Cell phones Recovery: 6 నెలల్లో 2 వేల సెల్‌ఫోన్లు రికవరీ చేసిన తెలంగాణ పోలీసులు

by Mahesh |   ( Updated:2024-10-23 12:28:45.0  )
Cell phones Recovery: 6 నెలల్లో 2 వేల సెల్‌ఫోన్లు రికవరీ చేసిన తెలంగాణ పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్/ శేరిలింగంపల్లి: తక్కువకు వస్తున్నాయని సెల్ ఫోన్లను కొన వద్దని, దొంగతనం అయిన ఫోన్లు కొన్నా.. కలిగి ఉన్నా నేరమే అని సైబరాబాద్ క్రైమ్ డీసీపీ నరసింహ్మా అన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం అయిన, పోగొట్టుకున్న 800 ఫోన్లను బుధవారం బాధితులకు అప్పగించారు. వీటిలో ఐ ఫోన్లతో పాటు పలు విలువైన మొబైల్ ఫోన్లు ఉన్నాయి. కొందరు ఫోన్లు సంవత్సరం తర్వాత దొరకగా, ఇంకొన్ని 15 రోజుల్లోనే రికవరీ కావడం విశేషం. పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి పొందిన బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ నరసింహ్మా మాట్లాడుతూ.. గతంలో చైన్ స్నాచింగ్ లు, ఇళ్లల్లో దొంగతనాలు జరిగేవి కానీ ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ల దొంగతనాలు, సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తు చేశారు. కొన్నిసార్లు అనుకోకుండా, మరికొన్ని సార్లు దొంగలు మొబైల్ ఫోన్స్ చోరీ చేస్తున్నారని అలా రోజుకు చాలా ఫోన్లు చోరీలకు గురవుతున్నాయని అన్నారు. పోలీసులు నిర్విరామంగా పని చేసి, వ్యయప్రయాసలకు ఓర్చి ఫోన్లను రికవరీ చేశారని, సైబరాబాద్ లో చోరీకి గురై దేశంలో ఎక్కడెక్కడో ఉన్న ఫోన్లను తిరిగి తెప్పించామని అన్నారు.

పోలీసులు ఎప్పుడూ మన రక్షకులేనన్న ఆయన పోలీసుల మీద నెగిటివ్ ఫీలింగ్ తీసేయాలని ప్రజలకు సూచించారు. పోలీసు వ్యవస్థ సమాజంలో సత్ప్రవర్తన కల్పించేందుకు కృషి చేస్తుందని, సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది సమాజంలో ఉన్న మంచి వారికేనని, అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా ఉంటామని డీసీపీ నరసింహ్మా స్పష్టం చేశారు. నగరంలో దొంగతనం అయిన ఫోన్లు అసాంఘిక శక్తుల చేతులకు వెళ్తున్నాయని, సాధ్యమైనంత వరకు ఫోన్లు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని, సెకండ్ హ్యాండ్ ఫోన్లను అసలే కొనవద్దని అన్నారు. దొంగ సొమ్ములను ఎవరు కొనవద్దని అవి కొన్నా, మీ దగ్గర ఉన్నా నేరమే అని అన్నారు. యూపీఐ పేమెంట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని, చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉన్నాయా, లేదా ఎవరైనా గమణిస్తున్నారా అన్నది పరిశీలించాలని అన్నారు. అలాగే యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరాలు జరిగితే 1930 డయల్ చేయాలని డీసీపీ సూచించారు. పోగొట్టుకున్న ఫోన్ల రికవరీలో కీలకంగా వ్యవహరించిన సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లను డీసీపీ నరసింహ్మా అభినందించారు.

నాలుగు విడతల్లో 1760 ఫోన్లు రికవరీ

గత నాలుగు విడతల్లో సైబరాబాద్ పరిధిలో చోరీకి గురైన 1760 ఫోన్లను రికవరీ చేశారు. మొదటి విడతలో 100, రెండో విడతలో 300, మూడవ విడతలో 560, నాలుగో విడతలో 800 ఫోన్లను రికవరీ చేశారు. నాలుగో విడతలో మొత్తంగా మాదాపూర్ సీసీఎస్ జోన్ పరిధిలో 135, బాలానగర్ జోన్ పరిధిలో 140, మేడ్చల్ జోన్ పరిధిలో 101, రాజేంద్రనగర్ జోన్ పరిధిలో 133, శంషాబాద్ జోన్ పరిధిలో 72, ఐటీ సెల్ పరిధిలో 105, మేడ్చల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 114 ఫోన్లు మొత్తంగా 800 ఫోన్లు రికవరీ చేశారు. పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి పొందిన బాధితులు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story