీసీలకు అన్యాయం జరగరాదన్న ఉద్దేశంతో ఎలాంటి మార్గదర్శకాలు అనుసరించాలో ప్రభుత్వానికి సూచించేలా ఈ టూర్ సాగుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దూరమైనందున రాబోయే ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకును పటిష్టంగా ఉంచుకునేలా ఈ వైఖరిని ఎంచుకున్నది.

Advertisement

Next Story

Most Viewed