తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది: హోంమంత్రి మహమూద్ అలీ

by Kalyani |
తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది: హోంమంత్రి మహమూద్ అలీ
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, ప్రజల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోచారంలో ఏర్పాటు చేసిన నూతన ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హోంమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణా పోలీస్ శాఖ శాంతి భద్రతల నిర్వహణలో అద్భుతంగా పని చేస్తోందని, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు.

నగరంలోని మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాల ద్వారా నేరాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం మరిన్ని పోలీస్ స్టేషన్ల ఏర్పాటు జరుగుతుందని, పోలీసు శాఖకు అవసరమైన అన్ని రకాల తోడ్పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందిస్తామని తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని అన్ని సిసిటివి కెమెరాలు అనుసంధానం చేయడబడతాయని, తద్వారా నేర పరిశోధన వేగవంతం అవుతుందని పేర్కొన్నారు.

బొర్ర ఉంటే ప్రమోషన్లు ఇవ్వద్దు: మంత్రి

కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులకు బొర్ర ఉంటే ప్రమోషన్లు ఇవ్వద్దని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీసింగ్ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు. అయితే పోలీసులు మంచి ఫిట్ నెస్ తో ఉండాలని సూచించారు. పోలీసులు అంటే దొంగలు భయపడేలా ఉండాలని, అందుకోసం ప్రతి పోలీస్ శారీర సౌష్టవాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఠాణాలో జిమ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే పోలీసులు అధిక బరువు సమస్యపై చాలా కాలంగా చర్చ జరుగుతుంది. హోంమంత్రి, మహముద్ అలీ, డీజీపీ అంజనీకుమార్ ల ముందే మంత్రి మల్లారెడ్డి కాంట్రవర్సీ కామెంట్ చేయడం గమానార్హం. మంత్రి కామెంట్ తో పోలీసులు ఫిట్ నెస్ గా ఉండాలని కొంత మంది వాధిస్తుంటే.. మరికొందరు. వయసు రీత్యా ఆనారోగ్యంతో ఆధిక బరువు సమస్యతో బాధపడుతున్న పోలీసులకు ఇలాంటి మంత్రి వ్యాఖ్యలు మానసికంగా వేధిస్తుంటాయని వాదిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజని కుమార్ ఐపిఎస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని శాంతి భద్రతల పరంగా ఉన్నత స్థానంలో ఉంచడానికి రాష్ట్ర పోలీసులు శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్తగా 70 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. గతంలో ఉన్న హైదరాబాద్ , సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లతో కలిపి ప్రస్తుతం తొమ్మిది కమిషనరేట్ లు తెలంగాణలో పనిచేస్తున్నాయని తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఐపిఎస్ మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేస్తున్న పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ ద్వారా ఈ ప్రాంతంలో నేర శాతం తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు.

పోచారం ఐటి కారిడార్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రపంచ స్థాయి కార్పొరేట్ కంపెనీలు, ప్రముఖ ఐటి కంపెనీలు ఇక్కడ పని చేస్తున్నాయని తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాచకొండ జాయింట్ కమిషనర్ సత్యనారాయణ ఐపిఎస్, ఎస్ఓటి డీసీపీలు గిరిధర్, మురళీధర్, అదనపు డీసీపీ అడ్మిన్ నర్మద, జిల్లా చైర్మన్ శరత్ చంద్రా రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ దయాకర్ రెడ్డి, పోచారం స్థానిక చైర్మన్ కొండల రెడ్డి, వైస్ చైర్మన్ నాయక్, కౌన్సిలర్ ధనలక్ష్మి, ఎసిపిలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed